
KCR: తెలంగాణ కేబినెట్ ఈరోజు సమావేశం కాబోతోంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవితకు ఈడీ నోటీసుల నేపథ్యంలో ఈ కేబినెట్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే మీటింగ్‌లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిని కూడా ఎంపిక చేసే అవకాశం ఉంది.
కీలక అంశాలపై చర్చ..
మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇటీవలే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరిన్ని కీలక అంశాలకు సంబంధించి నిర్ణయం తీసుకునేందుకు ఈ కేబినెట్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. సొంత ఇళ్ల స్థలాలు ఉండి.. ఇళ్లు నిర్మించుకునేవారికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి విధి విధానాలపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. ఇళ్ల స్థలాలకు పట్టాల పంపిణీకి సంబంధించిన స్పష్టమైన కార్యాచరణపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిపైనా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. అయితే, ఈ అంశానికి సంబంధించి మంత్రి కేటీఆర్ నేతృత్వంలో మంత్రివర్గం ఉపసంఘం సమావేశమై ఇప్పటికే చర్చించింది. అవసరమైన చోట ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంపైనా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది.

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎంపిక..
ఈ కేబినెట్ భేటీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిని కూడా ఎంపిక చేసే అవకాశం ఉంది. గతంలో గవర్నర్ కోటాలో పాడి కౌషిక్‌రెడ్డిని ఎంపిక చేయగా గవర్నర్ నామినేట్ చేయకుండా ఫైల్ పెండింగ్‌లో పెట్టారు. ఈ నేపథ్యంలో ఈసారి ఆచితూచి ఎంపిక చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. కేబినెట్ ఆమోదంలో ఎంపిక చేయాలని భావిస్తున్నారు. ఏ ఎన్నికలైనా అభ్యర్థులను ఏకపక్షంగా ఎంపిక చేసే కేసీఆర్ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిని కేబినెట్‌లో చర్చించి ఎంపిక చేయడం ఇదే తొలిసారి.
కవితకు ఈడీ నోటీసులపైనా..
ఇక కల్వకుంట్ల వారసురాలు, బతుకమ్మ బ్రాండ్ అంబాసిడర్, లిక్కర్ క్వీన్ ప్రచారం చేస్తున్న ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈనెల 9న విచారణకు రావాలని సూచించింది. కానీ, కవిత రాలేని, ఈనెల 11న వస్తానని రిక్వెస్ట్ చేసింది. అయితే ఈ రిక్వెస్ట్‌పై ఈడీ నుంచి రిప్లై రాలేదు. ఈ తరుణంలో కేబినెట్‌లో ఈడీ ఏం చేయబోతుంది. కవితను అరెస్ట్ చేస్తే ఏం చేయాలి అనే విషయంపైనా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది.
పెండింగ్ బిల్లులపై..
మరోవైపు, గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉన్న 10 బిల్లుల గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. సుప్రీం కోర్టులో త్వరలో విచారణకు రానున్న నేపథ్యంలో తీర్పు ఎలా ఉటుంది. వ్యతిరేకంగా వస్తే ఏం చేయాలి అనే విషయాలు కూడా చర్చిస్తారని సమాచారం.