Lionel Messi: లా పుల్గా… అర్జెంటీనా సాకర్ దిగ్గజం మెస్సీ కి అతడి సోదరులు పెట్టిన పేరు. ఆ పేరును నిజం చేస్తూనే ఈసారి మెస్సీ ఆ స్థాయిలో ఆడుతున్నాడు. శక్తిని మొత్తం తనలో నిక్షిప్తం చేసుకుని వీర విహారం చేస్తున్నాడు.. అనితర సాధ్యమైన విజయాలను జట్టుకు కట్టబెడుతున్నాడు. ముఖ్యంగా క్రోయేషియాతో జరిగిన సెమి ఫైనల్ లో గోల్ చేసేందుకు తోటి ఆటగాడు ఆల్వేరేజ్ గోల్ కు సహకరించిన తీరు చూస్తే మాటలు రావు. మైదానంలో చిరుతల్లా పరిగెత్తే పుట్ బాల్ వంటి క్రీడలో 35 ఏళ్ల వయసులో ఆ స్థాయిలో ఫిట్ నెస్ సాధించడం అంటే మామూలు విషయం కాదు.

ఆ గాయాన్ని మనసులో పెట్టుకొని
2014 ప్రపంచ కప్ గురించి ప్రస్తావన వస్తే అర్జెంటీనా అభిమానుల గుండెలు బరువెక్కుతాయి. ఈ టోర్నీలో నాలుగు గోల్స్ సాధించి జట్టును ఫైనల్ దాకా మెస్సి తీసుకెళ్లాడు.. కానీ ఫైనల్ మ్యాచ్లో జర్మనీ చేతిలో అర్జెంటీనాకు పరాభవం ఎదురయింది. దీంతో అర్జెంటీనా అభిమానుల గుండె పగిలింది.. చేతుల దాకా వచ్చిన కప్ చేజారిపోయిందని ప్రతి అభిమాని మనసు కాక వికలమైంది.. ఆ సమయంలో మెస్సి తనకు తాను ఓదార్చుకున్నాడు.. 2016 కోపా అమెరికా కప్ లో చిలీ చేతిలో పెనాల్టీ షూట్ అవుట్ లో అర్జెంటీనా ఓడిపోయింది.. ఈ ఓటమితో అతడు చలించిపోయాడు. తాను జట్టు నుంచి వైదొలగుతానని ప్రకటించాడు. కొన్ని నెలల తర్వాత మనసు మార్చుకున్నాడు. 2018లో రష్యాలో జరిగిన ఫిఫా కప్ లో రౌండ్16 లో అర్జెంటీనా ఫ్యాన్స్ చేతిలో ఓడిపోయి ఇంటికి తిరిగి వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే జట్టుకు ఇది దారుణమైన ఓటమి. వాస్తవానికి నాటి జట్టు కోచ్ జార్జ్, అతడి సిబ్బంది తీరు మెస్సికి అంతగా నచ్చేది కాదు.. దీంతో అతడు ఒంటరిగానే గడిపేవాడు.. కొన్ని సందర్భాల్లో వారితో గొడవపడ్డాడు..జార్జ్ తీరు అర్జెంటీనా దిగ్గజ ఆటగాడు మారడోనాకు కూడా నచ్చలేదు. ఈ టోర్నీ తర్వాత అర్జెంటీనా అతడికి ఉద్వాసన పలికింది.
మళ్ళీ అంతర్మథనం
2022 ప్రపంచ కప్ నాటికి మెస్సికి 35 ఏళ్ల వయసు వస్తుంది. అప్పటికి ఫిట్నెస్ సహకరిస్తుందో లేదో తెలియదు. ఇవే ఆలోచనలు 2019లో అతని మెదడులో మెదిలాయి.. ఈ విషయం అప్పటి అసిస్టెంట్ కోచ్ లియోనల్ చెవిలో పడింది. అతడు సర్ది చెప్పడంతో మెస్సి తన మనసు మార్చుకున్నాడు.. తీవ్రంగా సాధన చేసి 2021లో కోపా కప్ సాధించాడు.. ఆ టోర్నీలో నాలుగు గోల్స్ సాధించి టాప్ స్కోరర్ గా నిలిచాడు.. 28 సంవత్సరాల తర్వాత అర్జెంటు నాకు దక్కిన అతిపెద్ద టైటిల్ ఇది.. ఈ విజయం మెస్సీలో చాలా మార్పు తెచ్చింది. దీంతో ప్రపంచ కప్ కు దండ యాత్ర కు వెళ్ళాడు.
వివాదాలకు దూరం
మెస్సి సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటాడు.. అద్భుతమైన ఆటగాడిగా పేరు ఉన్నప్పటికీ అణకువగా ఉంటాడు.. ఈ ప్రవర్తనే అతగాడికి భారీ అభిమానులను తెచ్చిపెట్టింది.. 2012లో లీగ్ ల్లో ఆడేటప్పుడు అతడి సహచరుడు డేవిడ్ విల్లా తో వివాదం ఏర్పడింది. ఇది తప్ప మెస్సి క్రీడా జీవితంలో ఎటువంటి మరకలు లేవు.. 2016 తర్వాత మెస్సి ఆహార్యం లో చాలా మార్పులు వచ్చాయి. శైలీ లో కూడా భిన్నత్వాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టాడు. రెఫరీ తప్పుడు నిర్ణయాలను ప్రశ్నించినందుకు 2019లో మూడు మ్యాచ్ ల నిషేధానికి గురయ్యాడు. కానీ తాజాగా నెదర్లాండ్స్ తో జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో విశ్వరూపం చూపాడు.. ఏకంగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో నెదర్లాండ్స్ డగవుట్ ముందు ఆగి ఆ జట్టు కోచ్ ను వెక్కిరించాడు.. మ్యాచ్ అనంతరం నెదర్లాండ్స్ కోచ్ తో వాగ్వాదానికి దిగాడు. మీడియా సమావేశం అనంతరం నెదర్లాండ్స్ ఆటగాడిని దూషించాడు.. ఈ నేపథ్యంలో అతడి పై వేటు పడుతుందని అందరూ అనుకున్నారు. కానీ అదృష్టవశాత్తు అలా జరగలేదు.

టీం స్పిరిట్ బాగుంది
ఈసారి అర్జెంటీనా జట్టులో టీం స్పిరిట్ బాగుంది.. అర్జెంటీనా జట్టులోని చాలామంది ఆటగాళ్లు మెస్సిని ఆరాధిస్తూ ఆడుతున్నారంటే ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.. 2011లో క్రికెట్ ప్రపంచ కప్ లో సచిన్ కోసం యువరాజ్ వంటి క్రీడాకారులు ఎంతగా శ్రమించారో… ప్రస్తుతం అర్జెంటీనా ఆటగాళ్లు కూడా అదే విధంగా పోరాడుతున్నారు.. ప్రస్తుతం అర్జెంటీనా జట్టులో ఉన్న జూలియన్ అల్వరేజ్ ఒకప్పుడు మెస్సితో సెల్ఫీ దిగేందుకు ఉబలాటపడ్డాడు.. అతడు ఇప్పుడు మెస్సి తో కలిసి ఆడుతున్నాడు. అల్వేరేజ్ కూడా ఈ ప్రపంచకప్ లో నాలుగు గోల్స్ చేసి భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. కమాన్ మెస్సీ… నీ కల సాకారం అయ్యే రోజులు ఎంతో దూరంలో లేవు.. రాజమౌళి సినిమాలో ఈగ లాగా విజృంభించు. అర్జెంటీనా దేశానికి సాకర్ కప్ తెచ్చిపెట్టు.