Karnataka Groom: ఔను వాళ్లిద్దరు ప్రేమించుకున్నారు. ఊసులు పంచుకున్నారు. ఆశలు పెంచుకున్నారు. భవిష్యత్ పై బంగారు బాటలు వేయాలనుకున్నారు. ఇద్దరు ఏకమై ప్రపంచాన్నే జయిద్దామనుకున్నారు. ప్రేమకు తామే నిర్వచనం చెప్పాలని భావించారు. తానొకటి తలిస్తే దైవమొకటి తలచిందన్నట్లుగా విధి వారి జీవితాన్ని వెక్కిరించింది. వారి భవిష్యత్ ను కకావికలం చేసింది. చేసుకున్న బాసలు మరిచిపోయేలా చేసింది. చెప్పుకున్న ఊసులు ఊసేలేకుండా పోయాయి. బంగారంలాంటి జీవితం బాధలమయంగా మారిపోయింది. విధి విసిరిన గాలంలో వారు బందీలయ్యారు.

కర్ణాటక రాష్ట్రంలోని తిపటూరు తాలూకాలోని హిండిస్కెర గ్రామంలో చోటుచేసుకున్న ఈ విషాద ప్రేమ కథ గురించి తెలుసుకుంటే బాధ కలుగుతుంది. అదే ప్రాంతంలో నిఖిల్, చైత్ర అనే ఇద్దరు తురువెకెరెలోని ఓ మొబైల్ దుకాణంలో విధులు నిర్వహిస్తున్నారు. వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగి మనసులు కలుసుకున్నాయి. ఊసులు పెనవేసుకున్నాయి. దీంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అది పెళ్లి వరకు దారి తీసింది.
Also Read: తెలంగాణ కాంగ్రెస్ నాయకులను అధిష్టానం ఎందుకు నమ్మడం లేదు…!
దీంతో పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవాలని ఇంటినుంచి వెళ్లిపోయారు. ఫిబ్రవరి 4న గుడిలో దండలు మార్చుకున్నారు. అనంతరం మూడు రోజులకు ఇండిస్కెర గ్రామంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని సంసారం చేయడం ప్రారంభించారు. కొత్త జంట ముచ్చట్లు ముచ్చట గొలిపేవి. ఇద్దరు అన్యోన్యంగా ఉంటున్న సమయంలో నిఖిల్ తన తల్లి ఆరోగ్యం బాగా లేదని ఆస్పత్రిలో చూపించి వస్తానని చెప్పి వెళ్లాడు. తరువాత తిరిగి రాలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ స్విచాఫ్ వచ్చింది.
ఈ క్రమంలో చైత్ర నిఖిల్ సొంతూరుకు వెళ్లింది. అక్కడ నిఖిల్ తండ్రి చైత్రని దూషిస్తూ తిప్పి పంపించాడు. దీంతో ఇప్పుడు చైత్ర ఒంటరిదైంది. అటు తల్లిదండ్రుల సహకారం లేదు. ఇటు భర్త ఇంటికి రావడం లేదు. ఇప్పుడు ఆమె ఏం చేయాలి? పోలీసులు ఆశ్రయించి తన భర్తను తనతో ఉండేలా చేయాలని అభ్యర్థించింది. కానీ ఆమె కోరికను పోలీసులు మన్నించినా నిఖిల్ తండ్రి ఒప్పుకుంటాడా? ఆమె కాపురం నిలబడుతుందా? లేదా? అనే సందేహాలు అందరిలో వస్తున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి చైత్ర బలవ్వాల్సిందేనా? ఆమెకు రక్షణ కల్పించే వారెవరు అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.
Also Read: చైనా పంచన చేరి చితికిన శ్రీలంకకు భారత్ ఎందుకు సాయం చేస్తుంది..?