Kaikala Satyanarayana- Chiranjeevi: ఉమ్మడి కృష్ణాజిల్లా కౌతవరంలో పుట్టిన అతడికి సినిమాలే ప్రాణం.. కాలేజీ రోజుల్లోనూ నాటకాలు అంటే పిచ్చి. ఆ నాటకాల కోసం సైకిల్ వేసుకొని ఎన్ని కిలోమీటర్లు తిరిగాడో లెక్కేలేదు. అలాంటి కైకాల సత్యనారాయణ “సిపాయి కూతురు” అనే సినిమా ద్వారా సినీ పరిశ్రమలోకి ఆరంగేట్రం చేశారు. అప్పటినుంచి తన చివరి చిత్రం మహర్షి దాకా ఎప్పుడు కూడా వెను తిరిగి చూసుకోలేదు. అవకాశాల కోసం ఎవరి వెంటా పడలేదు. చేసిన ప్రతి పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేశారు. విలక్షణ నటుడిగా పేరుపొందారు.. అంతేకాదు ఎంతోమందికి చేతికి ఎముకే లేదు అన్నట్టుగా సహాయం చేశారు. ఆ చేసిన సహాయాన్ని కూడా ఎక్కడా చెప్పుకోలేదు.

నిర్మాతగానూ
ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన కైకాల సత్యనారాయణకు సినిమాలు తప్ప మరో లోకం లేదు. ఆ సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులు అందులోనే పెట్టుబడిగా పెట్టారు. ఎంతోమంది కొత్త వాళ్లకు అవకాశాలు కల్పించారు. టెక్నీషియన్లకు కొత్త జీవితాన్ని ఇచ్చారు.. కైకాల సత్యనారాయణ సినిమా పరిశ్రమకు ఎంతోమంది కొత్త వాళ్లను పరిచయం చేశారు. ఇక ఆయన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ , కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణతో సినిమాలను నిర్మించారు. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన “గజదొంగ” అనే సినిమాను చలసాని గోపి తో కలిసి నిర్మించారు. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ పోషించిన పలు చిత్రాల్లో ఆయనకు డూప్ గా సత్యనారాయణ నటించారు.. అందుకే కాబోలు ఎన్టీఆర్ తో తాను నిర్మించిన “గజదొంగ” చిత్రాన్ని రామారావు ద్విపాత్రాభినయంతో తెరకెక్కించారు.. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన సినిమా అప్పట్లో ఘనవిజయం సాధించింది. అంతేకాదు ఏఎన్ఆర్ హీరోగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో సత్యనారాయణ, తమ్ముడు కైకాల నాగేశ్వరరావు నిర్మాతగా “బంగారు కుటుంబం” అనే చిత్రం నిర్మించారు. ఆ సినిమా కూడా భారీ విజయాన్ని సాధించింది. 1994లో ఉత్తమ చిత్రంగా బంగారు నంది పురస్కారాన్ని అందుకుంది.. వాస్తవానికి కైకాల సత్యనారాయణ కృష్ణ నటించిన “మామా అల్లుళ్ళ సవాల్ ” అనే సినిమాతో నిర్మాతగా మారారు. రమా ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి కె ఎస్ ఆర్ దాస్ దర్శకుడు. శ్రీదేవి కథానాయికగా నటించిన ఈ చిత్రం అప్పట్లో జనాదరణ చూరగొన్నది. తర్వాత కృష్ణ, శోభన్ బాబు హీరోలుగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో “ఇద్దరు దొంగలు” అనే చిత్రం నిర్మించారు. 1984లో సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించింది.. 1986లో శోభన్ బాబు హీరోగా కే మురళీమోహన్ రావు దర్శకత్వంలో “అడవి రాజా” అనే చిత్రం నిర్మించారు.. ఈ సినిమా ఒక మోస్తరుగా ఆడింది.

చిరంజీవితో బాండింగ్
కారణాలు తెలియదు కానీ కైకాల సత్యనారాయణ చిరంజీవితో చాలా అన్యోన్యంగా ఉండేవారు.. ఆ చనువుతోనే చిరంజీవి హీరోగా “కొదమసింహం” అనే కౌబాయ్ సినిమాను నిర్మించారు. మురళీమోహన్ రావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. హిందీలో ప్రాణ్ పోషించిన అనేక పాత్రల్లో తెలుగులో సత్యనారాయణ నటించారు. నిప్పులాంటిమనిషి, యుగంధర్, నా పేరే భగవాన్ వంటి సినిమాలలో ప్రాణ్ పోషించిన పాత్రలను తెలుగులో నటించి సత్యనారాయణ మెప్పించారు. అందువల్ల ప్రాణ్ అంటే సత్యనారాయణకు వల్లమాలిన అభిమానం. పలు సందర్భాల్లో ప్రాణ్ ను సత్యనారాయణ సన్మానించారు.. ఇక బాలకృష్ణ హీరోగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో “ముద్దుల మొగుడు” అనే చిత్రం నిర్మించారు..అంతేకాదు చిరంజీవితో “కొదమ సింహం” కంటే ముందు చిరంజీవి పేరుతో ఒక చిత్రాన్ని నిర్మించారు.. ఇలా సినిమాల ద్వారా తన సంపాదించిన డబ్బును సినిమాలోని పెట్టుబడిగా పెట్టారు. ఎంతోమందికి ఉపాధి చూపారు. కైకాల సత్యనారాయణ ద్వారా ఉపాధి పొందిన వారంతా నేడు ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.