
KL Rahul: టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ కొన్నాళ్లుగా ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ లోను తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో కేఎల్ రాహుల్ ఆట చూసిన అభిమానులు మండిపడుతున్నారు. టెస్ట్ క్రికెట్ లో మాదిరిగా ఐపీఎల్ ఆడటం ఏంటంటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. 32 బంతుల్లో 39 పరుగులు చేసిన రాహుల్.. నాలుగు ఫ్లోర్లు, ఒక సిక్సు కూడా కొట్టాడు. రాహుల్ జిడ్డు బ్యాటింగ్ కారణంగా లక్నో సూపర్ జెయింట్స్ సాధారణ స్కోరుకే పరిమితమవ్వాల్సి వచ్చింది.
కేఎల్ రాహుల్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. ఐపీఎల్ ముందు కొన్ని సిరీస్ ల్లో తనదైన రీతిలో స్కోర్లు చేయలేక ఇబ్బంది పడ్డాడు రాహుల్. అదే ఫామ్ ఐపీఎల్ లోను కొనసాగుతోంది. లక్నో జట్టుకు సారధిగా వ్యవహరిస్తున్న రాహుల్.. ఆశించిన స్థాయిలో రాణించలేక ఇబ్బంది పడుతున్నాడు.
విమర్శలు గుప్పిస్తున్న అభిమానులు..
రాజస్థాన్ జట్టుతో బుధవారం జరిగిన మ్యాచ్ లో రాహుల్ బ్యాటింగ్ చూసిన అభిమానులు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో రాహుల్ బాల్ టూ రన్ మాత్రమే చేయడంతో అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాహుల్ ఐపీఎల్ ఆడుతున్న విషయాన్ని మర్చిపోయి.. టెస్ట్ క్రికెట్ ఆడుతున్నాడు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పరమ బోరింగ్ కే బోర్ తెప్పించేలా.. రాహుల్ బ్యాటింగ్ ఉందంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో రాహుల్ స్ట్రైక్ రేట్ అయితే మరీ దారుణంగా పడిపోయింది.
వరుస వైఫల్యాలు వేధిస్తుండడంతో ఇబ్బంది..
కేఎల్ రాహుల్ కొద్దిరోజులుగా బ్యాటింగ్ ఆడడంలో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నాడు. నెల రోజుల క్రితం భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో దారుణంగా విఫలమయ్యాడు రాహుల్. ఐపీఎల్ లో తన టెస్ట్ ఫార్మాట్ ప్రతిభను చూపిస్తున్నాడు. ఈ సీజన్ లో టెస్టుల కంటే దారుణంగా ఉంది రాహుల్ ఆట.

పవర్ ప్లే అన్న విషయం కూడా మర్చిపోయి..
సాధారణంగా ఫస్ట్ పవర్ ప్లే ఏ జట్టుకైనా అత్యంత కీలకం. మొదటి ఆరు ఓవర్లో జోరుగా బ్యాటింగ్ చేయాలని ప్రతి జట్టు భావిస్తుంది. ఈ ఆరు ఓవర్లలో వచ్చే భారీ స్కోర్ ఆధారంగానే.. మొత్తం స్కోర్ ఎంత వస్తుంది అన్నది ఆధారపడి ఉంటుంది. పవర్ ప్లే లో వీరబాదుడు బాదితే తర్వాత వచ్చే బ్యాటర్లు భారీ స్కోర్ చేసేందుకు వీలు చిక్కుతుంది. కానీ రాహుల్ మాత్రం దానికే విరుద్ధంగా ఆడుతున్నాడు. ఢిల్లీ తో మ్యాచ్ లో 12 బంతులు ఆడిన రాహుల్ 8 పరుగులే చేశాడు. స్ట్రైక్ రేట్ 66.67 గా ఉంది. చెన్నై తో మ్యాచ్లో 18 బంతుల్లో 20 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్లో 31 బంతుల్లో 35 రన్స్ చేశాడు. ఈ మ్యాచ్లో స్ట్రైక్ రేటు 112.90 మాత్రమే. ఆర్సిబి తో మ్యాచ్ లో అయితే 20 బంతుల్లో 18 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ 90 మాత్రమే. పంజాబ్ తో 56 బంతుల్లో 74 పరుగులు చేసినా.. స్ట్రైక్ రేట్ 132.14 మాత్రమే ఉంది. రాహుల్ స్ట్రైక్ రేట్ భారీగా పడిపోతున్న నేపథ్యంలో.. రానున్న మ్యాచ్ ల్లో అయినా రాహుల్ తన విశ్వరూపాన్ని చూపించాల్సిన అవసరం ఉందని అభిమానులు కోరుకుంటున్నారు.