
India vs Australia: భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు ఇప్పటివరకు జరిగిన టి20, టెస్ట్ సిరీస్ లను కోల్పోయింది. శుక్రవారం నుంచి వన్డే సిరీస్ ప్రారంభం అవుతుంది. ప్రపంచ ర్యాంకింగ్స్ లో తొలి రెండు స్థానాల్లో ఉన్న మేటి జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియాను ఇండియా ఢీకొనబోతోంది. ముంబై వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది
రెండు జట్ల మధ్య 143 మ్యాచ్ లు..
భారత్, ఆసీస్ జట్ల మధ్య ఇప్పటిదాకా 143 వన్డేలు జరిగాయి. ఇందులో 80-53తో కంగారూలదే ఆధిపత్యం. పది మ్యాచుల్లో ఫలితం తేలలేదు. అత్యంత ప్రతిష్టాత్మక బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ – 2023 ముగిసింది. నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 2 మ్యాచ్‌లు నెగ్గిన ఇండియా ట్రీఫీని ముద్దాడింది. ఒక్క మ్యాచ్ ఆస్ట్రేలియా గెలవగా, నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండు జట్ల మధ్య వన్డే సమరం మొదలైంది.
ముంబై వేదికగా తొలి వన్డే..
ముంబై వాంఖడే స్టేడియంలో తొలి వన్డే మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచులో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచుకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండటం లేదు. దీంతో.. హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. టీమిండియా నలుగురు ఫాస్ట్ బౌలర్లు, రెండు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుంది.
తొలిసారి పాండ్య సారథ్యం..
వన్డే ఫార్మాట్‌లో జట్టుకు నాయకత్వం వహించడం పాండ్యాకిదే తొలిసారి. పొట్టి ఫార్మాట్‌లో జట్టును విజయవంతంగా నడిపిస్తున్న హార్దిక్‌ను వన్డేల్లోనూ భవిష్యత్ కెప్టెన్‌గా క్రికెట్ పండితులు పరిగణిస్తున్నారు. అందుకే ఈ మ్యాచ్ అతడికీ కీలకమే. ఆసీస్ కూడా రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ లేకుండానే బరిలోకి దిగుతోంది. స్మిత్ నాయకత్వంలో చివరి రెండు టెస్టుల్లో రాణించిన విధంగానే వన్డే సిరీస్ లోనూ సత్తా చాటాలనుకుంటోంది.

ఆ ఇద్దరూ ఆడితే..
టీమిండియాలో గిల్, విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్ లో ఉన్నారు. ఈ ఇద్దరూ సత్తా చాటితే టీమిండియాకు తిరుగుండదు. యంగ్ సెన్సేషన్ ఇషాన్ కిషన్.. గిల్ తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ మిడిలార్డర్ బాధ్యతలు మోయనున్నారు. సూర్యకుమార్ యాదవ్ కి కూడా ఈ సిరీస్ కీలకం కానుంది. టీ20 ఫార్మాట్ లో చెలరేగిన సూర్య.. వన్డే క్రికెట్ లో ఇంతవరుకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. కేఎల్ రాహుల్ కు ఇది డూ ఆర్ డై సిరీస్ లాంటిది. కుర్రాళ్లు సత్తా చాటుతున్న వేళ.. కేఎల్ రాహుల్ కి ఇది అగ్ని పరీక్షే. ఆల్ రౌండర్ గా జడేజా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.
ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేయొద్దు..
మరోవైపు.. ఆస్ట్రేలియా కూడా వన్డేల్లో చాలా డేంజరస్. హెడ్, మిచెల్ మార్ష్, స్మిత్, మ్యాక్స్ వెల్, గ్రీన్ వంటి డేంజరస్ ప్లేయర్లు ఆ జట్టులో ఉన్నారు. స్టొయినిస్ కూడా సూపర్ ఫాంలో ఉన్నాడు. బౌలింగ్ జంపా, స్టార్క్ టీమిండియా బ్యాటింగ్ లైనప్ కు సవాల్ విసరనున్నారు.
*తుది జట్లు :*
భారత్: గిల్, ఇషాన్, కోహ్లీ, సూర్యకుమార్, రాహుల్, హార్దిక్ (కెప్టెన్), జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్, షమి, సిరాజ్
ఆస్ట్రేలియా: హెడ్, మిచెల్ మార్ష్, స్మిత్ (కెప్టెన్), లబుషేన్, జోష్ ఇంగ్లిష్, మ్యాక్స్‌వెల్, గ్రీన్, స్టొయినిస్, ఎబాట్, జంపా, స్టార్క్