
CM Jagan: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల వేళ సీఎం జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలను పరీక్షించాలని భావించారా..? ఎవరు అండగా ఉంటారు.. ఎవరు పార్టీకి ద్రోహం చేస్తారనే విషయాన్ని తెలుసుకోవాలనుకున్నారా..? అందుకోసమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు పాట్రన్ ఇచ్చారా..? అంటే అవునన్న సమాధానమే రాజకీయ విశ్లేషకులు నుంచి వినిపిస్తోంది. ఆ పాట్రన్ కారణంగానే వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసిన ఇద్దరు ఎవరన్నది తేలిపోయిందని చెబుతున్నారు. ఇక ఎమ్మెల్సీ స్థానం విజయం కంటే నిజాయితీతో కూడిన రాజకీయాలకు జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యతనివ్వడం వల్లనే తెలుగుదేశం పార్టీ గెలిచిందనే వాదన వినిపిస్తోంది. ఒకవేళ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ స్థానాన్ని గెలవాలనుకుంటే టిడిపి ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి గెలిచే అవకాశం ఉందని, కానీ ఆ పని చేయకుండా నిజాయితీగా ఎన్నికలను ఎదుర్కోవడం వల్లనే తెలుగుదేశం పార్టీ గెలిచిందని పలువురు విశ్లేషిస్తున్నారు.
రాష్ట్రంలో కొద్ది రోజుల కిందట జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలను గుర్తించేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి వినియోగించుకున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి ముందు నుంచి తమ అసంతృప్తి గలాన్ని బయటకు వెళ్ళగక్కుతూ వచ్చారు. బయటకు వచ్చిన వీళ్ళిద్దరే కాకుండా ఇంకా ఎంతమంది ఇలా ఉన్నారన్న విషయాన్ని తెలుసుకునేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ ఎన్నికలను వినియోగించుకోవాలని భావించారు. అందుకోసం ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేశారు. ఆ వ్యూహం సత్ఫలితాన్ని ఇవ్వడంతో పార్టీలోనే ఉంటూ నమ్మకద్రోహం చేసిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు అన్న విషయాన్ని తక్షణమే పార్టీ గుర్తించే పరిస్థితి ఏర్పడింది.
ఎమ్మెల్యేలకు పాట్రన్.. పట్టించింది అదే..
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేలకు వైసిపి ఒక పాట్రన్ ఇచ్చింది. ఆ పాట్రన్ ప్రకారం ఒక్కో ఎమ్మెల్సీ అభ్యర్థికి 22 మంది ఎమ్మెల్యేలను వైసీపీ కేటాయించింది. దానికి అనుగుణంగానే ఆయా అభ్యర్థులకు ఎమ్మెల్యేలు ఓటు వేయాలి. అయితే, వైసిపి రెబల్ ఎమ్మెల్యేలుగా ముద్రపడిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి అనుకున్న ప్రకారం ఓటు వేరన్న భావించిన వైసీపీ వారిని పరిగణలోకి తీసుకోలేదు. అయితే మిగిలిన ఎమ్మెల్యేలు ఎవరు తప్పు చేసినా తెలిసిపోయే విధంగా ఇచ్చిన పాట్రన్ తో టిడిపికి ఓటు వేసిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు దొరికిపోయారు. వీరిద్దరికీ ఇచ్చిన పాట్రన్ సంఖ్య మిస్ కావడంతో వీరిని గుర్తించడం అధికార పార్టీకి తేలిక అయింది.
టిడిపికి 19.. వైసీపీకి అదనంగా ఐదు..
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నాటికి టిడిపి బలం అసెంబ్లీలో 19 మాత్రమే. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే మరో ముగ్గురు ఎమ్మెల్యేల బలం అవసరం. అయితే అప్పటికే వైసీపీ నుంచి టిడిపికి దగ్గరైన ఇద్దరు ఎమ్మెల్యేలతో ఈ బలం 21కి చేరింది. అయినప్పటికీ మరో ఎమ్మెల్యే అవసరం వీరికి కావాల్సి ఉంది. దీంతో టీడీపీ వైసీపీలో అసంతృప్తితో రగిలిపోతున్న ఎమ్మెల్యేలకు గాలం వేసింది. ఆ గాలానికి ఇద్దరు ఎమ్మెల్యేలు చిక్కడంతో ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి 23 ఓట్లు సాధించి విజయం సాధించారు. దీంతో ఎమ్మెల్సీ టిడిపి ఖాతాలో చేరింది. అయితే అప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, జనసేన పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే వైసీపీకి సన్నిహితంగా ఉంటున్నారు. వీరంతా అనుకున్నట్టుగానే వైసిపి అభ్యర్థులకే ఓటు వేశారు.
హ్యాండ్ ఇచ్చిన ఆనం.. జెల్ల కొట్టిన శ్రీదేవి, చంద్రశేఖర్ రెడ్డి..
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపికి ఓటు వేస్తానని చెప్పిన ఆనం రామనారాయణ రెడ్డి.. ఇచ్చిన మాటను తప్పి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం ముందుగా చెప్పిన ప్రకారం ఆత్మ ప్రబోధానుసారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక వైసీపీలోనే ఉంటూ వైసీపీ అభ్యర్థికి ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టిడిపి అభ్యర్థికి ఓటు వేసి జెల్ల కొట్టారు.

క్లియర్ గానే జగన్.. ఎమ్మెల్యేలకు పరీక్ష..
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను సీఎం జగన్ మోహన్ రెడ్డి తన వాళ్లు ఎవరు, తనతో పాటే ఉంటూ ప్రతిపక్షానికి అండగా ఉంటున్నది ఎవరు అన్న విషయాన్ని తెలుసుకునే ఉద్దేశంతో ఈ ఎన్నికలను వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు కొందరు ప్రతిపక్ష నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారన్న సమాచారంతోనే వారికి ఒక పాట్రన్ ఇచ్చి ఓటు వేసేలా చేశారు. ఆ పాట్రనే ఇప్పుడు ఆ దొంగ ఎమ్మెల్యేలను వైసీపీకి పట్టించింది. ఎమ్మెల్సీ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని జగన్మోహన్ రెడ్డి భావించి ఉంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేలను వైసీపీలోకి తీసుకురావడం పెద్ద సమస్య కాకపోవచ్చు. ఎమ్మెల్సీ స్థానాన్ని గెలవడం కంటే తనతో పాటు దెబ్బ కొట్టేందుకు అదును చూస్తున్న వారిని గుర్తించడం మేలనుకుని, ఆ దిశగా యాక్షన్ రూపొందించి విజయం సాధించారు జగన్మోహన్ రెడ్డి. ఒకరకంగా చెప్పాలంటే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలకు ఇక్కడ అధికార పార్టీ తావివ్వకుండా నైతికంగానే బరిలోకి దిగిందని చెప్పాలి. ఒకరకంగా చెప్పాలంటే సీఎం జగన్ మోహన్ రెడ్డి నిజాయితీతో కూడిన రాజకీయాలు చేస్తున్నారనే చెప్పాలి.