
IPL 2023 Gujarat Vs Chennai: క్రికెట్ పండుగ ఐపీఎల్‌కు సమయం ఆసన్నమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ వేడుక ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఐపీఎల్ ఆరంభ వేడుకలు జరుగుతాయి. ఆ తర్వాత 7.30 గంటలకు డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఈ సీజన్ తొలి మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ సమయంలో ఇక్కడ వర్షం పడే అవకాశం ఉందా? అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.
గుజరాత్‌లో వర్షాలు..
గుజరాత్‌లోని పలు జిల్లాల్లో గురువారం నాడు బాగా వర్షాలు పడ్డాయి. దీంతో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 6 డిగ్రీల వరకు తగ్గిపోయాయి. ఈ విషయం తెలిసిన క్రికెట్ ప్రేమికుల టెన్షన్ మరింత పెరిగింది. మ్యాచ్ సమయంలో అహ్మదాబాద్‌లో వర్షం పడుతుందేమో? అని వాళ్లు భయపడుతున్నారు. అయితే అలాంటి భయం ఏమీ అక్కర్లేదని వాతావరణ శాఖ చెప్తోంది. రాష్ట్రంలో మిగతా చోట్ల ఎలా ఉన్నా.. అహ్మదాబాద్ మాత్రం సేఫ్ అని తెలుస్తోంది.
టెన్షన్ పడొద్దంటున్న వాతావరణ శాఖ..
వర్షం క్రికెట్ అభిమానులను టెన్షన్ పెడుతుండగా, వాతావరణ శాఖ మాత్రం టెన్షన్ అవసరం లేదంటోంది. అహ్మదాబాద్‌లో మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడే అవకాశం ఏమాత్రం లేదని స్పష్టం చేసింది. అలాగే ఉష్ణోగ్రతలు కూడా 34 నుంచి 23 డిగ్రీల సెల్సియస్ మధ్యలో ఉంటాయని అంచనా వేస్తోంది. గాలిలో తేమ కూడా పెద్దగా ఉండదు. ఐపీఎల్ ఆరంభ వేడుకలు మొదలైనప్పటి నుంచి మ్యాచ్ ముగిసే వరకు ఆకాశంలో కనీసం మబ్బులు కూడా పెద్దగా కనిపించవని వాతావరణ శాఖ అంచనా వేసింది.

చేజింగ్ జట్టే విజేత..
ఇక పిచ్ విషయానికి వస్తే.. అహ్మదాబాద్ పిచ్ ఎక్కువగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. అయితే మ్యాచ్ జరిగే కొద్దీ స్పిన్నర్లు ప్రభావం చూపించే అవకాశం చాలా ఎక్కువ. ఇక్కడ తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 170. అంతేకాదు, ఎక్కువగా చేజింగ్ చేసే టీం గెలిచే అవకాశం ఉంటుంది. దానికితోడు గతేడాది ఈ రెండు జట్లు తలపడిన రెండు మ్యాచుల్లోనూ గుజరాత్ చేజింగ్ చేసింది. ఈ రెండింట్లోనూ గుజరాత్ విజయం కూడా సాధించింది. దీంతో ఈసారి ఎలాగైనా గెలవాలని చెన్నై పట్టుదలగా కనిపిస్తోంది.