Janga Raghavareddy- Ponnala Lakshmaiya: దేశంలో కలహాల రాజకీయ పార్టీ ఏదైనా ఉందా అంటే అది కాంగ్రెస్ పార్టీ. ప్రజాస్వామ్యం పేరుతో పార్టీలో నేతలు నిత్యం కొట్టుకు చస్తున్నారు. పార్టీ పరువు మంటగలుపుతున్నారు. ఇక తెలంగాణలో అయితే కాంగ్రెస్‌ను చిలవలు పలువలు చేయడానికి సీనియర్లు వీలైనంతవరకు ప్రయత్నిస్తున్నారు. దాదాపు రెండు నెలలుగా టీకాంగ్రెస్‌లో రోజుకో కొట్లాట కొనసాగుతోంది. వీటికి కొనసాగింపు అన్నట్లుగా తాజాగా మరో లొల్లి మొదలైంది. పార్టీ పరిస్థితి రాష్ట్రంలో రోజురోజుకి దిగజారి పోతుంటే, పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంటే పార్టీలో నేతలు మాత్రం ఆలు లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఇప్పటినుంచే టికెట్ల కోసం గొడవ పడుతున్నారు. తాజాగా జనగామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి పొన్నాల లక్ష్మయ్యపై సంచలన ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టికెట్లు తనకే కావాలని అంటున్న ఒక ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో జనగామ కాంగ్రెస్ పార్టీలో అప్పుడే టికెట్ల కోసం ముష్టి యుద్ధాలు మొదలైనట్లు తెలుస్తోంది.

దయనీయంగా కాంగ్రెస్ పరిస్థితి..
తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రోజురోజుకు దయనీయమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. అటువంటి చోట కాంగ్రెస్ పార్టీని ప్రజాక్షేత్రంలో దూకుడుగా ముందుకు తీసుకు వెళ్లాల్సిన నేతలు ఆ పని చేయకపోగా, సొంత పార్టీలోని నేతలపై రాజకీయాలు చేస్తున్నారు. 24 గంటలు కాంగ్రెస్ పార్టీలోని నేతలకు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, ఒకరినొకరు తిట్టిపోసుకోవడం, చిన్నచిన్న విషయాలకు రచ్చ చేసుకోవడం అలవాటుగా మారింది.
అప్పుడే టికెట్ల లొల్లి
ఇక తాజాగా వచ్చే ఎన్నికలలో తనకే జనగామ నుంచి టిక్కెట్ కావాలని జనగామ జిల్లా అధ్యక్ష పదవి విషయంలో, కాంగ్రెస్ టికెట్ విషయంలో పొన్నాల లక్ష్మయ్య డ్రామా ఆడుతున్నారని జంగా రాఘవరెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారంగా మారాయి. జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి మాట్లాడిన ఒక ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక కార్యకర్తతో ఆయన మాట్లాడిన ఆడియో కాల్‌లో జంగా రాఘవరెడ్డి మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య పై సంచలన ఆరోపణలు చేశారు.
రూ.10 కోట్ల కమీషన్ ఇప్పించా..
పొన్నాల మంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు తాను రూ.10 కోట్ల కమిషన్ ఇప్పించానని జంగా రాఘవరెడ్డి ఆరోపించారు. అంతేకాదు పొన్నాల స్థానికంగా ఎవరినీ నాయకులుగా ఎదగనివ్వలేదని, ఆయన కొడుకు, కోడలు సైతం ఆయనతో లేరని జంగా రాఘవరెడ్డి విమర్శించారు. పొన్నాల సొంత ఊరు ఖిలాషాపూర్ గ్రామానికి రోడ్డును కూడా తానే మంజూరు చేయించానని పేర్కొన్నారు. ఈ విషయంలో ఆయన గుండె మీద చెయ్యి వేసుకుని ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు.

టికెట్ ఇవ్వకుంటే రాజీనామా చేస్తా..
పొన్నాల లక్ష్మయ్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జంగా రాఘవరెడ్డి జనగామ నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ కోసం పొన్నాల లక్ష్మయ్య డ్రామా ఆడుతున్నారన్నారు. వచ్చే ఎన్నికలలో కచ్చితంగా తనకే టికెట్ ఇవ్వాలని, పార్టీ టికెట్ తనకు ఇవ్వకుంటే జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని తాను అధిష్టానానికి తేల్చి చెప్పానని జంగా రాఘవరెడ్డి వెల్లడించారు. జిల్లా అధ్యక్ష పదవి విషయంలోనూ పొన్నాల లక్ష్మయ్య రాజకీయం చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు.
ఇక ఈ ఆడియో ఒరిజినలా? ఫేకా? అన్న విషయం స్థానిక రాజకీయ వర్గాలలో చర్చనీయాంశం కాగా, అది తన ఆడియో అని జంగా రాఘవరెడ్డి అంగీకరించారు. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో జనగామ టికెట్ కోసం కోల్డ్ వార్ కొనసాగుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల టికెట్ కోసం జంగా వర్సెస్ పొన్నాల లక్ష్మయ్య అన్నట్టు కాంగ్రెస్ రాజకీయం సాగుతుంది.