Homeజాతీయ వార్తలుKarnataka Election: కర్ణాటక ఎన్నికల ఓపినియన్‌ పోల్‌..గెలుపు ఎవరిదంటే?

Karnataka Election: కర్ణాటక ఎన్నికల ఓపినియన్‌ పోల్‌..గెలుపు ఎవరిదంటే?

Karnataka Election
Karnataka Election

Karnataka Election: పొరుగున ఉన్న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు మే 10న ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. మే 13న ఓట్ల లెక్కింపు జరుగనున్నది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్‌ సమరానికి సన్నద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలో మళ్లీ అధికారం ఎవరికి అన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఎడుప్రెస్‌ గ్రూప్‌ నిర్వహించిన ఒపీనియన్‌ పోల్‌లో మళ్లీ అధికారం బీజేపీదే అని తెలిపింది.

ప్రభుత్వ పనితీరుపై ఒపీనియన్‌..
ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో ఒపీనియన్‌ పోల్స్‌ సందడి కూడా మొదలైంది. వివిధ సంస్థలు ఒపీనియన్‌ పోల్స్‌ను వెల్లడిస్తున్నాయి. తాజాగా ఎడ్యుప్రెస్‌ గ్రూప్‌ ఒపీనియన్‌ పోల్‌ను వెల్లడించింది. కర్ణాటకలోని దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ సంస్థ సర్వే చేపట్టింది. అన్నివర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఈ సర్వేలో సీఎం బసవరాజ్‌ బొమ్మై సహా ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ పనితీరును అడిగి తెలుసుకుంది. ఈ ఒపీనియన్‌ పోల్‌ ప్రకారం – ఈ ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి వచ్చేది బీజేపీనేనని అంచనా వేసింది. సంపూర్ణ మెజారిటీతో బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించవచ్చని తెలిపింది. 1985 నుంచి కర్ణాటకలో వరుసగా రెండు ఎన్నికల్లో విజయం సాధించి ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోవడం గమనార్హం.

కమలం ఖాతాలో.. 110 సీట్లు
ఎడుప్రెస్‌ గ్రూప్‌ నిర్వహించిన ఒపీనియన్‌ పోల్‌ ప్రకారం.. మొత్తం 224 నియోజకవర్గాల్లో బీజేపీ 110–120 సీట్లు గెలుచుకుంటుందని పేర్కొంది. మరోసారి కాంగ్రెస్‌ ప్రతిపక్ష పాత్ర పోషించక తప్పదని అభిప్రాయపడింది. కాంగ్రెస్‌కు 70–80 సీట్లు దక్కొచ్చని తెలిపింది. అదే సమయంలో జేడీఎస్‌ (జనతాదళ్‌–సెక్యులర్‌) 10–15 సీట్లు మాత్రమే వస్తాయని అంచనా వేయబడింది. ఇతరులు 4 నుంచి 9 సీట్లు పొందవచ్చని అభిప్రాయపడింది.

బీజేపీకి 43 శాతం ఓట్లు
ఎడుప్రెస్‌ గ్రూప్‌ అనేది దక్షిణ భారతదేశ ఎన్నికల విశ్లేషణ సంస్థ. కర్ణాటకలోని 50 నియోజకవర్గాలు, 183 పోలింగ్‌ కేంద్రాల్లో 18,331 మంది మధ్య ఈ సర్వే నిర్వహించింది. సర్వే ప్రకారం బీజేపీకి 43 శాతం, కాంగ్రెస్‌కు 37 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. కర్ణాటక ప్రజలు బీజేపీ నేత బీఎస్‌కు మద్దతు ఇస్తున్నారని సర్వే వెల్లడించింది.

సీఎంగా యడ్యూరప్పకు ఓటు..
యడ్యూరప్పను సీఎంగా చూడాలన్నారని వెల్లడించింది. సర్వే ప్రకారం.. రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడుగా యడ్యూరప్ప నిలిచారు. ఈ సర్వేలో పాల్గొన్న 23 శాతం మంది ప్రజలు యడ్యూరప్పను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నట్లు తెలిపింది. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత జగదీశ్‌ శెట్టర్‌ పాపులారిటీ పరంగా రెండో స్థానంలో ఉన్నారు. కాబోయే సీఎంగా 22 శాతం మంది ఆయనకే ప్రాధాన్యతనిస్తున్నారనీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య మూడో అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా 20 శాతం మంది ఇష్టపడుతున్నారని సర్వే అభిప్రాయపడింది. కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను సీఎంగా చూడాలని 19 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నారనీ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్‌–సెక్యులర్‌ నాయకుడు హెచ్‌డీ కుమారస్వామిని కేవలం 10 శాతం మంది ఇష్టపడుతున్నారని తెలిపింది. లాస్ట్‌ బట్‌ నాట్‌ లీస్ట్‌ ప్రస్తుత సీఎం బసవరాజ్‌ బొమ్మై సీఎం కావాలని కేవలం 5 శాతమే కోరుకుంటున్నారు.

Karnataka Election
Karnataka Election

అవినీతి ఆరోపణల ప్రభావం
ప్రస్తుత సీఎం బొమ్మైపై అవినీతి ఆరోపణలు కూడా ప్రభావం చూపుతున్నట్లు సర్వేలో తేలింది. పార్టీలోని అంతర్గత విభేదాలు కూడా బీజేపీకి చేటు తెచ్చేలా కనిపిస్తున్నాయి. నాయకులను మార్చడం వల్ల ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలు వస్తాయని చాలా మంది ఓటర్లు విశ్వసించారనీ, సర్వే ప్రకారం రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం కొనసాగాలని ఓటర్లు కోరుకుంటున్నారు. ప్రస్తుతం బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్‌ కూడా గట్టి పోటీనిస్తోందనీ, బీఎస్‌.యడ్యూరప్ప కర్ణాటకలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ఎదుగుతున్నారని సర్వే అభిప్రాయ పడింది.

మొత్తంగా ఓపీనియన్‌ పోల్స్‌ పరిశీలిస్తే బీజేపీ కర్ణాటకలో చరిత్ర సృష్టించబోతున్నట్లు తెలుస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular