Medaram Disaster: గత నెల 31న ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు మండలం తాడ్వాయి – మేడారం అడవుల్లో భీకరమైన గాలి వీచింది. ఆ సమయంలో మానవ మాత్రులు అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం చోటు చేసుకోలేదు ఏమైంది. ఆ గాలి వల్ల 500 ఎకరాల్లో 50 వేలకు పైగా వృక్షాలు నేలకు ఒరిగాయి. కొన్ని చెట్లు వేళ్ళతో సహా కుంగిపోయాయి. ఈ ఘటన జరిగిన తర్వాత ఆ ప్రాంతంలో భారీగా వర్షాలు కురిసాయి. ఇప్పుడిప్పుడే వాతావరణం తెరిపినిస్తున్న నేపథ్యంలో అధికారులు నష్టాన్ని అంచనా వేయడానికి క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. కూలిన చెట్ల లెక్కింపును అధికారులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగిస్తున్నారు. అధికారుల పరిశీలనలో ఒక్క జంతువు కూడా చనిపోయినట్టుగాని.. కనీసం గాయపడినట్టుగాని తెలియ రాలేదు.
అభయారణ్యం పరిధిలో..
ఏటూరునాగారం అభయారణ్యం పరిధిలో విస్తారంగా జంతువులు ఉంటాయి. ముఖ్యంగా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు చిరుత పులులు , పులులు వస్తూ ఉంటాయి. ఈ సమయంలో సమీపంలో ఉన్న గ్రామాల్లోని పశువులపై దాడి చేసి తింటాయి. జింకలు, కుందేళ్లు, అడవి దున్నపోతులు, కొండ గొర్రెలు, నీలుగాయిలు ఏటూరు నాగారం అభయారణ్యం పరిధిలో ఉంటాయి. ఈ జంతువులకు ఒక్క గాయం కూడా కాలేదు. వన్యప్రాణులకు ప్రకృతి విపత్తులను ముందే పసిగట్టే లక్షణం ఉంటుందట. ప్రకృతిలో సంభవించే మార్పులను అవి త్వరగా గుర్తిస్తాయట. శబ్దాలు, వాసన, భూ ప్రకంపనలను అవి త్వరగా పసిగడతాయట. అందువల్లే ఆరోజు ఘటన జరిగే ముందు ఆ జంతువులు అలాంటి లక్షణాలను పసిగట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.. అందువల్లే అధికారుల పరిశీలనలో ఒక్క జంతువు కూడా గాయపడినట్టు.. చనిపోయిన ఆనవాళ్లు కనిపించలేదట. ఆ జంతువులు ఇతర సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత ఆ ప్రాంతానికి కనీసం ఒక్క జంతువు కూడా రాలేదని వివరిస్తున్నారు. భవిష్యత్తు కాలంలో ఈ ప్రాంతంలో చెట్లు మళ్లీ పెరిగి.. పూర్వ రూపాన్ని సంతరించుకుంటే తప్ప జంతువులు వచ్చే పరిస్థితి లేదని అధికారులు అంటున్నారు. ప్రకృతి తో మమేకం అయ్యి జీవిస్తాయి కాబట్టి.. జంతువులకు సహజ లక్షణాలు అబ్బుతాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా, గాలి తీవ్రతకు నేలకొరిగిన చెట్ల కొలతలను అటవీ శాఖ అధికారులు లెక్కిస్తున్నారు. ఈనెల ఐదు నుంచి ఈ ప్రక్రియ మొదలైంది. మరి కొద్ది రోజుల్లో ఇది పూర్తవుతుందని అటవీ శాఖ అధికారులు అంటున్నారు. విరిగిపోయిన చెట్ల స్థానంలో కొత్త మొక్కలు నాటుతామని.. కూలిపోయిన చెట్ల స్థానంలో అరుదైన మొక్కలను తెచ్చి పెంచుతామని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.