
Kinjarapu Yerran Naidu: దివంగత ఎర్రన్నాయుడు తమ వాడంటే తమ వాడని తెలుగుదేశం పార్టీ గొంతు చించుకుంటోంది. బీసీ నాయకుడు సర్దార్ గౌతు లచ్చన్నను సైతం ఓన్ చేసుకునేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తోంది. ఎర్రన్న జయంతి, వర్థంతి సమయంలో రాష్ట్రస్థాయి నాయకుడిగా తెలుగుదేశం పార్టీ కీర్తిస్తూ వస్తోంది. కానీ అదే ఎర్రన్నాయుడు, గౌతు లచ్చన్న కుమారుడు శివాజీకి తెలుగుదేశం పార్టీ అన్యాయం చేసిన రోజులు ఉన్నాయి. 1989లో తెలుగుదేశం పార్టీ రెండోసారి కంటెస్ట్ చేసే సమయంలో చంద్రబాబుది యాక్టివ్ రోల్. కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన చంద్రబాబు పార్టీపై పూర్తి పట్టు సాధించారు. ఆ సమయంలో వచ్చిన ఎన్నికల్లో ఎర్రన్నాయుడు, శివాజీలను చంద్రబాబు పక్కన పెట్టేశారు.
శ్రీకాకుళం జిల్లాలో హరిశ్చంద్రపురం నుంచి ఎర్రన్నాయుడు, సోంపేట నియోజకవర్గం నుంచి గౌతు శివాజీలు 1985లో టీడీపీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. కానీ అప్పట్లో కళా వెంకటరావు, తమ్మినేని సీతారాంలు చంద్రబాబు కోటరీలో ఉండేవారు. ఎర్రన్నాయుడు, శివాజీలకు టీడీపీ టిక్కెట్లు ఇవ్వకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు. కానీ వారిద్దరూ ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బరిలో దిగారు. టీడీపీ అభ్యర్థులపైనే గెలుపొందారు. కానీ నాడు తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. దీంతో ఐదేళ్ల పాటు ఎర్రన్నాయుడు, శివాజీ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సభ్యులుగా కొనసాగారు. 1994 ఎన్నికల ముందు టీడీపీలో చేరి.. టిక్కెట్లు పొందగలిగారు.

అటు తరువాత ఎర్రన్నాయుడు పార్టీలో తన స్థానాన్ని పెంచుకుంటూ వచ్చారు. పార్టీలో నంబర్ 2 గా ఎదిగారు. కానీ దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. కానీ ఆయన వారసులుగా ఉన్న అచ్చెన్నాయుడు రాష్ట్ర అధ్యక్షుడిగా, కుమారుడు రామ్మోహన్ నాయుడు ఎంపీగా పదవులు నిర్వహిస్తున్నారు. శివాజీ వారసురాలిగా ఉన్న శిరీష్ టీడీపీలో యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు. నాడు ఏనుగు గుర్తుపై పోటీచేసి అధికార, ప్రధాన ప్రతిపక్షం అభ్యర్థులను ఎర్రన్న, శివాజీ వెనక్కి నెట్టగలిగారు. అందుకే ఇప్పటికీ ఎర్రన్నను ఏనుగుతో పోల్చుతారు. ఏనుగు చచ్చిన బతికినా గ్రేట్ అంటూ ఎర్రన్నను ఉద్దేశించి అభివర్ణిస్తుంటారు. టీడీపీలో అప్పట్లో నిరాదరణకు గురైన ఎర్రన్నను స్మరించడం ద్వారా చంద్రబాబు బీసీలను ఆకట్టుకునే ప్రయత్నం చేయడాన్ని కూడా ఉదహరిస్తున్నారు.