
Actor Muralidhar Goud: ప్రతి ఇంటికి అల్లుడంటే భయం. మర్యాద తగ్గకుండా.. మనసు నొప్పించకుండా ఆయనతో ప్రవర్తించాలి. వడ్డించే అన్నంలో నల్లి బొక్క వేయకపోయినా బంధం తెంచుకునే పంతం అల్లుడిలో ఉంటుందని ‘బలగం’ సినిమాలో చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాలో అల్లుడి పాత్రలో మెప్పించిన మురళీధర్ గౌడ్ తన నటనతో అందరికీ ఆకట్టుకున్నాడు. ఆయన ఇదివరకు నటించిన డీజే టిల్లు సినిమాలోనూ అందరినీ అలరించాడు. ఒక కొడుకుకు తండ్రిగా కనిపించి ఆ పాత్రనూ మెప్పించాడు. ఇలా ఏ పాత్ర ఇచ్చినా అందులో ఒదిగిపోయే మురళీధర్ గౌడ్ 60 ఏళ్ల వయసులో ఇండస్ట్రీ గడప తొక్కాడు. మరి ఇంతకాలం ఆయన ఏం చేశాడు? ఆయనకు సినిమాల్లో అవకాశం ఎలా వచ్చింది?
మురళీధర్ గౌడ్ ది మెదక్ జిల్లా రామాయంపేట. ఆయన తండ్రి కులవృత్తి చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు. అయితే పలు కారణాల వల్ల మెదక్ జిల్లాలోని గజ్వేల్, సిద్ధిపేట ప్రాంతాల్లో వారు నివాసం ఉండాల్సి వచ్చింది. మురళీధర్ గౌడ్ చదువు పూర్తయిన తరువాత పలు వ్యాపారాలు చేయాల్సి వచ్చింది. కానీ ఇంతలోనే అప్పటి ఏపీ పరిధిలో ఉన్న ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి కాల్ లెటర్ వచ్చింది. దీంతో ఆయన జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ గా కొలువు కొట్టేశాడు. ఇప్పటిలాగా ఆ కాలంలో గవర్నమెంట్ ఉద్యోగాన్ని పట్టించుకునేవారు కాదు. కానీ అనూహ్యంగా వచ్చిన ఈ ఉద్యోగాన్ని మురళీధర్ గౌడ్ వదులుకోలేదు. ఇలా 27 ఏళ్లపాటు ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యారు.

ఉద్యోగం చేస్తున్నన్నాళ్లు మురళీధర్ గౌడ్ కు సినిమాల్లో నటించాలన్న కోరిక బలంగా ఉండేది. స్కూల్ డేస్ లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓ ప్రదర్శనలో భాగంగా మరళీధర్ గౌడ్ మేకప్ వేసుకున్నారు. అప్పటి నుంచి నాటరకరంగంపై ఆసక్తి ఏర్పడింది. ఈయన డిగ్రీ చదివే రోజుల్లోనే దాసరినారాయణ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయడానికి లెటర్ రాశారు. అయితే ఆప్పుడ అవకాశం రాలేదు. దీంతో ప్రయత్నాలు మాని ఉద్యోగం చేస్తూ వచ్చారు.
అయితే ఉద్యోగం రిటైర్డ్ అయిన తరువాత ఇంట్లో వాళ్లకు చెప్పకుండా సినిమా అవకాశాల కోసం ప్రయత్నించారు. కొన్ని రోజుల పాటు సీరియళ్లలో నటించిన తరువాత ‘డీజె టిల్లు’ సినిమాతో గుర్తింపు పొందారు. అప్పటి నుంచి ఆయనకు అవకాశాలు తలుపు తట్టుతున్నాయి. ఇప్పుడు ‘బలగం’ సినిమాలో అల్లుడి పాత్రలో మెప్పించారు. తెలంగాణ ప్రాంతంలో అల్లుడికి మర్యాద తగ్గితే పరిస్థితి ఎలా ఉంటుందో మురళీధర్ గౌడ్ ఆ పాత్రలో జీవించారు. దీంతో ఆయనకు అన్ని వైపులా ప్రశంసలు దక్కుతున్నాయి.