Burger King: ఇటీవల కాలంలో టమాట ధరలు మండిపోతున్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఏర్పడిన టమాటల కొరత కారణంగా కిలో రూ.200 వరకు ధర పలికింది. కొందరు పెళ్లిళ్లకు, ప్రత్యేక కార్యక్రమాలకు టమాటాలను గిఫ్ట్ గా ఇచ్చారు. ఒక దశలో మాంసం కంటే టమాటాలను ఎక్కువ ధరతో విక్రయించారు. అయితే ఇప్పుడిప్పుడే టమాటా ధరలు దిగి వస్తున్నాయి. కానీ ధరలు పెరిగిన నేపథ్యంలో కొన్ని స్టార్ హోటళ్లలో టమాట ను ఉపయోగించే పదార్థాల్లో ఇవి లేకుండానే తయారు చేశారు. ఇక ఫుడ్ చేయిన్ సంస్థలైతే టమాట లేకుండానే బర్గర్లను సప్లయ్ చేశాయి.
టమాట కొరత కారణంగా మెక్ డోనాల్డ్, సబ్ వే లు ఇప్పటికే వాటికి సంబంధించిన పదార్థాల సప్లయ్ ని నిలిపివేశారు. తాజాగా ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం ‘బర్గర్ కింగ్’ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఆహార పదార్థాల్లో టమాటాల వినియోగాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. భారత్ లో 2020 నుంచి ఏర్పడిన ద్రవ్యోల్భణం ఏర్పడిందని, ఇది తీవ్ర స్థాయికి చేరుకుందని అందువల్ల టమాటల వినియోగాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
భారతదేశంలో ‘బర్గర్ కింగ్’ పేరుతో 400 రెస్టారెంట్లు ఉన్నాయి. రెస్టారెంట్ బ్రాండ్స్ ఏసియా పేరుతో బర్గర్ కింగ్ ఫాస్ట్ ఫుడ్ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. అయితే ఇప్పటి నుంచి టమాట పదార్థాన్ని రద్దు చేస్తున్నామని అన్నారు. తాము ఎంత ప్రయత్నించినప్పటికీ ప్రపంచస్థాయి కఠినమైన నాణ్యతతో తగు విధంగా టమాటాలను వినియోగించలేకపోతున్నామని అన్నారు.
అయితే ఓ వైపు టమాట ధరలు తగ్గుతున్నా ఫుడ్ కంపెనీలు మాత్రం టమాటను మాత్రం వినియోగించలేకపోతున్నామని చెబుతున్నాయి. ప్రస్తుతం టమాట రూ.30తో విక్రయిస్తున్నారు. అయితే భవిష్యత్ లో ఇవి మరోసారి కొరత ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు. ఇలాంటి సమయంలో టమాటాలపై ఆధారపడాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఇదే సంస్థ ఉచితంగా అందించే చీజ్ ను కూడా రద్దు చేసింది.