Kapu vs Balija: ఏపీలో కాపుల మధ్య చీలిక తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా? కాపు నినాదం పతాక స్థాయికి చేరుతున్న తరుణంలో తమకు నష్టం తప్పదని ప్రధాన రాజకీయ పక్షాలు భావిస్తున్నాయా? అందుకే కాపుల నుంచి బలిజలను వేరుచేయాలని ప్రయత్నిస్తున్నాయా? కాపులను విభజిస్తే కానీ ఈసారి ఎన్నికల్లో గెలవలేమని భావిస్తున్న ఓపార్టీ కొత్త ఎత్తుగడ వేసిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణమాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఉమ్మడి ఏపీలోనైనా.. అవశేష ఆంధ్రప్రదేశ్ లోనైనా కాపుల సంఖ్య ఎక్కువ. కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పుకాపు,బలిజ కాపు.. వీరంతా కాపుల కిందే వస్తారు. రాష్ట్ర జనాభాలో 30 శాతంతో కాపులదే అగ్రస్థానం. అయితే మిగతా అగ్రవర్ణాలు ముందే ఊహించినట్టున్నారు. అందుకే కాపులను ఇన్ని ఉప కులాలుగా విభజించారు. వారిని ఒక ఓటు బ్యాంక్ గా మలుచుకున్నారు. రాజ్యాధికారం రాకుండా ఎన్నిరకాల ప్రయోగాలు చేశారో.. అన్నీ చేశారు. ఇప్పుడు పవన్ రూపంలో కాపులకు ఒక చాన్స్ రానుండడంతో దానికి చెక్ చెప్పేందుకు.. కాపుల మధ్య చిచ్చుపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. బలిజలను కాపులపై ఎగదోస్తున్నారు.

ఇటీవల విశాఖను వేదికగా చేసుకొని కాపునాడు సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. వంగవీటి మోహన్ రంగా వర్థంతిని పురస్కరించుకొని రంగా,రాధా రాయల్ అసోసియేషన్ పేరిట నిర్వహించిన సభకు ఒక్క వైసీపీ మినహా అన్ని రాజకీయ పక్షాలకు చెందిన కాపు నేతలు హాజరయ్యారు. అయితే ఈ సభను ఫెయిల్యూర్ గా చూపించే ప్రయత్నాలు మొదలయ్యాయి.కాపులంటే ఒక్క కోస్తా జిల్లాల వారేనా? రాయలసీమలో బలిజలు కాపులు కాదా అన్న ఒక కొత్త నినాదం ప్రారంభమైంది. మూడు దశాబ్దాల కిందట ఎన్టీఆర్ రాయలసీమలో బలిజలకు 10 ఎమ్మెల్యే సీట్లు ఇస్తే.. ఇప్పటి రాజకీయ పక్షాలు ఎన్ని స్థానాలు కేటాయిస్తున్నాయని ప్రశ్నించడం ద్వారా బలిజ అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. రాష్ట్రంలో కాపులు 28 శాతం ఉంటే.. అందులో రాయలసీమ బలిజలే 14 శాతం ఉన్నారు. గంటా శ్రీనివాసరావు, కన్నా లక్ష్మీనారాయణ, బొండా ఉమామహేశ్వరరావు కలిస్తేనే కాపులందరూ ఏకమైనట్టా? ఇప్పటివరకూ బలిజలకు జరిగిన నష్టాన్ని ఎవరూ ప్రస్తావించడం లేదు. అందుకే ఇప్పుడు బలిజలన్న వాదన వస్తుంది. ఎన్టీఆర్ బలిజలను గుర్తించారు. వైఎస్సార్ కాపులను గుర్తించారు. ఇప్పుడు మరోసారి మమ్మల్ని గుర్తిస్తారు అని ఎదురుచూస్తున్నాం. అయినా బలిజ అనే ప్రస్తావన లేకుండా రాజకీయాలు సాగుతున్నాయని టీటీడీ బోర్డు మాజీ మెంబర్ రమణ కామెంట్స్ చేశారు.
