Kumari Aunty: కుమారి ఆంటీ తెలివి ట్రెండింగ్

ఎప్పుడో 2011లో బతుకు వెతుక్కుంటూ గుడివాడ నుంచి హైదరాబాద్ కు కుమారి ఆంటీ చేరుకుంది. స్ట్రీట్ ఫుడ్ వ్యాపారంలో అడుగుపెట్టింది. ఐటీ కారిడార్ రోడ్లలో ఫుడ్ వ్యాన్ ను నడుపుతూ జీవనోపాధి పొందింది. తక్కువ ధరతో శుచి, శుభ్రమైన ఆహారాన్ని అందించింది.

Written By: Dharma, Updated On : February 2, 2024 4:20 pm

Kumari Aunty

Follow us on

Kumari Aunty: కొందరు అవకాశాలను ఒడిసి పట్టుకుంటారు. సమయాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. కుమారి ఆంటీ చేసింది కూడా ఇదే. ఆమె ఎపిసోడ్ ఒకసారి గమనిస్తే ఆమె ఎంత తెలివిగా వ్యవహరించిందో తెలుస్తోంది. ట్రెండ్ కు తగ్గట్టు ఆమె తెలివితేటలను మార్చుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో ఇబ్బందికర పరిస్థితులను సైతం ఆమె అధిగమించింది. సోషల్ మీడియాను చక్కగా వాడుకుంది.

ఎప్పుడో 2011లో బతుకు వెతుక్కుంటూ గుడివాడ నుంచి హైదరాబాద్ కు కుమారి ఆంటీ చేరుకుంది. స్ట్రీట్ ఫుడ్ వ్యాపారంలో అడుగుపెట్టింది. ఐటీ కారిడార్ రోడ్లలో ఫుడ్ వ్యాన్ ను నడుపుతూ జీవనోపాధి పొందింది. తక్కువ ధరతో శుచి, శుభ్రమైన ఆహారాన్ని అందించింది. దీంతో భోజనం ప్రియులు క్యూ కట్టారు. అదే సమయంలో యూట్యూబర్లు, ఫుడ్ బ్లాగర్లు కుమారి ఆంటీ ఇంటర్వ్యూలను హైలెట్ చేయడంతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచారు. రోజుకు ఐదు కిలోల బియ్యంతో తయారుచేసిన ఆహార పదార్థాలతో ప్రారంభమైన ఆమె వ్యాపారం.. ప్రస్తుతం 100 కిలోల బియ్యానికి చేరుకుంది.అయితే ఐటి ఉద్యోగులు, భాగ్యనగరవాసులు క్యూ కట్టడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. పోలీసులు కలుగజేసుకోవడంతో ఆమె వ్యాపారానికి బ్రేక్ పడింది. ఏ సోషల్ మీడియాతో ఆమె సెలబ్రిటీగా ఎదిగారో.. అదే సోషల్ మీడియాతో ఇబ్బంది పడ్డారు.

కానీ ఇక్కడే కుమారి ఆంటీ తన తెలివితేటలను ప్రదర్శించారు. తనకు ఈ షాప్ తప్ప మరో జీవనోపాధి లేదని.. ఏపీలో జగనన్న ఇచ్చిన ఇల్లు మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు. దీంతో వైసీపీ సోషల్ మీడియా రెచ్చిపోయింది. చంద్రబాబు రేవంత్ తో చెప్పి ఆమె వ్యాపారాన్ని మూతపడేలా చేశారని ప్రచారం చేసింది. ఇది వైరల్ గా మారడంతో రేవంత్ రెడ్డి స్పందించాల్సి వచ్చింది. ఆమె వ్యాపారానికి అనుమతి ఇవ్వాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చేదాకా పరిస్థితి వచ్చింది. దీంతో మళ్లీ ఆమె సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు. అయితే అక్కడితో ఆగని ఆమె.. తనకు ఓటు హక్కు వచ్చిన నాటి నుంచి చంద్రబాబుకు ఓటు వేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. దీంతో మరోసారి ట్రెండింగ్ లో నిలిచారు. ఇప్పుడు తనకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమని చెప్పడం ద్వారా.. ఏపీలోనే అన్ని రాజకీయ పార్టీలకు ఆమె సమ ప్రాధాన్యం ఇచ్చారు. అయితే కుమారి ఆంటీవి సోషల్ మీడియా ట్రెండింగ్ తెలివితేటలు అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో అన్ని రాజకీయ పార్టీలను తెగ ఆడేసుకున్నారని ఆమెపై సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. మొత్తానికైతే కుమారి ఆంటీ కథ సుఖాంతం అయినా.. ఆమె సోషల్ మీడియా ట్రెండింగ్ తెలివితేటలు మాత్రం అబ్బుర పరుస్తున్నాయి.