Jagan Govt: ఇంట్లో ఎలుక దూరిందని చెబితే.. ఇల్లు తగలెట్టండ్ర అని సలహా ఇచ్చినట్టుంది ఏపీలో వైసీపీ సర్కారు నిర్వాకం. కందుకూరు, గుంటూరు ఘటనల్లో ప్రభుత్వం నడిపిన పొలిటికల్ డ్రామా నివ్వెరపరుస్తోంది… నవ్వులపాలైంది. రాష్ట్రంలో జాతీయ, రాష్ట్ర రహదారులపై సభలు, సమావేశాలు, రోడ్ షోలు, ఊరేగింపులను నిషేధిస్తూ జగన్ సర్కారు జీవో 1ను జారీచేసింది. ఎప్పుడో బ్రిటీష్ కాలం నాటి పోలీస్ లాను బయటకు తీసింది. రాష్ట్రంపై, విపక్ష నేతలపై ప్రయోగించింది. కానీ ఇందులో వైసీపీకి, ఆ పార్టీ శ్రేణులకు మినహాయింపు ఇచ్చుకుంది. డీఎస్పీ స్థాయి అధికారులకు అనుమతులు పేరిట విశేష అధికారాలు కల్పించింది. అదే సమయంలో ఘటనలకు కారకులగా పరిగణిస్తూ నిర్వాహకులపై కేసులు నమోదుచేసింది. అరెస్ట్ లు సైతం చేసింది. అయితే ఇలా అదుపులోకి తీసుకున్నారో లేదో.. ఆ మరుసటి రోజే వారు బెయిల్ పై వారు బయటకు వస్తున్నారు.

అయితే అరెస్ట్ లకు ప్లాన్ చేస్తున్న వైసీపీ సర్కారు.. ఆ కేసులు కోర్టులో నిలబడతాయా? లేదా? అని చూడడం లేదు. భారీ సభలు, సమావేశాలు, కార్యక్రమాల నిర్వహణకు అనుమతి తీసుకున్నారంటే.. దానికి కచ్చితంగా భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిపై ఉంది. మొన్న గుంటూరు, అంతకు ముందు కందుకూరు ఘటనలకు సంబంధించి కార్యక్రమాల నిర్వహణకు తప్పనిసరిగా వారు అనుమతులు తీసుకొని ఉన్నారు. అనుమతులు ఇచ్చే ముందు అక్కడ పరిస్థితులు అధ్యయనంచేయాలి. జన సమీకరణ, ఆ ప్రాంత సామర్థ్యం అంచనా వేయాలి. భద్రత, బందోబస్తు.. ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని పర్మిషన్ ఇవ్వాలి. ప్రమాదాలు జరిగే అవకాశమున్నా, ప్రజారక్షణకు విఘాతం కలిగించే అంశాలున్నా రిజెక్ట్ చేయాలి. కానీ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందంటే అక్కడ పరిస్థితులు సవ్యంగా ఉన్నట్టేనని భావించాలి. అయితే ఎప్పుడైతే తొక్కిసలాటలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోయారో ఇదో రాజకీయాంశంగా మారిపోయింది. అయితే ఈ ఘటనలకు నిర్వాహకులుగా టీడీపీ నేతలు ఎంత బాధ్యత వహించాలో.. ప్రభుత్వం కూడా తన వైఫల్యాన్ని ఒప్పుకొని తదుపరి చర్యలకు ఉపక్రమించి ఉండాల్సింది.
ఈ రెండు ఘటనల్లో 11 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. తన సొంత పార్టీ శ్రేణులు కావడంతో టీడీపీ భారీగా నష్ట పరిహారం అందించింది. ప్రభుత్వం ప్రమాద బాధితులికిచ్చే సాయాన్ని ప్రకటించి తన ఉదారతను చాటుకుంది. కానీ యాక్షన్ ప్లాన్ లోకి దిగేసరికి తన వైఫల్యాన్ని మరిచిపోయింది. కేవలం నిర్వాహకుల వైఫల్యంగా చూపే ప్రయత్నం చేసింది. కానీ ప్రభుత్వ వాదన కోర్టులో నిలబడలేదు. కందుకూరు ఘటనకు సంబంధించి ఇంటూరి నాగేశ్వరరావు, ఇంటూరి రాజేష్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే రిమాండ్ కు పంపేలోగా కోర్టువారికి బెయిల్ ఇచ్చింది. అటు గుంటూరు ఘటనకు బాధ్యత వహించిన ఉయ్యూరు శ్రీనివాస్ విషయంలో సేమ్ సీన్. ఆయనకు కూడా బెయిల్ లభించింది. అయితే వీరిపై సంబంధం లేని కేసులు, సెక్షన్లు పెట్టడం వల్లే అవి కోర్టు ముందు నిలబడలేకపోయాయన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. జగన్ సర్కారు అరెస్ట్ లయితే చేస్తుంది కానీ… పక్కా ప్లాన్ తో చేయడం లేదన్న వాదన వినిపిస్తోంది.

టీడీపీ ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా కేసుల్లో సైతం నిందితులు 30, 40 రోజులు రిమాండ్ లో ఉన్న సందర్భాలున్నాయి. అప్పటి ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను సోషల్ మీడియాలో కించపరుస్తున్నారని ఫిర్యాదులు వచ్చిందే తడువు బలమైన సెక్షన్లతో కేసులు నమోదుచేసి అరెస్ట్ చేసేవారు. స్ట్రాంగ్ ఎవిడెన్స్ ను కోర్టుకు సబ్మిట్ చేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలేదు. అలా చేయాల్సి వస్తే ముందుగా ప్రభుత్వమే దోషిగా నిలబడాల్సి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులిచ్చినందుకు అది ప్రభుత్వ వైఫల్యంగా కోర్టు నిర్థారించే అవకాశముంది. అందుకే జగన్ అరెస్ట్ లకైతే సిద్ధపడుతోంది కానీ.. ఆ కేసు బలంగా నిలబడాలని చూడడం లేదన్న మాట.