Kantha Rao: ఓడలు బండ్లు అవుతాయి. బండ్లు ఓడలవుతాయి. ఇది ఎవరికైనా వర్తిస్తుంది. తెలంగాణ తొలి తరం నటుల్లో ఒకరైన కాంతారావు విషయంలో మరింత వర్తించింది. మమ్మల్ని ఆదుకోవాలని ఆయన కుమారులు మొన్న వేడుకున్న తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. కానీ సినిమా పరిశ్రమ తీరే అంత కదా! బాగున్నప్పుడు అన్ని బాగుంటాయి. బాగోలేనప్పుడు ఏవీ కూడా బాగుండవు. వాస్తవానికి మూడు షిఫ్టుల్లో పనిచేసిన కాంతారావు.. తన జీవిత చరామాంకంలో చాలా ఇబ్బంది పడ్డారు. సినిమా పరిశ్రమలో డబ్బులు ఉన్నప్పుడే అందరూ చుట్టూ ఉంటారు. అవి లేని నాడు ఎవరూ పట్టించుకోరు. అవి స్వయంగా చూసిన కాంతారావు.. తన చివరి కోరికలు తీరకుండానే కన్నుమూశారు.

మద్రాస్ లో ఉండేవారు
మద్రాసులోని ఇప్పటి చెన్నై రాఘవాచారి రోడ్డులో కాంతారావు కుటుంబం మూడంతస్తుల ఇంట్లో ఉండేది. వారి ఇంటి నిండా పనివాళ్ళు ఉండేవారు. ఆయన షూటింగ్ లకు ఫియట్ కారు వాడేవారు. పిల్లల కోసం డార్జ్ కారు ఉండేది.. ఇంటి అవసరాలకు అంబాసిడర్ వాడేవారు. అల్లు రామలింగయ్య, రాజబాబు, రాజశ్రీ వంటి వారు కాంతారావుకు అత్యంత ఆప్తులుగా ఉండేవారు. కష్టాలతో గుమ్మం తొక్కిన వాళ్లకు లేదు అనకుండా కాంతారావు సహాయం చేసేవారు. ఆర్థికంగా చితికిపోయి, ఒంటి చీరతో మిగిలిన ఓ నటికి కాంతారావు తన భార్యను పురమాయించి చీరలు కొనిచ్చారు. ఆయన దాతృత్వ గుణానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే.. చేతికి ఎముకే లేదు అన్నట్టుగా ఆయన చేసిన సాయం.. ఎన్నో కుటుంబాలకు జీవం పోసింది.
కోదాడవాసి
కాంతారావు స్వస్థలం కోదాడ దగ్గర గుడిబండ. ఆయన మొదట మాలి పటేల్ గా పనిచేశారు. కాంతారావు కు వారసత్వంగా 600 ఎకరాల భూమి వచ్చింది. అందులో కొంత ధాన ధర్మాలకు, మరికొంత ఆయన సినిమాలు, ఇంకొంత ఆయన సరదాలకు కరిగిపోయాయి. అప్పుల పాలైన ఆయన మిగిలిన 60 ఎకరాలు, చెన్నైలో ఇష్టంగా కట్టుకున్న మూడు అంతస్తుల భవనం అమ్మేశారు.. 1990లో కట్టుబట్టలతో హైదరాబాద్ వచ్చారు..
తనతో నటించిన అమ్మాయిని హీరోయిన్ చేశారు
కాంతారావు ప్రయోగాలకు పెద్దపీట వేసేవారు. ఒకరోజు హైదరాబాదులో వస్తాడే మా బావ అనే సినిమా అవుట్ డోర్ షూటింగ్ జరుగుతోంది.. దాన్ని చూసేందుకు ఒక అమ్మాయి ఆమె తండ్రితో వచ్చింది.. ఆ సినిమాలో తండ్రి పాత్రలో నటిస్తున్న కాంతారావు ఆ అమ్మాయి కళ్ళు బాగున్నాయని ఫోటో తీయించుకున్నారు.. వెంటనే ఆ ఫోటోని తన పెద్దబ్బాయి ద్వారా దర్శకుడు దాసరి నారాయణరావుకి పంపించాడు.. అవి చూసిన ఆయన ఆ అమ్మాయికి ‘తూర్పు పడమర” అనే సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత ఆమె పెద్ద హీరోయిన్ అయింది.. ఆ నటి మరెవరో కాదు నాటి హీరోయిన్ మాధవి.

కానీ ఆమె డబ్బు బాగా సంపాదించిన తర్వాత… ఒకరోజు కాంతారావు భార్య హైమావతి కి ఫోన్ చేసి “ఆర్థిక సహాయం చేసే శక్తి నాకు ఉంది.. కానీ చేసేందుకు మనసు రావడం లేదు.. నీకు పిల్లలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని” దెప్పి పొడిచింది.. దీంతో హైమావతి బాగా కుమిలిపోయింది.. ఆమె ఒక్కరే కాదు కాంతారావు ద్వారా సహాయం పొందిన వారంతా ఆయనను మర్చిపోయారు.. జీవిత, రాజశేఖర్ దంపతులు కూడా లక్ష రూపాయల సహాయం ప్రకటించి తర్వాత మౌనంగా ఉన్నారు.. సుబ్బిరామిరెడ్డి వంటి వారు కాంతారావు ఉన్నాక, ఆయన గతించిన తర్వాత కూడా ఆర్థిక సహాయం చేశారు.. కాంతారావు తన చివరి దశలో “బెల్లం చుట్టూ ఈగలు అన్నట్టు… డబ్బు ఉంటేనే సమాజంలో విలువ అని” పదేపదే అంటూ ఉండేవారు.. ఎన్టీఆర్ స్మారక పురస్కారాన్ని అందుకోవాలని ఆశపడ్డారు.. తనకంటూ సొంత ఇల్లు ఉండాలని పరితపించారు.. కానీ అవి తీరకుండానే కన్నుమూశారు.. కాంతారావు భార్య హైమావతి కూడా సొంత ఇంట్లో కన్నుమూయాలనే కోరిక కూడా తీరకుండా చనిపోయారు.. ఇప్పుడు కాంతారావు పిల్లలు కూడా అద్దె ఇంట్లోనే ఉంటున్నారు.