Covid Nasal Vaccine: కరోనా కల్లోలంతో దేశమంతా అట్టుడికిన రోజులు అవీ.. మొదటి వేవ్ ను లాక్ డౌన్ తో తప్పించుకున్న మనం.. రెండో వేవ్ కు బలయ్యాం. చాలా మంది తమ ఆప్తులను కోల్పోయారు. మరణ మృదంగం దేశంలో వినిపించింది. ఆక్సిజన్ కొరత.. మందుల కొరత వచ్చి ప్రాణాలు పోయాయి. అప్పటికింకా వ్యాక్సిన్ రాలేదు. అనంతరం దేశంలో వ్యాక్సిన్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రెండు డోసుల వ్యాక్సిన్ ను వేసుకున్నారు. నాడు వ్యాక్సిన్ కోసం ఎన్నో యుద్ధాలు జరిగాయి. క్యూలల్లో నిలబడి పైరవీలు చేసి బతుకుజీవుడా అంటూ వేసుకున్నారు జనాలు. ఇప్పుడంతా సద్దుమణిగింది అనుకుంటున్న టైంలో మళ్లీ కరోనా చైనాలో విజృంభించింది. కోట్ల మంది హాహాకారాలు చేస్తున్నారు. అందుకే కేంద్రం అప్రమతైంది. తాజాగా దేశంలో మరో వ్యాక్సిన్ ను విడుదల చేసింది.అయితే ఇది నాసల్ వ్యాక్సిన్ (ముక్కులో వేసుకునేది) కావడం విశేషం.
భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన ‘నాసికా వ్యాక్సిన్’కు దేశంలో కేంద్రం అనుమతించింది. ఇది ప్రైవేట్ ఆసుపత్రులలో ₹800 రూపాయలకు అందుబాటులో ఉంటుంది. దీనికి పన్నులు అదనం. ఈ నాసల్ వ్యాక్సిన్ వేసుకోవాలనుకునే వారు స్లాట్‌లను ఇప్పుడు CoWin పోర్టల్‌లో బుక్ చేసుకోవచ్చని ఫార్మాస్యూటికల్ కంపెనీ భారత్ బయోటెక్ ప్రకటించింది. నాసికా వ్యాక్సిన్ ‘ఇన్ కో వ్యాక్’ (iNCOVACC) పేరుతో జనవరి 4వ వారంలో దేవంలో విడుదల చేయబడుతుంది. కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా పెద్దఎత్తున ఈ వ్యాక్సిన్ సేకరణ ప్రారంభించారు. ప్రభుత్వాలకు మాత్రం iNCOVACC ఒక మోతాదుకు ₹ 325 ధర చొప్పున భారత్ బయోటెక్ అమ్ముతోంది.
iNCOVACC 18 ఏళ్లు పైబడిన వారి కోసం బూస్టర్ షాట్‌గా రూపొందించబడింది. ప్రైమరీ 2-డోసులు తీసుకున్న ప్రజలందరూ దీన్ని వేసుకోవచ్చు. ఆమోదం పొందిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంట్రానాసల్ (ముక్కులో వేసుకునే) కోవిడ్ వ్యాక్సిన్ ఇదేనని, దీన్ని హెటెరోలాగస్ బూస్టర్ డోస్‌గా భారత్ బయోటెక్ తెలిపింది.
3వ దశ ట్రయల్స్ , హెటెరోలాగస్ ట్రయల్స్ దేశవ్యాప్తంగా వరుసగా 14 ప్రదేశాల్లో నిర్వహించబడ్డాయని.. ఇవి సక్సెస్ అయ్యిందని.. వ్యాక్సిన్ బాగా పనిచేసిందని భారత్ బయోటెక్ ఒక ప్రకటనలో తెలిపింది.
ట్రయల్స్ సమయంలో వ్యాక్సిన్ ఇచ్చిన వారి లాలాజలంలో గణనీయమైన స్థాయిలో యాంటీబాడీ స్థాయిలను గుర్తించారు. ఎగువ శ్వాసకోశంలో ఉండే మ్యూకోసల్ ఐజీఏయాంటీబాడీస్ ఇన్ఫెక్షన్‌లను తగ్గించడంలో , ఇన్‌ఫెక్షన్‌ను కట్టడి చేయడంలో ఈ వ్యాక్సిన్ పనిచేసిందని తెలిపారు.
ఈ నెల ప్రారంభంలో భారత్ బయోటెక్ నాసికా వ్యాక్సిన్‌ను హెటెరోలాగస్ బూస్టర్ డోస్‌గా ఉపయోగించడం కోసం సెంట్రల్ డ్రగ్ రెగ్యులేటర్ నుండి అనుమతి పొందింది. హెటెరోలాగస్ బూస్టర్ సిస్టమ్‌లో ఒక వ్యక్తికి ప్రాథమిక మోతాదుకు భిన్నంగా వ్యాక్సిన్‌ని ఇవ్వవచ్చు. నాసల్ డెలివరీ సిస్టమ్ గా దీన్ని తీర్చిదిద్దారు. భారత్ బయోటెక్ కంపెనీ తక్కువ ,మధ్య-ఆదాయ దేశాలలో తక్కువ ఖర్చుతో ఈ వ్యాక్సిన్ వాడుకునేలా రూపొందించబడింది.
“ఈ మహమ్మారి సమయంలో మేము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించాము. ఇప్పటికే COVAXIN .. ఇప్పుడు iNCOVACC రెండు వేర్వేరు డెలివరీ సిస్టమ్‌లతో రెండు వేర్వేరు ప్లాట్‌ఫారమ్‌ల నుండి రెండు కోవిడ్ వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేసాం. మాకు వేగవంతమైన ఉత్పత్తి అభివృద్ధి, స్థాయికి సామర్థ్యాన్ని ఇది అందించింది. పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీలు , మహమ్మారి సమయంలో సులభంగా మరియు నొప్పిలేకుండా ఇమ్యునైజేషన్ చేయడానికి నాసల్ వ్యాక్సిన్ గొప్పగా ఉపయోగపడుతుందని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా ఒక ప్రకటనలో తెలిపారు. మద్దతు ఇచ్చిన ఆరోగ్య మంత్రిత్వ శాఖతో సహా ప్రభుత్వ సంస్థలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఇన్ కో వ్యాక్ నాసల్ వ్యాక్సిన్ ను వాషింగ్టన్ యూనివర్శిటీ, సెయింట్ లూయిస్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయబడింది. ఇది రీకాంబినెంట్ అడెనోవైరల్ వెక్టర్డ్ నిర్మాణంగా రూపొందించి అభివృద్ధి చేసింది. సమర్థత కోసం నిర్వహించిన ప్రిలినికల్ అధ్యయనాలలో బాగా రిజల్ట్ వచ్చిందని భారత్ బయోటెక్ తెలిపింది.
సులభంగా నిల్వ చేయడానికి , పంపిణీ చేయడానికి నాసికా టీకా మోతాదులు బాగా ఉపయోగపడుతాయి. 2-8 డిగ్రీల సెల్సియస్ వద్ద స్థిరంగా దీన్ని ఉంచవచ్చని.. ప్రపంచంలోని అన్ని దేశాల ఉష్ణోగ్రతలకు అనుగుణంగా రూపొందించామని భారత్ బయోటెక్ తెలిపింది.