
Internal Clashes YCP Leaders: ఏపీలో అధికార వైసీపీలో క్రమశిక్షణ కట్టుదాటుతోంది. అసమ్మతి కుతకుతగా రగులుతోంది. నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేల ధిక్కారంతో పతనం ప్రారంభమైంది. విజయవాడలో ఎమ్మెల్యేలు వీధి పోరాటంతో పార్టీ రచ్చకెక్కుతోంది. గోదావరి జిల్లాల్లో సీట్ల కోసం నేతల సిగపాట్లు పడుతున్నారు. టీడీపీ నుంచి వైసీపీ పంచన చేరిన ఎమ్మెల్యేలు నిస్సహాయతను ఎదుర్కొంటున్నారు. ఎవరికి వారే బలప్రదర్శనకు దిగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ టిక్కెట్ అని ప్రకటించుకుంటున్నారు. దీంతో వైసీపీ శ్రేణుల్లో చీలిక స్పష్టంగా కనిపిస్తోంది. కాకినాడ నుంచి నెల్లూరు వరకూ.. సెంట్రల్ ఆంధ్రాలో అధికార వైసీపీ పరిస్థితి రోజురోజుకీ దిగజారుతోంది. ఎన్నికల నాటికి ఇది మరింత తీవ్రమై పార్టీనే కబళిస్తుందని వైసీపీ హార్ట్ కోర్ ఫ్యాన్స్ తెగ ఆందోళన చెందుతున్నారు.
నెల్లూరులో పతనం అంచున..
వైసీపీ ఆవిర్భావం నుంచి నెల్లూరు జిల్లా ఆ పార్టీకి పెట్టని కోట. అయితే వైసీపీ పతనం అక్కడ నుంచే ప్రారంభమైందా అన్న రేంజ్ లో ఇటీవల పరిణామాలు వెలుగుచూశాయి. ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు వైసీపీకి దూరమయ్యారు. ధిక్కార స్వరం వినిపించడంతో హైకమాండ్ సస్సెన్షన్ వేటు వేసింది. అయితే నెల్లూరు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న ఆనంను వదులుకోవడం పెద్ద సాహసమే. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా వైసీపీ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. గత ఎన్నికల్లో అత్తెసరు మెజార్టీతో గెలిచిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సైతం అసమ్మతిని ఎదుర్కొంటున్నాయి. ఆయన బాబాయ్, నెల్లూరు కార్పొరేషన్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ సవాల్ విసురుతున్నారు. గత ఎన్నికల్లో అనిల్ గెలుపునకు కారణమైన ఓ సామాజికవర్గం ఇప్పుడు వ్యతిరేకిస్తుండడంతో అనిల్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మొత్తానికైతే నెల్లూరు సీన్ సమూలంగా మారుతోంది.
ప్రకాశంలో రచ్చరచ్చ..
ప్రకాశం జిల్లాలో సైతం ఎన్నడూలేని విధంగా పార్టీ రచ్చకెక్కుతోంది. అద్దంకిలో బాచిన క్రిష్ణ చైతన్య,కొండపలిలో వరికూటి అశోక్ బాబు నాయకత్వాన్ని స్థానిక పార్టీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయి. బలప్రదర్శనకు దిగుతున్నాయి. ఏకంగా తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసు ఎదుటే ఆందోళనకు దిగాయి. ఆ ఇద్దరికీ మాజీ మంత్రి బాలినేని అండదండలున్నాయన్న ప్రచారం నేపథ్యంలో అక్కడ పోటీగా అసమ్మతి రాజకీయాలు తెరపైకి రావడం విశేషం. పర్చూరులో సైతం వైసీపీ శ్రేణులు బాలినేని, వైవీ సుబ్బారెడ్డి వర్గాలుగా విడిపోయాయి. బాలినేని వర్గంగా భావిస్తున్న రావి రామనాథంబాబును సమన్వయకర్త బాధ్యతల నుంచి తప్పించి మాజీ ఎమ్మెల్యే ఆమంచి క్రిష్ణమోహన్ కు అప్పగించారు.
కృష్ణాలో ఎవరికి వారే యమునా తీరే..
