
Jagan- Kapu Community: ఏపీ సీఎం జగన్ భారతీయ జనతా పార్టీని అనుసరిస్తున్నారా? దేశ వ్యాప్తంగా బీజేపీ విస్తరణకు అనుసరించిన వ్యూహాన్నే అమలుచేస్తున్నారా? తననకు కలిసి వచ్చే సామాజికవర్గాలతో రాజకీయం చేయాలని చూస్తున్నారా? ప్రధానంగా కాపులకు అల్టిమేటం జారీచేశారా? పవన్ వెంట కాపులు నడిస్తే.. మిగతా బీసీ వర్గాలతో రాజకీయం చేయాలనుకుంటున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు నిజం చేకూరుస్తున్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక చూస్తే ఇది ఇట్టే అర్ధమైపోతోంది. సామాజిక న్యాయం చేసి.. జనాభా ప్రాతిపదికన ఎమ్మెల్సీ సీట్లు కేటాయించినట్టు వైసీపీ హైకమాండ్ చెబుతోంది. దాని ప్రకారం కాపులకు మూడు సీట్లు కేటాయించాలి. కానీ ఒక్క సీటుతో సరిపెట్టారు. తనకు దూరమైతే.. తాను మీకు దూరమవుతానని కాపులకు స్పష్టమైన సంకేతాలు పంపారు.
ఉత్తరప్రదేశ్ లో బీజేపీ కూడా సేమ్ వ్యూహం అనుసరించింది. గతంలో అక్కడ ముస్లిం మైనార్టీలకు సీట్లు కేటాయించేది. కానీ ఆ స్థానాల్లో విపక్ష పార్టీల అభ్యర్థులు గెలుపొందేవారు. అక్కడ బీజేపీ తరుపున ముస్లిం అభ్యర్థి బరిలో దిగినా అతడు బీజేపీనేతగానే భావించి అక్కడి మైనార్టీలు ఓడించేవారు. దీంతో బీజేపీ స్ట్రాటజీ మార్చింది. ముస్లింలకు కాకుండా నాన్ ముస్లింలకు టిక్కెట్లు ఇచ్చింది. మిగతా వర్గాలను చేరదీయడంతో ఆ నియోజకవర్గాల్లో గెలుపు సునాయాసమైంది. అయితే ఏపీ సీఎం జగన్ కూడా దానినే అనుసరించాలని డిసైడ్ అయ్యారు. తన నుంచి కాపులు దూరమైతే.. కాపులకు ప్రత్యామ్నాయంగా ఉన్న బీసీలను ప్రోత్సహించడానికి డిసైడ్ అయ్యారు. దానిలో భాగమే తాజాగా ప్రకటించిన 18 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక్క సీటును మాత్రమే కాపులకు కేటాయించారు.
వాస్తవానికి గ్రౌండ్ లెవల్ లో కాపులు, కమ్మలు మధ్య వైరుధ్యాలున్నాయి. అదే సమయంలో కాపులు, బీసీలకు కూడా పడదు. రిజర్వేషన్లపరంగా పెద్దకులంగా చూపెడుతున్న కాపులు, బీసీల ఆర్థిక పరిస్థితులు సమానంగా ఉంటాయి. కానీ కాపులను పెద్దకులంగా చూసే బీసీలు ఒకరకమైన ధ్వేషభావం అలవరచుకున్నారు. దానిని క్యాష్ చేసుకోవాలని జగన్ చూస్తున్నారు. ఒక వేళ టీడీపీ, జనసేన కలిస్తే కాపులు, కమ్మ సామాజికవర్గాలు కలిసి పనిచేస్తాయి. అప్పుడు బీసీలను గుంపగుత్తిగా తనవైపు లాక్కోవాలన్నదే జగన్ వ్యూహం. అందులో భాగంగానే బీసీ సంఘ నేత ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభ, ఇప్పుడు 18 ఎమ్మెల్సీ సీట్లలో 11 బీసీలకు ప్రకటించడం వెనుక భారీ వ్యూహం ఉంది.

గత ఎన్నికల్లో కాపులు ఏకపక్షంగా జగన్ కు మద్దతు తెలిపారు. బీసీలతో పాటు గత ప్రభుత్వంలో ఎటువంటి లబ్ధిపొందని కమ్మ సామాజికవర్గం వారు సైతం జగన్ కు ఓటు వేశారు. అయితే ప్రభుత్వం ఏర్పాటుచేసిన తరువాత జగన్ తీసుకున్న నిర్ణయాలతో కమ్మలు దూరమయ్యారు. కుల ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకోవడంతో దాదాపు 95 శాతం మంది టీడీపీ వైపు టర్న్ అయ్యారు. అందుకే జగన్ కూడా కమ్మలను పట్టించుకోవడం మానేశారు. చివరకు కొడాలి నాని వద్ద ఉన్న మంత్రి పదవిని సైతం లాగేసుకున్నారు. ఇప్పుడు కాపులపై పడ్డారు. మీరు నన్ను వదులుకుంటే.. నేను కూడా మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని సంకేతాలిచ్చారు.