Singotam Ramu: అతని పేరు రాము అలియాస్ సింగోటం రాము ఆలియాస్ రమణ అలియాస్ రామన్న. ఒక మనిషికి ఇన్ని పేర్లు ఉన్నాయి అంటే అతని రేంజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ రాముది కూడా అదే రేంజ్. ఓ డ్రైవర్ గా జీవితాన్ని మొదలుపెట్టి.. స్థిరాస్తి వ్యాపారం లోకి అడుగుపెట్టి.. అందులో భారీగా లాభాలు ఆర్జించి ఎవరికి అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. తన ఒంటి మీద అరకిలో బంగారం ధరించి గోల్డ్ మ్యాన్ గా ప్రసిద్ధి చెందాడు. తాను ఉండే రహమత్ నగర్ లో అందరికీ చేదోడువాదోడుగా ఉండే స్థాయికి ఎదిగాడు. ఒక స్థాయికి ఎదిగిన తర్వాత చాలామంది మరింత గౌరవాన్ని కోరుకుంటారు. అందుకు రాము కూడా మినహాయింపు కాదు. తను రాజకీయంగా ఎదగడానికి తాను పుట్టిన ఊరు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ ప్రాంతం లో ఉండటం ప్రారంభించాడు. భారతీయ జనతా పార్టీలో చేరాడు. ఒక మనిషి ఎదుగుతుంటే గొడవలు అనేవి సహజం కాబట్టి.. రాము విషయంలో కూడా అలాంటి గొడవ ఒకటి జరిగింది. స్థిరాస్తి వ్యాపారంలో ఉన్న నేపథ్యంలో రెండు సంవత్సరాల క్రితం వ్యాపార విషయమై నగరంలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రామిరెడ్డి నగర్ కు చెందిన మణికంఠ అనే యువకుడి పై దాడి చేశాడు. ఆ దాడిలో మణికంఠ ముఖం పూర్తిగా చిద్రమైపోయింది. దీంతో అతడికి కుటుంబ సభ్యులు ప్లాస్టిక్ సర్జరీ చేయించాల్సి వచ్చింది. ఈ ఘటనపై పేట్ బషీర్ బాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. ఇంతవరకు బాగానే ఉంటే రాము కథ మరో విధంగా ఉండేది. కానీ రాము ఒక అమ్మాయి జీవితంలోకి ప్రవేశించడంతో.. ఒక్కసారిగా అతని జీవితం తారు మారయింది.
యూసఫ్ గూడ లోని లక్ష్మీ నరసింహ నగర్ లో నివసించే మహిళ ఇంటికి రాము తరచూ వెళ్తుండేవాడు. ఆ మహిళపై పలు పోలీస్ స్టేషన్లలో వ్యభిచారం తాలుకూ కేసులు నమోదయ్యాయి. అయితే ఆ మహిళ కుమార్తెను రాము కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆ యువతి తనకు దగ్గరగా ఉండే యువకుడి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లింది. అయితే ఆ యువకుడు గతంలో రాము చేతిలో తీవ్రంగా గాయపడిన మణికంఠకు స్నేహితుడు. అటు మణికంఠకు, అతడి స్నేహితుడికి రాముపై పగ ఉన్న నేపథ్యంలో అతడి హత్యకు పథకం వేశారు. ఇందులో భాగంగా ఆ యువతి రాముకు ఫోన్ చేసింది. ఏకాంతంగా గడుపుదాం ఇంటికి రమ్మని చెప్పింది. దీంతో రాము మద్యం తీసుకొని ఆమె ఇంటికి వెళ్ళాడు. వెంటనే ఆమె తన స్నేహితుడికి సమాచారం అందించింది. ఆ యువకుడు, మణికంఠ, బోర బండ ప్రాంతంలో నివసించే రౌడీ షీటర్ జిలాని సహా మొత్తం పదిమంది కత్తులతో ఆ యువతి చెప్పిన ప్రదేశానికి చేరుకున్నారు. రాత్రి సుమారు 11 గంటల 45 నిమిషాల ప్రాంతంలో ఒక్కసారిగా రాముపై తీవ్రంగా దాడి చేశారు. కత్తులతో పాశవికంగా దాడి చేయడంతో రాము తీవ్రంగా గాయపడ్డాడు. రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రామును చంపిన ఆనందంలో మణికంఠ ఎగిరి గంతేశాడు. రాము బామ్మర్ది కి “మీ బావ చనిపోయి ఉన్నాడు చూడు.. వచ్చి తీసుకెళ్ళు” అంటూ వీడియో ఫోన్ కాల్ లో చూపించాడు. తర్వాత వారంతా అక్కడి నుంచి పరారయ్యారు. యువతి మాత్రం అక్కడే ఉంది.
రామును చంపిన అనంతరం అదే రోజు అర్ధరాత్రి రాంరెడ్డి నగర్ ప్రాంతానికి వెళ్లిన మణికంఠ, అతడి బృందం బాణసంచా కాల్చింది. ఆ తర్వాత గురువారం ఉదయం మణికంఠ, అతడి బృందం మారణాయుధాలతో పోలీసుల ఎదుట లొంగిపోయింది. అయితే ఈ బృందంలో కొంతమంది పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ యువతి కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది. ఈ కేసును ఫిలింనగర్ పోలీసులు విచారిస్తున్నారు. రాము బిజెపి నాయకుడు కావడం.. అత్యంత పాశవికంగా హత్యకు గురి కావడంతో.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం నమోదయింది. ఈ హత్యకు సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తుండగానే నిందితుల్లో కొంతమంది లొంగిపోవడంతో.. ఈ హత్య వెనుక ఉన్నది ఎవరో తెలిసిపోయింది. మొదట్లో రాముని ప్రత్యర్థి పార్టీకి చెందిన వాళ్ళు హత్య చేశారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత అసలు విషయం వెలుగులోకి రావడంతో దీని వెనుక కారణం వేరే ఉందని అర్థమైంది.