Pawan Kalyan: పవన్ పొలిటికల్ అడుగులు ఎవరికీ అంతుపట్టవంటారు. ఆయనకు నిలకడలేదు.. మాటమీద నిలబడలేరని వ్యతిరేకులు భావిస్తుంటారు.కానీ ఎవరి అభిప్రాయం వారిది. దానిని కాదనలేం. కానీ నాడు ప్రజారాజ్యం సమయంలో ఎటువంటి దూకుడు మీద ఉన్నారో.. పవన్ ఇప్పుడు కూడా అదే పంథాను కొనసాగిస్తున్నారు. అధికార పక్షం వైఫల్యాలను ఎండగడుతున్నారు. వైఎస్ ఏలుబడిలోనే నాటి అధికార పార్టీ నాయకులను పంచెలూడదీస్తానని హెచ్చరించారు. ఇప్పుడు వైఎస్ తనయుడు జగన్ తో అదే విధంగా కలబడుతున్నారు. నాడు ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం కాకుంటే యువరాజ్యం నేతగా ఉన్న పవన్ విశ్వరూపం చూసి ఉండాల్సి వచ్చేదని ఇప్పటికీ నేతలు వ్యాఖ్యానిస్తుంటారు. అయితే అప్పటితో పోల్చుకుంటే పవన్ ఎంతో పరిణితి సాధించిన విషయం అర్ధమవుతుంది. సుదీర్ఘ కాలం పార్టీని నడిపించడం.. విజయం పలకరించకపోయినా ప్రజా సమస్యలు గురించి పోరాడుతున్న తీరు ఇప్పుడు అన్నివర్గాలను ఆకట్టుకుంటోంది. ఇప్పుడిప్పుడే వ్యూహాత్మక రాజకీయాల వైపు మళ్లుతున్నట్టు పవన్ చర్యలను గమనిస్తే అర్ధమవుతుంది. ఏదైనా మాట అన్నారంటే దానికి కట్టుబడి ఉంటారు. దాని మూలాలతోనే మాట్లాడతారు.

తాజాగా సత్తెనపల్లి టూర్ పవన్ చేసిన కామెంట్స్ ఏపీ పొలిటికల్ సర్కిల్ లో కాక రేపుతున్నాయి. వ్యూహాత్మకంగా అన్నారో.. లేకుంటే యాధృశ్చికమో తెలియదు కానీ 2014 పొత్తుల గురించి ప్రస్తావించారు. 2019 ఎన్నికల్లో టీడీపీతో జనసేన కలిసి ఉంటే అసలు వైసీపీ అధికారంలోకి వచ్చి ఉండేదా అని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి రావడానికి టీడీపీ, జనసేన విడివిడిగా పోటీచేయడమే కారణమని విశ్లేషించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రానివ్వనని చెప్పడం ద్వారా పొత్తు సంకేతాలిచ్చారు. ఇప్పటంలో తాను చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నానని కూడా చెప్పుకొచ్చారు. ఇప్పటంలో ఇళ్ల ధ్వంసం ఘటనలో బాధితులను పవన్ పరామర్శించారు. వైసీపీ ఎలా అధికారంలోకి వస్తుందో చూస్తానని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వనని స్పష్టంగా చెప్పారు. ఇప్పుడదే గుర్తు చేయడంతో పొత్తు తప్పదని జగన్ సర్కారుకు హెచ్చరికలు పంపినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అటు ఎన్నికలు సమీపిస్తుండడంతో పొత్తులపై స్పష్టతనివ్వాలన్న ఆలోచనలో పవన్ ఉన్నట్టు తెలుస్తోంది.
2014 ఎన్నికలు రిపీట్ కావాలంటే బీజేపీ కలిసి రావాలన్నదే ఇప్పుడు ప్రశ్న. అయితే ఇప్పటికే ఆ మూడు పార్టీల మధ్య ఒక భావసారుప్యత ఏర్పడిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎన్నికల నాటికి బీజేపీ కలిసి వచ్చే అవకాశముందని తెలుస్తోంది. పవన్ తాజా రూట్ మ్యాప్ బీజేపీ కేంద్ర పెద్దల నుంచి వచ్చిన తరువాతే పవన్ ఇటువంటి ప్రకటనలు చేసి ఉంటారని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. బహుశా ఇది ముందుగానే గుర్తించిన అధికార వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. ప్రధానంగా జనసేనను టార్గెట్ గా చేసుకున్నారు. ఆత్మరక్షణలో పడేసేందుకు ప్రయత్నించారు. కానీ అవన్నీ వర్కవుట్ కాలేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వనని పదే పదే చెప్పడం ద్వారా పొత్తులకు సిద్ధమని భావాన్ని వ్యక్తపరచి అధికార వైసీపీ నాయకులను ముచ్చెమటలు పట్టిస్తున్నారు.

వైసీపీని మరోసారి గెలిపిస్తే ఏపీని కాపాడలేమన్న స్లోగన్ తో పవన్ ముందుకెళుతున్నారు. అందుకే రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. మాచర్లలో టీడీపీ నేతల ఇళ్లపై జరిగిన దాడిని కూడా పవన్ ప్రస్తావించారు. అధికార పార్టీ విధ్వంసాలను ఖండించారు. తద్దారా టీడీపీ విషయంలో తాను సాఫ్ట్ గా ఉన్నట్టు ఒక మెసేజ్ పంపించారు. ఇప్పటంలో తనకు బీజేపీ రోడ్డు మ్యాప్ ఇవ్వలేదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు సత్తెనపల్లి టూర్ వచ్చేసరికి అదే రూట్ మ్యాప్ తో క్లీయర్ కట్ గా మాట్లాడినట్టు అర్ధమవుతుంది. పవన్ కౌంటర్ స్ట్రాటజీతో వైసీపీకి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. తెర వెనుక ఏదో గేమ్ స్టార్ట్ అయ్యిందన్న అనుమానం, బెంగ వారిని వెంటాడుతోంది.