
CM Jagan- Kapu Community: ఏపీలో ఇప్పుడు కాపుల చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయి. కాపు, తెలగ, ఒంటరి, బలిజ, శెట్టి బలిజలను ఏకతాటిపైకి తెచ్చి కాపుల ఐక్యత చాటాలని పవన్ భావిస్తున్నారు. వారంతా జనసేనకు టర్న్ అయ్యేలా ప్రయత్నాలు ప్రారంభించారు. ఇంతలో కొంత సక్సెస్ అయ్యారు. అయితే అదే సమయంలో వెళితే గిళితే కాపులు వెళ్లాలే తప్ప.. మిగతా కులాలు తన వెంట రావాలని జగన్ ఆరాటపడుతున్నారు. అందుకే కాపులుగా పిలవబడే సామాజికవర్గాల విభజనకు నడుంకట్టారు. వారి మధ్య అంతరాన్ని పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు కుల సంఘాల నాయకులను వాడుకుంటున్నారు. బలిజ, శెట్టిబలిజల స్వరం పెంచి.. తాము కాపుల వల్లే దగాకు గురవుతున్నామని చెప్పించి వారి మధ్య విచ్ఛిన్నానికి ప్లాన్ చేస్తున్నారు. కాపులు పవన్ వెంట వెళ్లినా.. మిగతా సామాజికవర్గాలు తన వెనుక ఉంటాయని జగన్ అంచనా వేస్తున్నారు.
ప్రధానంగా పదవుల పందేరంలో కాపులుగా పిలవబడే సామాజికవర్గాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. రాజకీయంగా మీకు దక్కాల్సిన ఫలాలు ఇన్నిరోజులు కాపులు దక్కించుకున్నారని తెలగ, బలిజ, శెట్టిబలిజల్లో విషం నింపుతున్నారు. అందుకే ఎమ్మెల్సీ స్థానాల్లో 11లో రెడ్డిలకు ఒకటి, కమ్మలకు ఒకటి, కాపులకు ఒకటి కేటాయించారు. బలిజలకు మాత్రం ఏకంగా మూడు ఎమ్మెల్సీలను కట్టబెట్టారు. కాపుల నుంచి వారిని విడదీసే ప్రయత్నంలో భాగమే ఇదంతా అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటువంటి సమయంలో పవన్ జాగ్రత్త పడకపోతే నష్టం తప్పదని చెబుతున్నారు.
వాస్తవానికి వంగవీటి మోహన్ రంగా ఎంట్రీ ఇవ్వక ముందు కాపు, బలిజ, శెట్టిబలిజ, తెలగ, ఒంటరి కులాలు వేర్వేరుగా ఉండేవి. కానీ ఇవన్నీ కాపులకు సంబంధించి సబ్ కులాలని గుర్తించిన రంగా వీటిని ఏకతాటిపైకి తేవడంలో సక్సెస్ అయ్యారు. ఆయన తరువాత ఈ ఐదు కులాలను ఒకే సామాజికవర్గంగా పరిగణిస్తూ వచ్చారు. చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ తరువాత కాపుల ముద్ర వేసి మిగతా వర్గాలను దూరం చేశారు. అయినా ఈ ఐదు కులాలు ఏకపక్షంగా మద్దతు తెలిపారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల ఓట్లను ఆ పార్టీ సొంత చేసుకోగలిగింది. అయితే ఇప్పుడు పవన్ ఎంట్రీతో కాపులగా పిలవబడే ఈ ఐదు సామాజికవర్గాలు జనసేన వెంట నడుస్తాయని జగన్ బలంగా నమ్ముతున్నారు. పీకే టీమ్ కూడా అదే నివేదిక ఇవ్వడంతో జాగ్రత్త పడుతున్నారు.

ఇప్పుడు జగన్ ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఆ నాలుగు సామాజికవర్గాలను కాపుల నుంచి విడగొట్టడమే పనిగా పెట్టుకున్నాడు. ఉభయగోదావరి జిల్లాల్లో కాపులతో సమానంగా శెట్టి బలిజలు ఉంటారు. రాయలసీమలో బలిజ సామాజికవర్గం అధికం. ఇక తెలగలు, ఒంటరి కులస్తులు ఉన్నారు.కానీ ఇందులో శెట్టి బలిజలు, తెలగలు, ఒంటరిలు బీసీ రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. ఒక వేళ కాపులకు బీసీ రిజర్వేషన్ అమలుచేస్తే మీకు అన్యాయం జరుగుతుందని ఈ మూడు సామాజికవర్గాల్లో నూరిపోస్తున్నారు. కాపులతో కానీ వెళితే మీకే నష్టమంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపీకలో బీసీ వర్గాలుగా చూపి శెట్టిబలిజ, బలిజ కులస్థులకు పెద్దపీట వేశారు. వారిలో కాపులపై విషం నింపే ప్రయత్నం చేస్తున్నారు.