Rajamouli Son Karthikeya: ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ గెలుచుకుని ఇండియన్ సినిమా ప్రతిష్ట విశ్వవ్యాప్తం చేసింది. నాటు నాటు ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అందుకోవడం చారిత్రాత్మక ఘట్టం. అదే సమయంలో కొన్ని విమర్శలు వెల్లువెత్తాయి. ఆస్కార్ కోసం రాజమౌళి కోట్లు ఖర్చు చేశారని టాలీవుడ్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు. ఈ కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. అలాగే కొందరు ఇది కోట్లు పెట్టి కొన్నుకున్న ఆస్కార్ అన్నారు.
ఆర్ ఆర్ ఆర్ అవార్డు కోసం రాజమౌళి రూ. 80 కోట్లు ఖర్చు చేశారన్న విమర్శలకు రాజమౌళి కొడుకు కార్తికేయ కౌంటర్ ఇచ్చారు. అసలు ఆస్కార్ క్యాంపైన్ కోసం ఎంత ఖర్చు అయ్యిందో వెల్లడించారు. అమెరికాలో ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి, ఇతర ఖర్చులకు మొదట రూ. 3 కోట్ల బడ్జెట్ అనుకున్నారట. ఆ మేరకు ఖర్చు చేశారట. ఆస్కార్ కి నామినేట్ అయ్యాక బడ్జెట్ పెంచారట. మొత్తంగా రూ. 8.5 కోట్లు ఖర్చు అయ్యాయట.
ఆస్కార్ వేడుక చూసేందుకు కూడా టికెట్స్ కొనాల్సి వచ్చిందని కార్తికేయ తెలిపారు. నామినేషన్లో ఉన్న ఆ ఇద్దరు కీరవాణి, చంద్రబోస్ మినహాయించి… మిగిలిన టీమ్ కోసం టికెట్స్ కొన్నారట. ఒక్కో టికెట్ ధర 750 డాలర్స్ నుండి 1500 డాలర్స్ వరకూ ఉంటుందట. తమ ఫ్యామిలీ మెంబర్స్ కోసం నాలుగు టికెట్స్ కొన్నట్లు కార్తికేయ తెలిపారు.
ఇక ఆస్కార్ కొనడం అంటూ జరగదు అన్నారు. ఆస్కార్ ఎంపిక క్లిష్టమైన ప్రక్రియ. అది 95 ఏళ్ల చరిత్ర కలిగిన అకాడమీ. ప్రజల ప్రేమను… జేమ్స్ కామెరూన్, స్టీవెన్ స్పీల్బర్గ్ వంటి దిగ్గజాల ప్రశంసలు కొనగలమా చెప్పండి? అంటూ ఆయన ప్రశ్నించారు. కాగా ఆస్కార్ వేదికపై కీరవాణి అందరినీ మరచి కార్తికేయకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. దానికి కారణం ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని ఆస్కార్ బరిలో నిలిపేందుకు కావాల్సిన ఏర్పాట్లు, అనుసరించాల్సిన విధానాలు సూచించింది కార్తికేయనే. అందుకే కీరవాణి ప్రఖ్యాత ఆస్కార్ వేదికపై కార్తికేయకు క్రెడిట్ ఇచ్చారు.