Kakinada Private Hospital:గర్భం దాల్చకున్నా.. గర్భవతి అని చెప్పారు.. పరీక్షలు, స్కానింగ్‌లతో పేరుతో వేల రూపాయలు దోచుకున్నారు.. మందులు రాసి ఇచ్చారు. డెలివరీ డేడ్ కూడా ఇచ్చారు. చివరకు గర్భమే లేదని తేలింది. ఈ ఘటనపై కాకినాడ రమ్య ఆసుపత్రిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. రెండు రోజుల తర్వాత ఈ ఆరోపణలపై రమ్య ఆసుపత్రి యజమాని స్పందించారు. ఆరోపణలు కొట్టిపారేశారు. తమ ఆసుపత్రిపై బురద జల్లుతున్నారని పేర్కొన్నారు.

లేని గర్భం ఉందని..
తూర్పుగోదావరి జిల్లా గోకవరానికి చెందిన మహాలక్ష్మికి యానాంకు చెందిన సత్యనారాయణతో వివాహం అయ్యింది. ఈ ఏడాది జనవరిలో సత్యనారాయణ తన భార్యను వైద్య పరీక్షల కోసం కాకినాడ గాంధీనగర్‌లోని రమ్య ఆసుపత్రికి తీసుకెళ్లారు. గర్భం దాల్చిందని చెప్పి వైద్యులు 9 నెలలు తిప్పించుకుని.. ట్రీట్‌మెంట్ చేశారు. పరీక్షల కోసం తరచూ అదే ఆస్పత్రికి వెళుతున్నారు. డాక్టర్లు వెళ్లిన సమయంలో స్కానింగ్, మందులు రాసిచ్చేవారు. అంతటితో ఆగకుండా ఆరో నెలలో స్కానింగ్ తీసి.. సెప్టెంబర్ 22న ప్రసవం అవుతుందని డాక్టర్లు చెప్పారు. ఆ తర్వాత మహాలక్ష్మి పుట్టింటికి వెళ్లగా.. కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇంతలో అక్కడి డాక్టర్లు స్కానింగ్ తీసి అసలు మహాలక్ష్మి గర్భవతి కాదని తేల్చి చెప్పారు. దీంతో మహాలక్ష్మితో పాటు కుటుంబసభ్యులు బిత్తరపోయారు.
Also Read: Pawan Kalyan: ఎన్టీఆర్ కు మద్దతుగా పవన్ కళ్యాణ్…జగన్ కు దిమ్మతిరిగే స్టెప్
రమ్య ఆస్పత్రికి వెళితే..
ఆందోళనకు గురైన మహాలక్ష్మి కుటుంబ సభ్యులతో కలిసి కాకినాడ రమ్య ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ స్కానింగ్ తీయాలని కోరారు. ఆమెను ఆస్పత్రి సిబ్బంది స్కానింగ్‌కు పంపారు. స్కానింగ్ తీసే వ్యక్తి మహాలక్ష్మి గర్భంలో శిశువు లేదని చెప్పడంతో కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. ఇదేంటని డాక్టర్‌ను ప్రశ్నించగా.. ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పారు. తొమ్మిది నెలల నుంచి తమను ఆస్పత్రికి తిప్పి వేల రూపాయలు ఖర్చు పెట్టించారని మహాలక్ష్మి తల్లి ఆరోపించారు. గర్భంలో బిడ్డ ఆరోగ్యంగా ఉందని చెప్పి ప్రతి నెలా మందులు రాసిచ్చారని.. వాటిని వాడాక తమ కుమార్తె పొట్ట పెద్దదైందని వాపోయారు. కాసుల కోసం అమ్మతనంతో ఆటలు ఆడిన రమ్య ఆస్పత్రి డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని వారు ఆందోళనకు దిగారు.
ముందే చెప్పారట..
కాకినాడ రమ్య ఆసుపత్రి వివాదం మరింత ముదిరింది. లేని గర్భాన్ని ఉన్నట్లు నమ్మించి ఫేక్ రిపోర్టులు ఇచ్చి తమను మోసం చేశారని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అయితే, ఆమెకు గర్భం రాలేదని తాము కూడా చెప్పామంటున్నారు రమ్య ఆసుపత్రి డాక్టర్లు. ప్రతీ ప్రెగ్నెంట్‌కు మూడో నెల, ఆరో నెల, తొమ్మిదో నెలలో స్కానింగ్ తీయిస్తామన్నారు. స్కానింగ్ చేయించుకోవాలని తాము ఎన్నిసార్లు చెప్పినా.. వాళ్లు చేయించుకోలేదని తెలిపారు. ఆగస్టు 25న 8వ నెలలో స్కానింగ్ చేయించినప్పుడు బిడ్డ లేదని స్పష్టం చేశామన్నారు. కానీ, ఆ రిపోర్టును వారు చూపడం లేదని అంటున్నారు. మహాలక్ష్మినే.. ఫాల్స్ ప్రెగ్నెన్సీ ఊహించుకుందని.. ప్రతీసారి బేబీ కదులుతోందని చెప్పిందన్నారు రమ్య ఆసుపత్రి డాక్టర్లు. అసలు, తాము డెలివరీ డేటే ఇవ్వలేదని స్పష్టం చేశారు.

మరి ట్రీట్‌మెంట్ ఎందుకు చేశారు..
మరోవైపు రమ్య ఆసుపత్రిపై మహాలక్ష్మి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గర్భం లేదని తెలిస్తే డెలివరీ డేట్ ఎందుకిచ్చారు? డెలివరీ కోసం అడ్మిట్ కావాలని ఎందుకు చెప్పారని రమ్య ఆసుపత్రి డాక్టర్లను నిలదీస్తున్నారు. 9 నెలలుగా ప్రెగ్నెన్సీ ఉన్న వారు వాడాల్సిన మెడిసిన్ ఎందుకు ప్రిస్కిరిప్షన్ రాశారో తేల్చాలంటున్నారు. సంబంధం లేని మందులు వాడటం వల్లే సైడ్ ఎఫెక్ట్స్ తో మహాలక్ష్మి బరువు పెరిగిందన్నారు. మహాలక్ష్మి గర్భవతి కాదని డాక్టర్లకు తెలిసినప్పుడు మెడిసిన్స్ వాడించడం తప్పు కదా అని నిలదీస్తన్నారు. ప్రెగ్నెన్సీని లేదని ఆగస్టు నెలలో రమ్య ఆసుపత్రి డాక్టర్లు తమకు చెప్పలేదంటున్నారు. ఆసుపత్రి మెడికల్ రిపోర్టులు, ప్రూఫ్స్ అన్నీ తమ దగ్గర ఉన్నాయంటున్నారు. బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుంది అంటూ ప్రతీ నెల మందులు రాసిచ్చారని, వాటిని వాడగా తమ కూతురు బరువు పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు మహాలక్ష్మి తల్లి కమలాదేవి.
Also Read: Rahul Gandhi- Congress President Election: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక.. రాహుల్ గాంధీ అవుతాడా? లేదా?