Chandrababu- Jagan: చంద్రబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు ఇద్దరూ చిరకాల ప్రత్యర్థులు. చిత్తూరు జిల్లాలో కీలక నేతలు. చంద్రబాబులా ఒక్కసారైనా ముఖ్యమంత్రి కావాలనే తపన ఉన్నట్టు చిత్తూరోళ్లు అంటుంటారు. ముఖ్యమంత్రి కాకపోయినా పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లాలో ఏకఛత్రాదిపత్యంతో ఏలుతున్నారు. జిల్లాలో ఆయన మాటే వేదవాక్కుగా రాజకీయం నడుస్తోంది. జగన్ కూడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అంతే ప్రాధాన్యం ఇస్తున్నారు. చిత్తూరులో పెద్దిరెడ్డిని కాదని జగన్ ఏ పని చేయరు. కాగల కార్యాలన్నీ జగన్ పెద్దిరెడ్డికే అప్పగిస్తారు. చూడటానికి సౌమ్యంగా కనిపించే పెద్దిరెడ్డి .. సైలెంట్ చేయాల్సిన పని చేసేస్తారు. ఇప్పటికే పుంగనూరును శత్రుదుర్భేద్యంగా మార్చే పనిలో ఉన్నారు. పుంగనూరులో ప్రతిపక్షాలు మాట మాట్లాడాలన్నా భయపడే పరిస్థితి కల్పించారు.

కుప్పంలో చంద్రబాబును ఓడించడం జగన్ టార్గెట్. ఆ టార్గెట్ సక్సెస్ అయితే టీడీపీని మానసికంగా దెబ్బకొట్టవచ్చు. కుప్పం మీద మాత్రమే చంద్రబాబు ఫోకస్ ఉండేలా చేయడం, మిగిలిన ప్రాంతాల పై దృష్టి పెట్టాలంటే ఇబ్బందిపడేలా జగన్ వ్యూహం పన్నారు. అందులో భాగంగానే కుప్పం మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు జగన్. కుప్పంలో చంద్రబాబును ఓడించే బాధ్యతలు పెద్దిరెడ్డికి అప్పగించారు. పెద్దిరెడ్డి సామధానబేధ దండోపాయాలు ఉపయోగించి స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని కుప్పంలో దెబ్బతీశారు.
చంద్రబాబు రాజకీయ జీవితంలో కుప్పం చాలా కీలకం. బీసీలు అధికంగా ఉండే కుప్పం నియోజకవర్గం చంద్రబాబును మొదటి నుంచి ఆదరిస్తూ వస్తోంది. కుప్పం చంద్రబాబు కంచుకోటగా మారింది.. ఈ నేపథ్యంలో ఎలాగైన దెబ్బకొట్టాలని జగన్ మాస్టర్ ప్లాన్ వేశారు. చంద్రబాబుకు పోటీగా రాజమౌళి అనే వ్యక్తిని వైఎస్ఆర్ పోటీలో ఉంచుతూ వచ్చారు. ఆ తర్వాత ఆయన కొడుకుని జగన్ ఎమ్మెల్సీ చేసి కుప్పం బాధ్యతలు ఇచ్చారు. కుప్పం నుంచి భరత్ ను గెలిపిస్తే మంత్రిని చేస్తానంటూ జగన్ హామీ ఇచ్చారు.
కుప్పంలో చంద్రబాబు ఓటమే లక్ష్యంగా పనిచేస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంకో అడుగు ముందుకేసి కీలక వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో పోటీ చేయడానికి తాను సిద్ధమని, పుంగనూరులో చంద్రబాబు పోటీ చేస్తారా ? అంటూ సవాల్ విసిరారు. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు మళ్లీ పోటీ చేసే పరిస్థితి లేదని, ఆయనకు ఇవే చివరి ఎన్నికలని జోస్యం చెప్పారు. కుప్పంలో చంద్రబాబుకు డిపాజిట్ కూడ రాదని పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. వైసీపీ ఆదేశిస్తే కుప్పం నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

స్థానిక ఎన్నికల్లో టీడీపీని దెబ్బతీయడంలో సక్సెస్ అయిన వైసీపీ.. అసెంబ్లీ ఎన్నికల్లో సక్సెస్ అవుతుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. పెద్దిరెడ్డి అన్ని రకాల వనరులు, అధికార బలం ఉపయోగించి చంద్రబాబును ఓడించే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పై పోటీకి పెద్దిరెడ్డి సై అనడంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. చంద్రబాబును ఓడించాలనే పెద్దిరెడ్డి లక్ష్యం నెరవేరుతుందా ? అంటే 2024 ఎన్నికల వరకు వేచిచూడాల్సిందే.