Kaikala Satyanarayana Passed Away: టాలీవుడ్ తొలితరం నటుల్లో ఒకరైన కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. కుటుంబ సభ్యులు ఆయన మరణాన్ని ధృవీకరించారు. చాలా కాలంగా కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంచానికే పరిమితమైన కైకాలకు ఇంట్లోనే వైద్యం అందిస్తూ సపర్యలు చేస్తున్నారు. కొన్నాళ్ళ క్రితం ఆయన ఆరోగ్యం విషమించింది. మృత్యువు అంచుల వరకు వెళ్లిన కైకాల అభిమానుల అశీసులతో కోలుకొని తిరిగి వచ్చారు. కళామతల్లి ముద్దుబిడ్డగా పేరుగాంచిన కైకాల సత్యనారాయణ ఇక లేరన్న వార్త ఆయన అభిమానులను కలచి వేస్తుంది.

87 ఏళ్ల వయసులో కైకాల వెండితెర జ్ఞాపకాలను తెలుగు ప్రేక్షకులు కానుకగా ఇచ్చి నింగికేగారు. కైకాల మృతి వార్తలతో పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. చిత్ర ప్రముఖులు, అభిమానులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటుగా అభివర్ణిస్తున్నారు.
1935 జులై 25న కృష్ణా జిల్లా బంటుమిల్లి గ్రామంలో కైకాల జన్మించారు. బాల్యం నుండి నటనపై మక్కువ ఉన్న కైకాల నాటకాలు వేసేవారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి నటుల స్పూర్తితో హీరో కావాలని చెన్నై వెళ్లి ప్రయత్నాలు చేశారు. సిపాయి కూతురు సినిమాతో కైకాల వెండితెరకు పరిచయమయ్యారు. మంచి ఆహార్యం, నటన కలిగిన కైకాలకు హీరోగా, విలన్ గా అవకాశాలు వచ్చాయి. అయితే ఆయన విలన్ గానే సెటిల్ అయ్యారు.

ఒక దశలో కైకాల కరుడుగట్టిన విలన్ రోల్స్ చేశారు. తర్వాత విలక్షణ పాత్రలు చేశారు. సుదీర్ఘ ప్రస్థానం లో కైకాల అనేక భిన్నమైన పాత్రలు చేశారు. ఆయన దాదాపు 777 చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్ కి డూప్ గా పలు చిత్రాల్లో నటించారు. ఇక యముడి పాత్రలకు కైకాల బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు. వెండితెర యముడు అంటే కైకాలనే. ఆ పాత్ర విషయంలో ఎన్టీఆర్ కూడా ఆయన తర్వాతే. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు రచించిన కైకాల తన పాత్రల స్మృతులు వీడిపోయారు.