అయితే తాజాగా బలిజ నేతల నుంచి ఇటువంటి వ్యాఖ్యలు వచ్చేసరికి కాపు నేతలు అప్రమత్తమయ్యారు. బలిజలను కాపులు ఎప్పుడూ మోసం చేయలేదని.. కేవలం రాజకీయ పార్టీలే తమ ఎన్నికల వ్యూహాల్లో భాగంగా బలిజలను అగణదొక్కాయని చెబుతున్నారు., కాపులు సంఘటితం కాకుండా గతంలో కుట్రలు చేశారని.. ఇప్పుడు కూడా అదే కుట్రను తెరపైకి తెచ్చారని అనుమానిస్తున్నారు. రాష్ట్రంలో కాపులు, బలిజలు కలిస్తేనే 28 శాతమని.. దానిని విడగొడితే మాత్రం మరింత అన్యాయానికి గురవుతామని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో రంగా పేరు చెప్పేందుకు కూడా సహసించని పార్టీలు ఇప్పుడు ఎంతగా ఓన్ చేసుకుంటున్నాయో తెలుసుకోవాలని.. ఎందుకు అలా చేస్తున్నాయో గ్రహించాలని చెబుతున్నారు. కాపుల ఓటు బ్యాంక్ అవసరం కాబట్టి రాజకీయ పక్షాలు కాపుల చుట్టూ తిరుగుతున్నాయని..మనల్ని ఉద్దరించడానికి ఏ పార్టీ ఉండదని.. అలా అని రాజ్యాధికారం ఏ పార్టీ ఇచ్చిందని ప్రశ్నిస్తున్నారు. మనకంటూ ఒక పార్టీగా వచ్చిన ప్రజారాజ్యం పార్టీని మనం అక్కున చేర్చుకున్నామా? లేకుంటే గత ఎన్నికల్లో పోటీచేసినా జనసేనను ఓన్ చేసుకున్నామా? అన్నది ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచిస్తున్నారు. బలిజలను మోసం చేసింది రాజకీయ పార్టీలు మాత్రమేనని.. కాపులు కాదన్న విషయం గుర్తించుకోవాలని చెబుతున్నారు.

ఈ సరికొత్త రాజకీయం జనసేనను కార్నర్ చేస్తూ సాగుతోందని అటు విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. కాపులు మొత్తం జనసేన వైపు పోలరైజ్ అవుతున్న క్రమంలో అడ్డుకట్ట వేసేందుకే కాపులు, బలిజలను వేరుచేసే ప్రయత్నం జరుగుతుందని జనసేన నేతలు అనుమానిస్తున్నారు. అందుకే దీనిపై జనసేన నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ స్పందించారు. కాపు సామాజికవర్గం పెద్దది కాబట్టి… ఆ సామాజికవర్గం వారు అభిమానించే వ్యక్తి రంగా కాబట్టి పల్లకి మోసేందుకు రాజకీయ పక్షాలు ముందుకొస్తున్నాయని గుర్తుచేశారు. కాపులు, బలిజలు వేరు కాదని.. అందుకే జనసేన వచ్చే ఎన్నికల్లో బలిజలు, కాపులకు 50 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. మొత్తానికైతే గతంలో ఎన్నడూ లేని విధంగా కాపుల మధ్య చిచ్చుపెట్టేలా.. కాపుల నుంచి బలిజలను వేరుచేసే సరికొత్త రాజకీయ క్రీనీడకుకొన్ని రాజకీయ పక్షాలు ప్రయత్నిస్తుండడం మాత్రం ఏపీ రాజకీయాలను మలుపు తిప్పేలా ఉంది. అయితే ఇప్పటికే తాము ఉప కులాలుగా ఉన్న దశాబ్దాలుగా కాపులమేనని అన్నివర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో సరికొత్తరాజకీయ ఎత్తుగడలు ఏమాత్రం పనిచేయవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.