Insta Love Story: మేడిపండు పైకి ఎర్రగా కనిపిస్తుంది. పొట్ట విప్పి చూస్తే మొత్తం పురుగులే ఉంటాయి. అలాగే రకరకాల వ్యక్తుల కలయిక అయిన సోషల్ మీడియా కూడా అంతే. ప్రొఫైల్ చూసేందుకు అందంగా ఉంటుంది. ఆకర్షిస్తుంది. అదే నిజం అనుకుని పొరబడితే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. తర్వాత ఏమనుకన్నా ప్రయోజనం ఉండదు. ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నప్పటికీ యువత మారడం లేదు. మోసపోయి చివరికి కన్నీరు పెడుతున్నారు. కొందరయితే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.
మాటా మాటా కలిసింది
ముక్కు ముఖం తెలియని వ్యక్తులతో సోషల్‌మీడియా స్నేహం ఎంతప్రమాదకరం. ఇలాంటి ఘటన హైదరాబాద్‌లోని నారాయణగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. హైదరాబాద్‌లో ఉండే ఓ యువతి.. ఇన్‌స్టా గ్రామ్‌లో పరిచయమైన ఓ తమిళ యువకుడితో మాట కలిపింది. ఇద్దరూ మనసులు ఇచ్చిపుచ్చు కున్నారు. ప్రేమలో పడ్డారు. చనువు మరింత పెరిగింది. ఇదే సమయంలో ప్రేమికుడు అడగడంతో.. అతడి ఆర్థిక అవసరాల కోసం చేయకూడని పని చేసి చిక్కుల్లో పడింది. నగరంలోని బొల్లారం ప్రాంతానికి చెందిన యువతి.. నారాయణగూడలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ స్థానిక కళాశాలలో ఎంబీఏ చదువుతోంది. ఏడు నెలల క్రితం ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో చెన్నైకి చెందిన పూర్ణే్‌షయాదవ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. చదువు పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకుంటానని పూర్ణేష్ యువతికి హామీ ఇచ్చాడు. నెల రోజుల క్రితం అతడు ఆమెకు ఫోన్ చేసి.. తనకు అర్జెంట్‌గా డబ్బులు కావాలని అడిగాడు. తన వద్ద డబ్బులు లేవని ఆమె చెప్పగా.. స్నేహితుల వద్ద అడిగి తీసుకొని ఇవ్వాలని పూర్ణేష్ ఒత్తిడి చేశాడు.
మరో యువకుడిని సంప్రదించింది
దీంతో.. ఇరవై రోజుల క్రితం ఇన్‌స్టా ద్వారా పరిచయమైన మరో స్నేహితుడు అస్లామ్‌ను యువతి సంప్రదించింది. అస్లామ్ కూడా తన వద్ద డబ్బులు లేవని చెప్పాడు. అయితే.. తన స్నేహితుడు సాయి చరణ్ చాలా సంపన్న కుటుంబానికి చెందిన వాడని, అతడు ఎంత కావాలంటే అంత డబ్బు ఇస్తాడని, కానీ అతనితో ఒక రోజంతా గడపాల్సి ఉంటుందని చెప్పాడు. ఇందుకు యువతి అంగీకరించింది. అనుకున్న ప్రకారం నారాయణగూడ విఠల్‌వాడిలో ఉన్న ఓ హోటల్‌లో గదిని బుక్ చేసిన సాయిచరణ్.. గత నెల 23న యువతిని అస్లామ్ ద్వారా రూమ్‌కు రప్పించుకున్నాడు. సాయిచరణ్‌తో యువతి నగ్నంగా ఉన్న దృశ్యాలను అస్లామ్ తన ఫోన్‌లో వీడియో తీసాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం యువతికి ఆ వీడియోను పంపించి తనతో కూడా గడిపితేనే వీడియోలు డిలీట్ చేస్తానని, లేదంటే సోషల్ మీడియాలో వైరల్ చేస్తా అని బెదిరించాడు. యువతి అందుకు ఒప్పుకోకపోవడంతో అస్లామ్ ఆ వీడియోను యువతి బాయ్‌ఫ్రెండ్ పూర్ణే్‌షకు పంపించాడు. ఆ వీడియో చూసిన పూర్ణేష్ కూడా యువతిని బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో బాధితురాలు ఇటీవల షీటీమ్స్‌ను ఆశ్రయించి, ముగ్గురిపై ఫిర్యాదు చేసింది. ఈమేరకు నారాయణగూడ పోలీసులు.. 3న అస్లామ్, సాయిచరణ్, పూర్ణే్‌షయాదవ్‌పై కేసు నమోదు చేశారు. అస్లామ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈఘటనతో ఆ యువతి ఒక్కసారిగా షాక్‌లోకి వెళ్లిపోయింది. తల్లిదండ్రులకు ఇదంతా తెలియడంతో వారు ఆమెను స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఆ యువతి నగ్న వీడియోలను వీరు ఎవరెవరికి పంపారు? వీరు ముగ్గురు ప్లాన్ ప్రకారమే ఇలా చేశారా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.