Kaikala Satyanarayana: యమలీల సినిమా చూశారా… అందులో హిమక్రిములను అవలీలగా లాగించే యముడు మనకు ఆనందాన్ని పంచుతాడు. కానీ ఈ సీన్ చేయడానికి అతడు ఏకంగా 7 రోజులు రిహార్సల్స్ చేశాడు. ఐస్ క్రీమ్ తిని తిని నోరంతా తిమ్మిర్లు ఎక్కిన అతడు లెక్క చేయలేదు. అతడే కైకాల సత్యనారాయణ. తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వి రంగారావు, కాంతారావు, గుమ్మడి తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న నటుడు. తండ్రిగా, క్రూరమైన ప్రతి నాయకుడిగా, యముడిగా, ప్రేమను పంచే మావయ్యగా.. ఆప్యాయతను కురిపించే తాతయ్యగా అతడు చేసిన పాత్రలు ఆ నిర్వచనీయం. అనన్య సామాన్యం. వయోభారం, అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు హైదరాబాదులోని ఫిలింనగర్ లో తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు.

1935లో జననం
కృష్ణాజిల్లా కౌతవరం అనే గ్రామంలో కైకాల సత్యనారాయణ జన్మించారు.. గుడివాడ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. నాటకాల మీద ఉన్న పిచ్చితో ఆ రోజుల్లోనే వందల కొద్ది ప్రదర్శనలు ఇచ్చారు. ఓ నాటకంలో అతని పాత్ర చూసి అప్పటి దిగ్గజ దర్శకుడు డీ.ఎల్.నారాయణ సిపాయి కూతురు అనే సినిమాలో కైకాల సత్యనారాయణకు ఒక అవకాశం ఇచ్చారు. ఇక అప్పట్నుంచి ఆయన ఎప్పుడూ వెను తిరిగి చూసుకోలేదు. వందలాది సినిమాల్లో నటించారు. ఒకానొక దశలో విలన్ పాత్రకు కాయకాల తప్ప మరో ఆప్షన్ లేకుండా చేసుకున్నారు.. దర్శకులు కూడా కేవలం దృష్టిలో పెట్టుకొని కథలు రాసేవారంటే అప్పట్లో ఆయన హవా ఎలా కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు.
నిర్మాతల నటుడు
కైకాల సత్యనారాయణ పేరున్న నటుడు అయినప్పటికీ… ఎప్పుడు కూడా నిర్మాతలను ఇబ్బంది పెట్టలేదు.. తనకు ఇంత రెమ్యూనరేషన్ కావాలని డిమాండ్ చేయలేదు. మూడు షిఫ్ట్ లో పనిచేసిన ఈ నటుడు ఎప్పుడు కూడా షూటింగ్ కు ఆలస్యంగా వచ్చిన దాఖలాలు లేవు. తను చివరిగా నటించిన మహర్షి సినిమాలో చిన్న పాత్ర కోసం తన వయోభారాన్ని కూడా లెక్క చేయకుండా రిహార్సల్స్ చేశారంటే ఆయనకు నటన పట్ల ఉన్న మక్కువను అర్థం చేసుకోవచ్చు.
యముడి పాత్రలకు ఫేమస్

కైకాల సత్యనారాయణ తెలుగు సినిమా పరిశ్రమలో యముడి పాత్రలు ఎక్కువ వేసిన నటుడిగా రికార్డ్ సృష్టించారు.. యమలీల,యమ గోల, అడవి రాముడు వంటి సినిమాల్లో ఆయన పోషించిన యముడి పాత్రలు ఇప్పటికీ టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్. కేవలం యముడి పాత్రలే కాదు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ఘటోత్కచుడు, కర్ణుడు, రావణాసురుడి పాత్రల్లో కూడా నటించి విమర్శకుల ప్రశంసలు పొందారు. పారతరమే కాకుండా, కొత్త తరం కథానాయకులతో కూడా ఆయన నటించారు. మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా ఆయన చివరి చిత్రం. కాకా అరుంధతి సినిమాలో ఆయన పోషించిన పాత్ర ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అనారోగ్యంతో ఆయన కన్నుమూయడంతో టాలీవుడ్ ఒక దిగ్గజ నటుడిని కోల్పోయింది.