Dubai Lottery: లక్ష రూపాయల లక్కీ డ్రా తగిలితేనే ఆనందానికి అవధులు ఉండవు. అటువంటిది ప్రతి నెలా రూ.5.50 లక్షలు.. వరుసగా 25 సంవత్సరాలు పాటు దక్కితే దానిని ఏమనాలి.. ఎలా వర్ణించాలి? దుబాయిలో యూపీ కి చెందిన యువకుడికి ఈ జాక్ పాట్ తగిలింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఫాస్ట్ ఫైవ్ పేరిట నిర్వహించిన లాటరీలో మిలీనియర్ గా మారే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నాడు ఆ యువకుడు.
యూపీ కి చెందిన మహమ్మద్ అదిల్ ఖాన్ గత కొంతకాలంగా దుబాయ్ లోని ఒక రియల్ ఎస్టేట్ సంస్థల్లో పనిచేస్తున్నాడు. ఇంటీరియర్ డిజైన్ కన్సల్టెంట్ గా పని చేస్తున్న అదిల్ ది నిరుపేద కుటుంబం. అదిల్ ఒక్కడే దుబాయ్ లో ఉంటున్నాడు. ఆయనకు లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉంది. ఈ నేపథ్యంలో యూఏఈ పాస్ట్ 5 పేరిట నిర్వహించిన లాటరీలో అదిల్ టిక్కెట్ కొనుగోలు చేశాడు. ఇటీవల సదరు సంస్థ డ్రా తీసింది. అదిల్ ఖాన్ తొలి విజేతగా నిలిచాడు. ఈ లాటరీ నిబంధనల ప్రకారం విజేతకు నెలకు 5 లక్షల 59 వేలు అందించనున్నారు. ఇలా 25 ఏళ్ల పాటు ప్రతి నెలా ఈ మొత్తాన్ని అందజేయనున్నారు.
ఈ సందర్భంగా అదిల్ ఖాన్ మాట్లాడుతూ లక్కీ డ్రా లో విజేతగా నిలవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. కుటుంబానికి తానే ఏకైక జీవనాధారం అని.. కోవిడ్ తో తన సోదరుడు చనిపోయాడని.. ఆ కుటుంబ బాధ్యతలు తనపైనే పడ్డాయని చెప్పుకొచ్చాడు.. ఇటువంటి సమయంలో లక్కీ డ్రా విజేతగా నిలవడం తనకు కొండంత అండ దొరికిందని ఆనందం వ్యక్తం చేశాడు. తొలుత తాను నమ్మలేకపోయాను అని.. కానీ నిర్వాహకులు వివరించి చెప్పడంతో నమ్మినట్లు అదిల్ ఖాన్ చెబుతున్నాడు.