Contempt Of Court: కోర్టు నోటీసులంటే వారికి లెక్కలేదు. కోర్టు ఆదేశాలంటే వారికి భయం అసలే లేదు. నేరం చేసిన ఖైదీల్లా నిత్యం కోర్టుల చుట్టూ తిరగడానికి నామోషీ అసలే లేదు. కోర్టు ఆదేశాలను ధిక్కరించి న్యాయస్థానం ముందు దోషుల్లా నిలబడానికి ఏమాత్రం బెరుకు, భయం లేదు. వారికి కావాల్సిందల్లా ప్రభుత్వ పెద్దల మెప్పు పొందడం. వారు చెప్పినట్టు నడుచుకోవడం. వారి అండ ఉందన్న అహంకారం. వెరసి రాజకీయ క్రీడలో బలిపశువులు కావడం. ఇదంతా ఏపీలోని అధికారుల నిర్వాకం.

కోర్టు ఆదేశాలను అమలు చేయడం ప్రభుత్వ అధికారుల బాధ్యత. ప్రభుత్వం జీతమిచ్చేది కూడా అందుకే. కానీ కొందరు అధికారులు కేవలం ప్రభుత్వం మెప్పు పొందేందుకు నిరంతరం ఆరాటపడుతున్నారు. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు తలూపుతున్నారు. చట్టవ్యతిరేకమైన పనులు చేయడానికి కూడా వెనుకాడటంలేదు. కోర్టులు ఆదేశాలను ధిక్కరిస్తున్నారు. కోర్టులంటే లెక్కలేనితనంతో విర్రవీగుతున్నారు. మరికొందరు కోర్టుల్నే దూషించే స్థాయికి వెళ్లారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించడం .. కోర్టు ముందు దోషుల్లా నిలబడటం ఇప్పుడు అధికారులకు ఇదొక నిత్యకృత్యం అయింది. హైకోర్టు సమీపంలో ఓ ప్రభుత్వ గెస్ట్ హౌస్ ఏర్పరుచుకుంటే మంచిదని కోర్టు వ్యాఖ్యనించింది అంటే.. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
కోర్టు ధిక్కరణ కేసుల్లో జైలు శిక్షల సంఖ్య కూడా పెరిగింది. జైలుకెళ్తున్న అధికార సంఖ్య పెరిగింది. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నారో అధికారులు మనస్సాక్షిని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం న్యాయస్థానాలను ధిక్కరించడం సబబా ?. ప్రజాస్వామ్యంలో ఉన్నతమైన వ్యవస్థలను గౌరవించకపోతే.. సామాన్యులు గౌరవిస్తారా అన్న ప్రశ్న అధికారులు వేసుకోవాలి. కోర్టు ధిక్కరణ కేసుల్లో జైళ్లకు ఎవరి కోసం .. ఎందుకోసం వెళ్తున్నారో ఆత్మపరిశీలన చేసుకోవాలి. తమ జీవితాలను పణంగా పెట్టి ప్రభుత్వ పెద్దలు చెప్పిన పనులు చేయాల్సిన అవసరం ఉందా అన్న ప్రశ్న వేసుకోవాలి.

ప్రభుత్వ తరపు న్యాయవాదులు కూడా తప్పుడు సలహాలు ఇస్తూ.. ప్రభుత్వాలను తప్పుబడుతున్నాయని ఇటీవల కోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంలో అధికారుల తప్పు ఎంత ఉందో.. న్యాయవాదుల తప్పు కూడా అంతే ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. దీనిని బట్టి కోర్టుల పట్ల అధికారులకు, న్యాయవాదులకు ఎలాంటి గౌరవం ఉందో అర్థమవుతుంది. ఇలాంటి వ్యవహారాల కారణంగా వ్యవస్థల పై ప్రజల్లో నమ్మకం పోతుంది. ఇప్పటి వరకు ఇలాంటి కోర్టు ధిక్కరణ కేసులు కోకొల్లలు. లెక్కకు మించిన కేసుల్లో అధికారులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.
కోర్టు ధిక్కరణ కేసుల్లో న్యాయస్థానం ముందు హాజరవుతున్న వారిలో చాలా మంది ఉన్నతాధికారులే ఉన్నారు. కేవలం ప్రభుత్వ పెద్దల మెప్పు పొందాలనే ఉద్దేశం తప్ప మరొక్కటి కనపడటంలేదు. నిత్యం కోర్టుల చుట్టూ తిరగడం బదులు తమ బాధ్యతలు నిర్వర్తేస్తే ఇలాంటి బాధలు ఉండవు కదా. ఎంతసేపు స్వామికార్యం కోసం పరితపించే బదులు ఉద్యోగ బాధ్యతను నిర్వర్తించడం మేలు కదా. ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం చూస్తే.. కటకటాల వెనుక ఊచలు లెక్కపెట్టేది అధికారులే.. ప్రభుత్వ పెద్దలు కాదు. ఈ విషయం ఇంత చదువుకున్న అధికారులకు అర్థం కాదూ.