
Chandrababu- BJP: కొందరి నేతలు మనస్తత్వం కొన్ని పార్టీలకే సూట్ అవుతోంది. అవసరాల కోసం వేరే పార్టీలో చేరినా వారి ధ్యాస మాతృ పార్టీపైనే ఉంటోంది. కేవలం అడ్జస్టన్సీ కోసమే వారు పార్టీ మారుతుంటారు తప్ప ఇంకొకటి ఉండదు. ఏపీలో గత ఎన్నికల అనంతరం చాలామంది టీడీపీ నాయకులు బీజేపీలో చేరారు. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ 23 ఎమ్మెల్యే స్థానాలు, 3 ఎంపీ స్థానాలను గెలుపొందింది. కానీ బీజేపీకి మాత్రం బోణీ పడలేదు. సరికదా ఓట్ల శాతం కూడా దాటలేదు. అటువంటి పార్టీలోకి ఏకంగా నలుగురు ఎంపీలు వెళ్లారు. తాజా మాజీ మంత్రులు కూడా క్యూకట్టారు. అయితే అటువంటి వారంతా ఇప్పుడు టీడీపీకి టర్న్ అవుతున్నారు. వారంతా తమ అవసరాల కోసం వెళ్లారు తప్ప.. బీజేపీ విధానాలకు ఆకర్షితులయ్యో వెళ్లలేదు.
ఇప్పుడు బీజేపీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి గుడ్ బై చెప్పారు. రేపోమాపో టీడీపీలో చేరేందుకు సిద్ధపడుతున్నారు. అయితే ఆయన బాటలోనే సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిలు ఉన్నట్టు తెలుస్తోంది. సీఎం రమేష్ మాత్రం కొద్దిరోజులు అక్కడ పరిస్థితులన్నీ స్టడీ చేశాక బయటకు వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం. అయితే ఈ నలుగురు రాజ్యసభ సభ్యులను ప్రత్యేక టాస్క్ ఇచ్చి చంద్రబాబే బీజేపీలోకి సాగనపంపారు. బీజేపీ హైకమాండ్ కు ఈ విషయం తెలియంది కాదు. కానీ రాజ్యసభలో సంఖ్యాబలం తక్కువగా ఉండడంతో అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఆహ్వానించారు. అదే సమయంలో ఢిల్లీ పెద్దల్లో చంద్రబాబుపై ఉన్న కోపాన్ని ఈ నలుగురు నాయకులు కొంతవరకూ తగ్గించగలిగారు. బీజేపీతో టీడీపీకి పొత్తుకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించగలిగారు.
అయితే బీజేపీ నేతలను చేర్చుకునే క్రమంలో చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రూపొందించారు. కన్నా లక్ష్మీనారాయణ తాను పార్టీ వీడడానికి సోము వీర్రాజే కారణమని ఆరోపించారు. అటు జీవీఎల్ పై కూడా విమర్శలు చేశారు. బీజేపీ హైకమాండ్ తనను అన్నివిధాలా ప్రోత్సహించిందని.. ప్రధాని మోదీ విజనరీకి ఇప్పటికీ తాను అభిమానినే అంటూ కన్నా వ్యాఖ్యలు వెనుక చంద్రబాబు స్క్రిప్ట్ ఉందన్న అనుమానం ఉంది. ఒక వైపు పొత్తుకు ప్రయత్నిస్తునే కన్నాను లాగేయడంపై హైకమాండ్ పెద్దలు ఆగ్రహిస్తారని తెలుసు. అందుకే సోము వీర్రాజు, జీవీఎల్ పై విమర్శలు చేయించి ముందే జాగ్రత్తపడ్డారు. ఆ ఇద్దరు నేతల వైఖరి వల్లే రాష్ట్రంలో బీజేపీ దెబ్బతింటోందన్న సంకేతాలు పంపించేందుకు ప్రణాళిక వేసుకున్నారు. సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, ఆదినారాయణరెడ్డిలను పార్టీలో చేర్చుకునేందుకు ప్లాన్ రూపొందించారు.

ప్రస్తుతానికి చంద్రబాబు సోము వీర్రాజు, ఎంపీ జీవిఎల్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నారు. కన్నా లక్ష్మీనారాయణతో పాటు జిల్లాలో బీజేపీ నాయకులను టీడీపీ గూటికి తెచ్చే ప్లాన్ లో ఉన్నారు.వారితో సోము వీర్రాజుపై విమర్శలు చేయించనున్నారు. ఆయన వైఖరితోనే తాము బీజేపీని వీడుతున్నట్టు చెప్పించనున్నారు. బీజేపీతో పొత్తుకు సోము వీర్రాజు, జీవీఎల్ అడ్డుపడుతున్నారని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే హైకమాండ్ లో వారిద్దర్నీ పలుచన చేయ్యాలని చూస్తున్నారు. మొత్తానికైతే చంద్రబాబు మాస్టర్ ప్లాన్ తోనే బీజేపీ నేతలు ఒక్కొక్కరూ పార్టీని వీడుతున్నారన్న మాట. ఒక వైపు పొత్తుకు ప్రయత్నిస్తునే అదే పార్టీతో మైండ్ గేమ్ ఆడుతున్నారు.
