
Vijayasai Reddy: నవరత్నాల్లో భాగంగా రైతుభరోసా పథకాన్ని ప్రారంభించారు ఏపీ సీఎం జగన్. ఏడాదికి రైతులకు సాగు సాయం కింద రూ.15 వేలు అందిస్తానని చెప్పుకొచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత మాట మార్చారు. కేవలం రూ.7,500 సాయమందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే రూ.6,000లను కలుపుకొని.. తానే రూ.13,500 అందిస్తున్నట్టు ఊరూవాడా ప్రచారం చేసుకుంటున్నారు. తన రైతుభరోసా పథకాన్ని పెద్ద అక్షరాలతో, కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని చిన్న అక్షరాలతో జత చేసి మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. తన అనుకూల మీడియాకు భారీగా ప్రకటనలు ఇస్తున్నారు. విశేషమేమిటంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని ముందు రోజు ప్రధాని విడుదల చేశారు. రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యింది. తరువాత జగన్ తెనాలిలో బటన్ నొక్కి పథకాన్ని ప్రారంభించారు. దీంతో అయిపోయిన పెళ్లికి బాజాలెందుకు అంటూ సెటైర్లు పడుతున్నాయి.
అయితే ఇటువంటి తరుణంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్విట్ ఒకటి చర్చనీయాంశమైంది. సహజంగా ఆయన వైసీపీ, అధినేత జగన్ ప్రస్తావన లేకుండా ఎటువంటి ట్విట్ చేయరు. కానీ అంత పెద్ద పథకాన్ని జగన్ బటన్ నొక్కడంతో వైసీపీ శ్రేణులు తెగ హడావుడి చేస్తున్నాయి. కానీ విజయసాయిరెడ్డి మాత్రం ఎక్కడ రైతుభరోసా పథకం గురించి ప్రస్తావించలేదు. 8 కోట్ల మంది రైతులకు రూ.6 వేలు చొప్పున అందించడం గొప్ప సాయంగా అభివర్ణించారు. వ్యవసాయ రంగానికి ఇదో గొప్ప సహాయకారిగా నిలుస్తందని చెప్పారు. ప్రధాని మోదీ మానసపుత్రికగా ఉన్న ఈ పథకాన్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నాని తెలిపారు. దీంతో ట్విట్ వైరల్ అయ్యింది. వైసీపీ శ్రేణులు వేడుగా భావిస్తున్న రైతుభరోసా పథకం ప్రస్తావన లేకుండా విజయసాయిరెడ్డి ట్విట్ చేయడం అధికార పార్టీ శ్రేణులను విస్మయపరుస్తోంది.

గత కొన్నిరోజులుగా వైసీపీలో విజయసాయిరెడ్డి వ్యవహర శైలి అనుమానాస్పదంగా ఉంది.మునపటిలా ఆయన పార్టీ పట్ల, అధినేత పట్ల విధేయత చూపడం లేదు. సోషల్ మీడియాలో ప్రత్యర్థులపై వాడీవేడి తగ్గించేశారు. లిక్కర్ స్కాంలో తన సమీప బంధువుల అరెస్ట్ తరువాత ఆయన వ్యూహాత్మకంగా సైలెంట్ అయ్యారు. పార్టీలోనూ ఆయనకు ప్రయారిటీ తగ్గుతోంది. ఉన్న ఒక్కో అధికారాన్ని దూరం చేస్తూ వస్తున్నారు. అటు తాడేపల్లి ప్యాలెస్ వైపు కూడా విజయసాయిరెడ్డి చూడడం లేదన్న టాక్ నడుస్తోంది. అటు సమీప బంధువు తారకరత్న మృతిచెందిన తరువాత చంద్రబాబు, బాలక్రిష్ణలతో కలివిడిగా ఉండడం కూడా ఆయనలో మార్పునకు స్పష్టమైన సంకేతం కనిపిస్తోంది. ఇటువంటి తరుణంలో వైసీపీశ్రేణులు అనుమానాపు చూపులు చూస్తున్నాయి. పార్టీతో వచ్చిన టెక్నికల్ గ్యాప్ పూడ్చుకపోగా.. ఇప్పుడు కొత్త ట్విట్, ట్విస్ట్ లతో విజయసాయి రక్తి కట్టిస్తున్నారు. పార్టీకి దూరమైనట్టేనని సంకేతాలిస్తున్నారా? లేకుంటే హెచ్చిరికలు పంపుతున్నారా? అన్నది చర్చనీయాంశంగా మారింది.