KTR- Investments: ఒక అబద్ధాన్ని పదేపదే చెప్పడం ద్వారా అది నిజమని నమ్మాల్సి వస్తుంది. రాజకీయాల్లో ఇలాంటివి సాధారణంగా జరుగుతుంటాయి. ప్రజలను నమ్మించడం కోసం నేతలు అబద్ధాలను పదేపదే ప్రచారం చేస్తుంటారు. ఈ సూత్రాన్ని గట్టిగా పట్టుకున్నారు తెలంగాణ ముఖ్యమైన మంత్రి, కేసీఆర్ తనయుడు కల్వకుంట్ల తారకరామారావు. తెలంగాణకు వందల కోట్ల పెట్టబడి వస్తున్నట్లు, లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలు వస్తున్నాయని అరచేతిలో వైకుంఠం చూపుతున్నారు. ఆయన చెప్పేవన్నీ నిజమే అయితే పరిశ్రములు ఎక్కడ పెడుతున్నారు..? నిరుద్యోగులు ఎందుకు తగ్గడం లేదు అన్న సందేహాలు కేటీఆర్ మాటలపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

పెట్టబడుల వరద అంటూ ప్రచారం..
తెలంగాణలో పెట్టుబడుల వరద అంటూ ఇటీవల విస్తృత ప్రచారం జరుగుతోంది. మంత్రి కేటీఆర్ ప్రతీ వారం ఒప్పందాలు చేసుకుంటూనే ఉంటారు. రూ.2.5 లక్షల కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడిని ఆకర్షించామని, లక్షల సంఖ్యలో ఉద్యోగాలు సృష్టించామని చెబుతున్నారు. కానీ అన్నీ ఎంవోయూలే కానీ.. ప్రారంభమవుతున్న పరిశ్రమల గురించి మాత్రం ఎక్కడా ప్రచారం జరగడం లేదు. నిజంగా కేటీఆర్ చెప్పినన్ని పెట్టుబడులు వచ్చాయా అంటే.. అధికారిక లెక్కల్లో ఎక్కడా కనిపించడం లేదు. తెలంగాణకు 2021–22లో వచ్చిన విదేశీ పెట్టుబడులు రూ.1,1965 కోట్లు. అదే పొరుగున ఉన్న కర్ణాటకకు వచ్చినవి 1,63,798 కోట్లు. విదేశీ పెట్టుబడులు అంటేనే అంతర్జాతీయ బ్రాండ్లు పెట్టే పెట్టుబడులని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కర్ణాటక తర్వాత మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడులకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వెళ్తున్నాయి. ఆ తర్వాత స్థానంలోనే తెలంగాణ ఉంటోంది? మరి కేటీఆర్ చెబుతున్న లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయి ? ఎవరు పెట్టారు ? అనేది మాత్రం ఎవరికీ అంతుచిక్కని అంశంగా మారింది.
అనౌన్స్‌మెంట్‌తోనే ఆగిపోతున్నాయి..
ఎప్పుడో నాలుగేళ్ల కిందట అదానీ డేటా సెంటర్ అనౌన్స్ చేశారు. కానీ పనులు ప్రారంభం కాలేదు. ఇలాంటివి చాలా ఉన్నాయి. అయితే సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలో మాత్రం అభివృద్ధి కనిపిస్తోంది. కానీ ప్రచారం చేసుకుంటున్నతంగా కాదు. ఇప్పటికైతే తెలంగాణ పెట్టుబడులు 90 శాతం పేపర్ మీదనే ఉన్నాయి. అనౌన్స్‌తోనే సరిపోయాయి. గ్రౌండ్ అవుతున్న పెట్టుబడులు చాలా స్వల్పం. పెట్టుబడుల ప్రతిపాదనలు వేరు.. ఎంవోయూలు చేసుకోవడం వేరు.. వాటిని గ్రౌండ్ చేసుకోవడం అత్యంత కీలకం. ఈ విషయంలో తెలంగాణ సర్కార్ వెనుకబడిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

రాజకీయ లబ్ధికోసం ప్రచారం..
మంత్రి కేటీఆర్ మాత్రం పదేపదే తెలంగాణకు లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని, హైదరాబాద్ విశ్వనగరంగా మారుతోందనడానికి ఇదే నిదర్శనమని ప్రకటిస్తున్నారు. వారానికో ఇండస్ట్రీయల్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. పెట్టుబడులు వచ్చాయని ఎంవోయూ చేసుకుంటున్నారు. పారిశ్రామిక వేత్తలతో మాట్లాడినట్లు బిల్డప్ ఇస్తున్నారు. కానీ ఎంవోయూ చేసుకున్న వన్నీ గ్రౌడింగ్ కావడం లేదనేది వాస్తవం. ఇది కేటీఆర్‌కు కూడా తెలుసు. కానీ, రాజకీయ లబ్ధికోసం ఎంవోయూలకే విస్త్రృత ప్రచారం చేయిస్తున్నారు. మీడియాలో పెద్దపెద్ద కథనాలు రాయిస్తున్నారు. వాస్తవ పరిస్థితి మాత్రం విరుద్ధంగా ఉంది.