Russia- India: రష్యా_ ఉక్రెయిన్ యుద్ధం జరుగుతోంది.. ఇది ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియదు.. అటు నాటో దేశాలు నిప్పు రగిలిస్తూనే ఉన్నాయి.. రష్యా కూడా తగ్గేదే లేదు అన్నట్టుగా యుద్ధం చేస్తోంది. మంచి యుద్ధం.. చెడ్డ శాంతి ఉండవు కనుక.. ఈ యుద్ధ వల్ల పరిణామాలు చాలా దేశాలను ప్రభావితం చేస్తున్నాయి. అందులో భారతదేశం ఒకటి. రష్యా నుంచి మనకు ముడి చమురు వస్తుంది. యుద్ధం వల్ల రష్యా నుంచి చమురు దిగుమతి తగ్గించుకోవాలని యూరప్ దేశాలు అప్పట్లో హుకుం జారీ చేశాయి. కానీ భారత్ దీన్ని పట్టించుకోలేదు. రష్యా నుంచి రూపాయి కరెన్సీ లోనే చమురు దిగుమతి చేసుకుంటున్నది.. దీనిపై నాటోదేశాలు గుర్రుగా ఉన్నా భారత్ పెద్దగా లెక్క పెట్టలేదు. అయితే యుద్ధంలో రష్యాను ఎలాగైనా ఓడించాలని నాటో దేశాలు ఈసారి మరో ప్రతిపాదనను తీసుకొచ్చాయి. తక్కువ ధరకే చమురు ఇవ్వాలని రష్యాను డిమాండ్ చేశాయి. దీనికి పుతిన్ ఒప్పుకోలేదు. ఇది నచ్చని ఆ దేశాలు చమురు దిగుమతిని నిలిపివేయించుకుంటామని స్పష్టం చేశాయి.

డీ మార్క్ ఇక్కడే
జీ_7 దేశాలు విధించిన ఆంక్షలు మోడీ ఒప్పుకోలేదు.. దీంతో రష్యా హర్షం వ్యక్తం చేసింది. భారత దేశానికి ఒక ఆఫర్ కూడా ప్రకటించింది.. అతి తక్కువ ధరలో కొనుగోలు సాగించేలా భారీ సామర్థ్యం ఉన్న ఓడల నిర్మాణం, లీజు వ్యవహారంలో సాకారం అందిస్తామని వెల్లడించింది.. గత శుక్రవారం మాస్కోలోని భారత రాయబారి పవన్ కపూర్ తో రష్యా ఉపప్రధాని అలెగ్జాండర్ నోవాక్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన ఈ ఆఫర్ ప్రకటించారు. భారత్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. యుద్ధం వల్ల ఇంధన సంక్షోభం ఉన్నప్పటికీ భారత్ కు ఇచ్చిన మాట ప్రకారం చమురు ఎగుమతులు చేస్తోంది. ఐరోపా సమాఖ్య, బీమా సేవలు, ట్యాంకర్ చార్టరింగ్ పై ఉన్న నిషేధాన్ని అధిగమించి భారత్ భారీ సామర్థ్యం ఉన్న ఓడలు నిర్మించుకోవడంలో లేదా లీజుకు ఇవ్వడంలో సహకారం అందిస్తామని హామీ ఇచ్చింది.

60 డాలర్లు మాత్రమే ఇస్తాయట?!
డిసెంబర్ 5న జీ_7 దేశాలు సమావేశమై రష్యా చమురుకు గరిష్టంగా 60 డాలర్లు మాత్రమే ఇస్తామని ప్రకటించాయి. ఈ ధర కంటే ఎక్కువ ధరకు రష్యా చమురు కొనుగోలు చేస్తే బీమా సేవలు, షిప్పింగ్ నిషేధిస్తామని హెచ్చరించాయి. అయితే ఈ నిర్ణయాన్ని భారత్ వ్యతిరేకించింది. ధరపై విధించిన పరిమితి దాటి తాము చమురు కొనుగోలు చేస్తామని ప్రకటించింది. అయితే రష్యా చమురు ధర ల పై ఆంక్షలు విధించడంతో గత కొన్ని రోజులుగా మార్కెట్ లో ధరలు పెరుగుతున్నాయి. అటు ఓపెక్ దేశాలు కూడా ఉత్పత్తిని పెంచేందుకు సానుకూలంగా ఉన్న లేకపోవడంతో మళ్లీ ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్ పై యుద్ధం నేపథ్యంలో రష్యా చమురు ఎగుమతుల పై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ భారత్ భారీ డిస్కౌంట్ ధరకు మాస్కో నుంచి ముడి చమురు కొంటున్నది. ప్రస్తుతం వరుసగా రెండు నెలల నుంచి రష్యా భారతదేశానికి అతిపెద్ద ముడిచమురు సరఫరా దారుగా నిలిచింది. నవంబర్ లో రోజుకు 9, 09, 403 పీపాల ముడి చమురు భారత్ దిగుమతి చేసుకుంది. కాగా మోడీ నిర్ణయం పై నాటో దేశాలు మౌనంగా ఉన్నాయి. అందుకే దేశానికి బలమైన నాయకత్వం కావాలి అనేది. మోడీ దాన్ని సాధించాడన్నది ఎవరూ కాదనలేని వాస్తవం.