
Pawan Kalyan: రాష్ట్ర రాజకీయాల్లో బలమైన ఓటు బ్యాంకు కలిగిన సామాజిక వర్గాల్లో కాపు సామాజిక వర్గం అత్యంత కీలకమైనది. రాష్ట్రంలో మెజారిటీ జనాభా కాపు సామాజిక వర్గానిదే అయినప్పటికీ రాజకీయంగా ఉన్నత స్థానం వీరికి దక్కడం లేదు. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన అప్పటి కాంగ్రెస్, ఆ తర్వాత ఏర్పడిన తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కాపు నేతలు బలమైన నేతలుగా ఎదుగుతున్నారే తప్ప సీఎం సీటు వరకు వెళ్లే అవకాశం లేకుండా పోతోంది. అయితే గత కొన్నేళ్లుగా ఈ సామాజిక వర్గ ముఖ్య నేతల్లో వచ్చిన మార్పు, ఆలోచనతో రాజ్యాధికారకాంక్ష పెరిగింది. అందులో భాగంగానే 2009లో సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా వెలుగొందుతున్న చిరంజీవి పలువురు కాపు ముఖ్య నేతలు రాజకీయ రంగ ప్రవేశం చేయించారు. అయితే, 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎన్నికల బరిలో నిలిచిన చిరంజీవికి కాపులంతా అండగా నిలబడకపోవడంతో ఉమ్మడి రాష్ట్రంలో 18 స్థానాలకు పరిమితమయ్యారు. ఆ తరువాత రాజకీయ సమీకరణాలు, ఇతర కారణాలతో ప్రజారాజ్యం పార్టీ ముగిసింది. అయితే అదే ప్రజారాజ్యం పార్టీలో కీలకంగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ మాత్రం రాష్ట్రానికి కాపు ముఖ్యమంత్రి కావాలన్న బలమైన కాంక్షతో 2013లో జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. అదే లక్ష్యంతో అడుగులు వేస్తున్న పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల నాటికి కాపులను ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాలను చేస్తున్నారు.
ఐక్యత దిశగా..
కాపుల్లో ఐక్యత లేకపోవడం వల్లే రాజకీయ సాధికారతను, రాజ్యాధికారాన్ని సాధించలేకపోతున్నారని పవన్ అభిప్రాయపడుతున్నారు. తాజాగా మంగళగిరిలో కాపు సంక్షేమ సేన నేతలతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ ప్రాంతంలో మైనింగ్ వ్యాపారాలు చేసే వారిలో ఒకప్పుడు బలిజలే అధికంగా ఉండే వారిని, ఇప్పుడు ఆ మైన్స్ అన్ని సీఎం కుటుంబ సభ్యులు చేతుల్లోకి వెళ్లిపోయాయని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. దీనికి ప్రధాన కారణం కాపుల్లో ఐక్యత లేకపోవడమేనని ఆయన స్పష్టం చేశారు. ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించేందుకు అవకాశం ఉందని, రాజకీయ లక్ష్యాలు ఐక్యతతోనే సాధ్యమవుతాయన్న భావనను పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా వ్యక్తం చేశారు.

రిజర్వేషన్ల అంశం ప్రస్తావన..
రాష్ట్రంలో సంఖ్యాబలం ఉన్న రిజర్వేషన్ల డిమాండ్ నెరవేరడం లేదన్న భావనను పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రిజర్వేషన్ల గురించి మాట్లాడటం లేదని పలువురు కాపు నేతలపై ఆయన మండిపడ్డారు. కాపుల వైపు నిలబడమోమని చెప్పినా ఓటేసి గెలిపించారని, కులం ఆత్మ గౌరవాన్ని కాదని కూడా ఎందుకు ఓటేశారని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఈ తరహా రాజకీయపరమైన మాటలను కాపులు నమ్మకుండా ఐక్యంగా అడుగులు వేయాలని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాపు సంఘాలన్నీ ఐక్యంగా ఉంటే దక్షిణ భారతదేశంలోనే కీలక పాత్ర పోషించేందుకు కాపులకు అవకాశం ఉందన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు.. కాపుల శక్తిసామర్థ్యాల మీద ఆయనకు ఉన్న అపారమైన నమ్మకాన్ని తెలియజేస్తున్నాయన్న భావనను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఎదుటి కాపు పడిపోతే చేయి అందించి నిలబెట్టే పరిస్థితి ఉండాలని అందుకు విరుద్ధంగా కాపుల్లో భావన పెరుగుతుందన్న భావనను వ్యక్తం చేశారు. తాను ఓడిపోతే తొడ కొట్టిన వాళ్లు కాపు నేతలేనన్న పవన్ కళ్యాణ్ అందుకు ఉదాహరణగా చెప్పుకొచ్చారు. కాపుల వద్ద ఆర్థిక బలం తక్కువగా ఉన్న నేపథ్యంలో ఏకతాటి పైకి రావాలని పవన్ కళ్యాణ్ బలంగా కోరుకుంటున్నారు.
పవన్ వెనుక నిలబడతారా..?
కాపులు బలమైన శక్తిగా నిలబడాలని కోరుకునే వ్యక్తుల్లో ముందుండేది పవన్ కళ్యాణ్. అటువంటి ఆలోచన కలిగిన వ్యక్తులను ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాన్ని పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. దీనికి కాపు సామాజిక వర్గంలోని ముఖ్య నేతల నుంచి మంచి స్పందన వస్తున్నట్లు కనపడుతుంది. ముఖ్యంగా కాపులు గురించి, కాపు సామాజిక వర్గాల ఆర్థిక స్థితిగతులు, వారి ఇబ్బందులు గురించి స్పష్టమైన అవగాహన ఉన్న పవన్ కళ్యాణ్ వెనుక నిలబడడం ద్వారా కాపుల రాజ్యాధికార కాంక్షను నెరవేర్చుకోవడంతోపాటు బలమైన రాజకీయ, ఆర్థిక శక్తిగా అవతరించేందుకు అవకాశం ఉందన్న భావనను కాపు సామాజిక వర్గంలోని కీలక నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఈ భావన ఉన్న నేతలు మిగిలిన వారిని పనుబాటలో నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి కాపులను ఏకతాటి పైకి నడిపించేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొంత వరకు సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.