Kavitha comments on BJP Merger : హస్తంలోకి గులాబీ సుప్రీం కూతురు చేరబోతున్నారని.. కాంగ్రెస్ పార్టీ పెద్దలతో మంతనాలు కూడా జరిపారని..గులాబీ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ పార్టీలో తీసుకొస్తానని మాట ఇచ్చారని.. దానికి మంత్రి పదవి కావాలని ఆమె అడిగారని.. అందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఒప్పుకున్నారని.. చివరికి తెలంగాణ చీఫ్ మినిస్టర్, పిసిసి ప్రెసిడెంట్ దానికి అడ్డు తగిలారని వేమూరి రాధాకృష్ణ పత్రిక గురువారం నాటి ఎడిషన్ లో ఒక కథనాన్ని ప్రచురించింది. దీనిని కల్వకుంట్ల కవిత ఖండించారు. ఫేక్ న్యూస్ అని కొట్టి పారేశారు. అంతకుముందు బుధవారం నాటి ఎడిషన్ లో కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వర్తమానం పంపారని.. ఆ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దలు రేవంత్, మహేష్ కుమార్ దృష్టికి తీసుకెళ్తే.. వారు వద్దన్నారని ఓ కథనాన్ని వేమూరి రాధాకృష్ణ పత్రిక ప్రచురించింది. అయితే దీనిని కూడా కల్వకుంట్ల కవిత ఖండించారు.
అయితే గురువారం నాటి ఎడిషన్ లో గులాబీ సుప్రీం కూతురిపై వేమూరి రాధాకృష్ణ పత్రిక తాటికాయంత అక్షరాలతో బ్యానర్ కథనాన్ని ప్రచురించిన నేపథ్యంలో.. భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ స్పందించక తప్పలేదు. ఉదయాన్నే వేమూరి రాధాకృష్ణ పేపర్ క్లిప్పింగ్ ను తన సోషల్ మీడియా ఎకౌంట్లో పోస్ట్ చేస్తూ.. ఫేక్ న్యూస్ అని ముద్రవేశారు. అయితే దీనిపై గులాబీ ఆస్థాన మీడియా ఎటువంటి ఖండన చేయలేదు. కౌంటర్ అటాక్ మొదలుపెట్టలేదు. తనపై వస్తున్న ప్రచారానికి చెక్ పెట్టేందుకు నేరుగా గులాబీ సుప్రీం డాటర్ రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అవి కాస్త తెలంగాణ రాజకీయాలలో పెను దుమారాన్ని రేపుతున్నాయి.
Also Read : తండ్రితో విభేదాలు.. కవిత కొత్త పార్టీ..ఈ ప్రచారానికి ఎప్పుడు ఫుల్ స్టాప్?!
” భారత రాష్ట్ర సమితిని భారతీయ జనతా పార్టీలో విలీనం చేయడానికి కుట్ర జరుగుతుంది. నేను నా తండ్రికి రాసిన లేఖను బయటపెట్టింది ఎవరు? ఆ పని చేసిన భారత రాష్ట్ర సమితి నాయకులు ఎవరు ఇప్పుడు నాకు తెలియాలి. ఇంటి ఆడబిడ్డ మీద పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తే ఏమొస్తుంది.. నేను జైలుకు వెళ్ళినప్పుడు పార్టీకి.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పాను. నాడు ఇదే విషయాన్ని గులాబీ సుప్రీం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లాను. కాని దానికి ఆయన వారించారు. అందువల్ల నేను పార్టీలో ఉన్నాను. ఎమ్మెల్సీ పదవీలో కొనసాగుతున్నానని” కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. అయితే ఇటీవల ఆమె రాసిన లెటర్స్ బయటకు రావడం.. ఆ తర్వాత ఆమె తన తండ్రిని దేవుడని చెప్పి.. ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని వ్యాఖ్యానించడం.. ఇప్పుడేమో ఢిల్లీ లిక్కర్ స్కాం లో తాను అరెస్ట్ అయినప్పుడు పార్టీకి.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానంటే కేసీఆర్ వద్దని వారించారని అనడం.. భారతీయ జనతా పార్టీలో భారత రాష్ట్ర సమితిని విలీనం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించడం.. మొత్తంగా ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాలలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అయితే కల్వకుంట్ల కవిత చెయ్యి అనుకోవడానికి సిద్ధపడ్డారని వేమూరి రాధాకృష్ణ పత్రిక రాసింది. కానీ ఆమెనేమో ఏకంగా భారతీయ జనతా పార్టీలో భారత రాష్ట్ర సమితిని విలీనం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని వ్యాఖ్యలు చేయడం సంచలనం కలిగిస్తోంది.
