
YS Vivekananda Reddy Murder Case: పత్రికలన్నీ రాజకీయ రంగు పులుముకున్నాక.. ప్రచురించే వార్తలను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. ఫర్ సపోజ్ జగన్ పై దాడి జరిగినప్పుడు సాక్షి చంద్రబాబు మీద దుమ్మెత్తి పోసింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి అసలు చొక్కాచిరగకుండా గాయం ఎలా అవుతుందని, అతడు ఎలా దాడి చేస్తాడని, ఇది మా చంద్రబాబుకు కుట్రను ఆపాదించే సంఘటన అని కౌంటర్ ఇచ్చాయి. ఇది జరిగిన కొద్ది రోజులకే వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యాడు. దీనిని మొదట్లో విజయసాయిరెడ్డి వంటి వారు గుండెపోటు అని తేల్చేశారు. తర్వాత సాక్షి నారాసుర చరిత్ర అంటూ చంద్రబాబు నాయుడే వివేకానంద రెడ్డిని హత్య చేయించాడని రాసుకొచ్చింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి బాబును కాపాడేందుకు రకరకాల ప్రయత్నాలు చేశాయి. అక్షర విన్యాసాలకు తెరలేపాయి. ఎన్ని చేసినా 2019లో బాబును 23 దగ్గర మాత్రమే ఉంచగలిగాయి.
ఇప్పుడు సీన్ మారింది.. వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ వేగంగా పావులు కదుపుతోంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైయస్ భాస్కర్ రెడ్డిని నిన్న సిబిఐ అరెస్టు చేసింది. అంతేకాదు అవినాష్ రెడ్డిని విచారణ నిమిత్తం హైదరాబాద్ రావాలని కోరింది. తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు. ఒక సెక్షన్ మాత్రం అవినాష్ రెడ్డి ని అరెస్ట్ చేస్తారని చెబుతోంది. మరొక సెక్షన్ మాత్రం సిబిఐ ఇలా ఉరుకులు పెడుతుందే గాని, చర్యలు తీసుకోదని అంటున్నది.
కానీ ఇక్కడ చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే నిన్న జరిగిన పరిణామాలు, ఇవ్వాళ వాటికి కొనసాగింపుగా జరుగుతున్నవి ఒక్కో పేపర్లో ఒక్కో తీరుగా వచ్చాయి. సాక్షి తనకు అలవాటైన ధోరణిలోనే వార్తలను ప్రచురించింది. సిబిఐ అడ్డగోలుగా విచారణ చేస్తున్నదని, గతంలో అధికారులు ఒక విధంగా చార్జ్ షీట్ దాఖలు చేస్తే, ప్రస్తుత అధికారులు మరో విధంగా ఛార్జ్ షీట్ దాఖలు చేశారని అడ్డగోలుగా వాదనకు దిగింది. వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సుద్దపూస అని తేల్చేసింది. కానీ ఇదే సమయంలో ప్రధానమంత్రిని పల్లెత్తు మాట కూడా అనలేదు.. గతంలో జరిగిన పరిణామాలను ఉటంకించుకుంటూ వెళ్ళింది కానీ, తాను రాసిన నారా సుర చరిత్రను మళ్లీ తెరపైకి తీసుకురాలేకపోయింది.

ఇక ఈనాడు, జ్యోతి బస్తీ మే సవాల్ అంటూ జగన్ కు ఛాలెంజ్ చేశాయి. నాడు మా చంద్రబాబు పై హంతకుడనే ముద్రవేస్తారా? ఇప్పుడు చూడు మీ బాబాయినే సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. నెక్స్ట్ టార్గెట్ వైఎస్ అవినాష్, ఆ తర్వాత నువ్వే అంటూ గట్టిగా రాసుకొచ్చాయి. ఏపీ రాష్ట్రానికి సంబంధించిన సంఘటన తాలూకూ వార్తలను కూడా తెలంగాణ ఎడిషన్లో ప్రచురించాయి. ఇక ఈనాడు అయితే వైయస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత రెడ్డి రాసుకొచ్చింది. ఇక ఆంధ్రజ్యోతి జగన్ ప్రధానమంత్రి ముందు మోకరిల్లబోతున్నారని రాసేసింది. ఇక్కడ పత్రిక కొనుక్కున్న పాపానికి పాఠకులకు ఏది నిజమో? ఏది అబద్ధమో తెలియని పరిస్థితి. పోనీ సిబిఐ అర్థమయ్యేలా చెబుతుందా అంటే.. అందులో తెలుగు వచ్చిన వాడు ఎవరూ లేరు..పాపం తెలుగు పాఠకులకు ఎన్ని కష్టాలు.