కీలక కృష్ణా జిల్లాలో సైతం నేతలు ఎవరికి వారే యమునా తీరేనన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఒకరి నియోజకవర్గాల్లో ఒకరు వేలుపెట్టి ఇబ్బందులు పెట్టుకుంటున్నారు. మైలవరంలో స్థానిక ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ కు మంత్రి జోగి రమేష్ చెక్ చెబుతున్నారు. సీఎం జగన్ జోక్యం చేసుకున్నా అక్కడ పరిస్థితి అదుపులోకి రావడం లేదు. మంత్రి జోక్యం ఆగనంత వరకూ గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించలేని వసంత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేసేదాక పరిస్థితి వచ్చింది. మంత్రి విడదల రజనీ ప్రాతనిధ్యం వహిస్తున్న చిలకలూరిపేటలో సైతం సిగపాట్లు తప్పడం లేదు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు త్యాగం చేస్తే మంత్రి పదవి ఇస్తానని మర్రి రాజశేఖర్ కు జగన్ హామీ ఇచ్చారు. కానీ ఎమ్మెల్యేతో పాటు మంత్రి పదవిని రజనీ బోనస్ గా పొందారు. అతి కష్టమ్మీద రాజశేఖర్ ఎమ్మెల్సీ కాగలిగారు. ఇక్కడ రజనీకి వ్యతిరేకంగా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుతో కలిసి రాజశేఖర్ అసమ్మతి రాజకీయ కార్యకలాపాలను నడిపిస్తున్నారు. సంతనూతలపాడులో ఎమ్మెల్యే సుధాకర్ బాబును కుల రాజకీయాలు కలవరపెడుతున్నారు. ఓ ప్రధాన సామాజికవర్గం నేతలు ముప్పు తిప్పలు పెడుతున్నారు. దర్శి నియోజకవర్గంలో కూడా వైసీపీ అసమ్మతి రాజకీయాలు నడుస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే బుచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మధ్య వర్గపోరు నడుస్తోంది.
గోదావరి జిల్లాలో ముప్పుతిప్పలు..
గోదావరి జిల్లాలో పాత కొత్త నాయకులతో వైసీపీ వ్యవహారాలు రచ్చకెక్కుతున్నాయి. కొవ్వూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న హోంమంత్రి దానేటి వనితకు ఎమ్మెల్సీ మోషేన్ రాజు చుక్కలు చూపిస్తున్నారు. మంత్రిగా ఉన్నా.. సెకెండ్ క్యాడర్ ను మోషేన్ రాజు తన వైపు తిప్పుకున్నారు. రామచంద్రాపురంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలక్రిష్ణ, ఎంపీ పిల్లి చంద్రబోస్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వర్గాల మధ్య పోటీ తీవ్రస్థాయిలో ఉంది. వచ్చే ఎన్నికల్లో ఎంపీ బోస్ కుమారుడికే టిక్కెట్ అన్న ప్రచారం నేపథ్యంలో మంత్రి వేణుగోపాలక్రిష్ణ సైతం అలెర్టయ్యారు. ఈ క్రమంలో విభేదాలు మరింతశ్రుతిమించుతున్నాయి. అటు మండపేట ఇన్ చార్జిగా నియమితులైన తోట త్రిమూర్తులు సైతం రామచంద్రాపురాన్ని విడిచిపెట్టేది లేదని తేల్చిచెబుతున్నారు. ఏలూరులో ఎంపీ కోటగిరి శ్రీధర్, చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా వర్గాలు బహిరంగంగానే కలబడుతున్నాయి. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఎమ్మెల్యేగా సీటు కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఈ క్రమంలో ఆశావహులుగా ఉన్న రౌతు సూర్యప్రకాశరావు, నియోజకవర్గ సమన్వయకర్త శివసుబ్రహ్మణ్యం నుంచి గట్టి ప్రతిఘటననే ఎదుర్కొంటున్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో సైతం ఎంపీ భరత్ పట్టుబిగుస్తున్నారు. యువ నాయకుడు జక్కంపూడి రాజా, ఆకుల వీర్రాజు సైతం తమ వర్గాలను యాక్టవ్ చేస్తున్నారు.

అంబటికి తప్పని తలపోటు…
గుంటూరు జిల్లా సత్తెనపల్లెలో మంత్రి అంబటి రాంబాబుకు అసమ్మతి పోటు తప్పడం లేదు. డాక్టర్ గుజ్జల నాగభూషణ్ రెడ్డి, మర్రి వెంకటరామిరెడ్డి, అరిమండ వరప్రసాద్ రెడ్డి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అంబటికి టిక్కెట్ రాకుండా పావులు కదుపుతున్నారు. విజయవాడ నగర వైసీపీలో సైతం అలజడి నెలకొంది. నేతల మధ్య కీచులాటలు జోరుగా సాగుతున్నాయి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణు, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి, ఎమ్మెల్సీ రుహుల్లా వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. విజయవాడ తూర్పులో దేవినేని అవినాష్, యలమంచిలి రవి, బొప్పన భవకుమార్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. ఇలా సెంట్రల్ ఏపీలో వైసీపీ జరుగుతున్న అసమ్మతి వ్యవహారం హైకమాండ్ కు తలనొప్పి కలిగిస్తోంది. ఎన్నికల నాటికి వీటిని ఎలా అధిగమించాలో తెలియక నాయకత్వం మల్లగుల్లాలు పడుతోంది.