
Jagan- AP MLC Elections: అధికారం లేనప్పుడు చేప్పిన మాటలకు.. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత చేసిన పనులకు చాలా తేడా ఉంటుంది. ఒక్కోసారి ప్రాధాన్యతలు పక్కకు తప్పిపోతాయి. అయితే ఈ విషయంలో వైసీపీ అనుసరిస్తున్న వ్యూహాలు విపక్షాలను దిక్కుతోచని స్థితిలోకి నెట్టేస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని డిఫెన్స్ లో పెడుతున్నాయి. బీసీ నినాదంతో పుట్టుకొచ్చిన పార్టీ టీడీపీ. ఎంతోమంది బీసీ నాయకులను అందించింది ఆ పార్టీ. కానీ ఆ ముద్రను చెరిపే ప్రయత్నం చేస్తున్నారు ఏపీ సీఎం జగన్. టీడీపీ వద్ద ఇన్నాళ్లూ ఉన్న బీసీ నినాదాన్ని హైజాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవులు, రాజ్యసభ, ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానాలు..ఇలా అన్నింటిలో బీసీలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఆ వర్గాలకే పదవులు కేటాయించి సరికొత్త సవాల్ విసురుతున్నారు. ఎన్నికల ముందు బీసీలు వైసీపీ వైపు టర్న్ అయ్యేలా భారీ స్కెచ్ వేశారు.
బీసీల విషయంలో ఎటువంటి నాన్చుడు ధోరణి లేకుండా వ్యవహరిస్తున్నారు. రాజ్యసభలో సైతం ఎనిమిది స్థానాలకుగాను నలుగింటిని బీసీలకు కేటాయించారు. ఎటువంటి హంగూ ఆర్భాటం లేకుండా బీసీలకు పిలిచి మరీ రాజ్యసభకు పంపించారు. ఇప్పుడు తాజాగా ఎమ్మెల్సీ స్థానాల్లో 65 శాతాన్ని బీసీలకే కట్టబెట్టారు. 11 స్థానాలను వారికే కేటాయించారు. విపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చిన ప్రకారం వెనుకబడిన తరగతులకు ప్రాధాన్యమిచ్చి వారి అభిమానాన్ని చూరగొనే ప్రయత్నం చేస్తున్నారు. సహజంగా ఇది బీసీ పార్టీగా ముద్రపడిన తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
టీడీపీ హయాంలో ఐదారుగా ఉన్న బీసీ కార్పొరేషన్, ఫెడరేషన్ల సంఖ్యను 56కు పెంచిన ఘనతను సీఎం జగన్ దక్కించుకున్నారు. వాటి విధులు, నిధులు పక్కనపెడితే గణాంకాలు చెప్పుకునేందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు. నామినేటెడ్ పదవుల్లో సైతం వారికే పెద్దపీట వేశారు. ఆలయ కమిటీల్లో ప్రాధాన్యమిచ్చారు. మొన్నటికి మొన్న దేవస్థానం కమిటీల్లో నాయీ బ్రాహ్మణులకు సభ్యత్వం ఇచ్చారు. ఇవన్నీ బీసీలకు వెన్నెముకగా మార్చుకునేందుకేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సహజంగా ప్రభుత్వ నియామకాల్లో ఆయా వర్గాల్లో చర్చ రావడం ఖాయం. గతంలో టీడీపీ, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలపై ఆయా వర్గాల్లో ఆలోచన వస్తుంది. అది తమకు లాభిస్తుందని జగన్ అంచనా వేస్తున్నారు.

రాష్ట్రంలో మెజార్టీ సామాజికవర్గాల కంటే బీసీ జనాభా ఎక్కువ. ఓటు బ్యాంకు కూడా అధికం. మిగతా వర్గాలను మచ్చిక చేసుకుంటూనే.. బీసీలకు అగ్రతాంబూలం ఇవ్వడం వెనుక జగన్ భారీ వ్యూహం ఉంది. తన అధికారాన్ని పటిష్టం చేసుకోవడంతో పాటు టీడీపీకి దెబ్బతీయ్యాలన్నదే ప్రధాన వ్యూహం. అందుకే అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి ఏ చిన్న అవకాశాన్నీ జగన్ జారవిడుచుకోవడం లేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో సాధారణ ఎన్నికల ముందు మంచి అవకాశం వచ్చింది. ఏకపక్షంగా, ఇతర సామాజికవర్గాలు మారు మాట్లాడని విధంగా ఏకంగా 11 స్థానాలను బీసీలకు కేటాయించి తన నిర్ణయానికి జగన్ ఎదురులేకుండా చేసుకున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని ఇరుకునపెట్టారు. ఆ పార్టీ వద్ద దశాబ్దాలుగా ఉన్న బీసీ నినాదాన్ని అతి సునాయాసంగా లాక్కున్నారు. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బీసీ ఫ్యాక్టర్ పనిచేస్తుందని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
