Mythri Movie Makers: ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పై ఐటీ శాఖ దాడులు కలకలం రేపుతున్నాయి. నేడు ఉదయం నుండి అధికారులు మైత్రీ మూవీ మేకర్స్ కి చెందిన ఆఫీసుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థగా ఉన్న మైత్రీ మూవీ మేకర్స్ ఇలాంటి సమస్యల్లో ఇరుక్కోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ భాగస్వాములుగా ఉన్న నవీన్ యెర్నేని,వై రవి శంకర్ ఆఫీసులు, నివాసాలపై దాడులు జరుగుతున్నాయి.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రాల బడ్జెట్, లావాదేవీల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయనే సమాచారంతో ఐటీ అధికారులు దాడులకు తెగబడ్డారు. ఎన్నారైలు, రాజకీయ నాయకులు తమ నల్లధనాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రాల్లో పెట్టుబడి పెడుతున్నారనే వాదన కూడా ఉంది. ఎన్నారైలు అయిన రవిశంకర్ వై, నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు.
ఈ సంస్థలో తెరకెక్కిన మొదటి చిత్రం శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తర్వాత జనతా గ్యారేజ్, రంగస్థలం,పుష్ప 1 వంటి భారీ హిట్ చిత్రాలు నిర్మించారు. టాలీవుడ్ లో బడా ప్రాజెక్ట్స్ మొత్తం వీరే చేస్తున్నారు. పుష్ప 2, చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రాలు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. వీటితో పాటు పవన్ కళ్యాణ్ ప్రకటించిన ఉస్తాద్ భగత్ సింగ్, విజయ్ దేవరకొండతో ఖుషి, ఎన్టీఆర్ 31, రామ్ చరణ్ 16 చిత్రాలకు కూడా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలుగా ఉన్నారు.

వీటిలో చాలా చిత్ర బడ్జెట్ రూ. 200 కోట్లకు పైమాటే. పుష్ప 2 దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అంటే వేల కోట్ల రూపాయలు సినిమా నిర్మాణం రూపంలో మైత్రీ మూవీ మేకర్స్ చలామణి చేస్తున్నారు. ఇన్ని ప్రాజెక్ట్స్ నిర్మించడానికి అవసరమైన డబ్బు వీరికి ఎక్కడ నుండి వచ్చిందనేది ఐటీ అధికారుల అనుమానాలకు ప్రధాన కారణం. కాగా ఇటీవల లైగర్ మూవీ ద్వారా దర్శకుడు పూరి, నిర్మాత ఛార్మి ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని ఈడీ అధికారులు వారిని విచారించారు.