
Impact Player On IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఈ ఏడాది కొత్తగా కొన్ని మార్పులు చేశారు. అందులో ఒకటి ఇంపాక్ట్ ప్లేయర్ ను బరిలోకి దించడం. అయితే ఇప్పటివరకు ఈ విధానం ఆశించిన స్థాయిలో ఆయా జట్లకు సత్ఫలితాలను ఇవ్వకపోవడం గమనార్హం. ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ ల్లో అన్ని టీమ్ లు ఇంపాక్ట్ ప్లేయర్ ను వినియోగించుకోగా.. ఒక్క బెంగళూరు మాత్రమే ఇప్పటి వరకు ఇంపాక్ట్ ప్లేయర్ ను బరిలోకి దించలేదు.
ఈసారి ఐపీఎల్ లో కొత్తగా ఇంపాక్ట్ ప్లేయర్ సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. ఆటను ఆసక్తికరంగా మార్చడంతో పాటు జట్లకు ఉపయుక్తంగా ఉంటుందని ఈ నిబంధనను ప్రవేశపెట్టారు. అయితే తొలి నాలుగు రోజుల్లో జరిగిన ఆరు మ్యాచ్ లోనూ ఇంపాక్ట్ ప్లేయర్లు రంగంలోకి దిగారు. కానీ వాళ్లు అనుకున్న స్థాయిలో ఇంపాక్ట్ మాత్రం చూపించలేకపోయారు. ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకోవడంలో జట్లు తడబడుతున్నాయా లేక పరిస్థితులు కలిసి రావడం లేదా అన్నది చెప్పలేం కానీ ఇప్పటిదాకా అయితే మ్యాచ్ ను మలుపు తిప్పే ప్రదర్శన ఏ ఇంపాక్ట్ ప్లేయర్ కూడా చేయలేదు.
ఇంపాక్ట్ ప్లేయర్ అంటే..?
ఇంపాక్ట్ ప్లేయర్ విధానాన్ని ఈ సీజన్ నుంచి అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని ప్రకారం ప్రతి మ్యాచ్ ఆరంభానికి ముందు ఐదుగురు సబ్స్టిట్యూట్లను ప్రకటించి అందులోంచి ఒకరిని మ్యాచ్ లో ఎప్పుడైనా ఇంపాక్ట్ ప్లేయర్ గా దించే సౌలభ్యం జట్లకు ఉంది. అలా వచ్చిన ఆటగాళ్లు ఎవరూ ఆయా జట్లకు ఉపయోగపడలేకపోయారు ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ ల్లో. ఐపీఎల్ లో తొలి ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన ఘనత తుషార్ దేశ్ పాండేదే. గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్లో చెన్నై ఈ ఫాస్ట్ బౌలర్ ను అంబటి రాయుడు స్థానంలో ఆడించింది. అయితే అతను 3.2 ఓవర్లలో ఏకంగా 51 పరుగుల సమర్పించుకొని ఒక్క వికెట్ తీశాడు. లఖ్ నవూతో మ్యాచ్ లోనూ చెన్నై ఇదే ఫార్ములా పాటించింది. నాలుగు ఓవర్లు వేసిన తుషార్ 45 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. చెన్నై తో మ్యాచ్ లో గాయపడిన విలియమ్స్ స్థానంలో గుజరాత్ సాయి సుదర్శన్ ను ఆడించింది. అతను 21 పరుగులు మాత్రమే చేశాడు.

మిగిలిన ప్లేయర్లు అంతంతమాత్రంగానే..
ఇక ఆ తర్వాత జరిగిన పంజాబ్ తో మ్యాచ్ లో కోల్ కతా జట్టు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్థానంలో వెంకటేష్ అయ్యర్ ను దించింది. అతను 28 బంతుల్లోనే 34 పరుగులతో ఓ మోస్తారు ఇన్నింగ్స్ ఆడాడు. వెంకటేష్ నెమ్మదిగా బ్యాటింగ్ చేయడం కోల్కతాకు చేటు చేసింది. డక్వర్త్ లూయిస్ పద్ధతిలో ఫలితం తేలిన ఈ మ్యాచ్ లో పంజాబ్ ఏడు పరుగులు తేడాతో నెగ్గింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ తమ బ్యాటర్ భానుక రాజపక్ష స్థానంలో పేసర్ రిషి ధావన్ ను ఆడించగా.. అతను ఒక ఓవర్లో 15 పరుగులు సమర్పించుకున్నాడు. అలాగే ఢిల్లీ తో మ్యాచ్ లో లఖ్ నవూ.. ఆయుష్ బదోని అవుట్ అవ్వగానే కృష్ణప్ప గౌతమ్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా దించింది. అతను చివరి బంతికి సిక్సర్ బాదాడు. తరువాత బౌలింగ్లో నాలుగు ఓవర్లు వేసి వికెట్ పడగొట్టకుండా 23 పరుగులు ఇచ్చాడు. ఇదే మ్యాచ్లో ఢిల్లీ తమ బౌలింగ్ ముగిశాక పేసర్ ఖలీల్ అహ్మద్ స్థానంలో అమన్ ఖాన్ ను బ్యాటర్ గా దించింది. అతను నాలుగు పరుగులే చేశాడు. చెన్నై తో మ్యాచ్లో ఆవేశ్ ఖాన్ స్థానంలో వచ్చిన బదోని 23 పరుగులు చేశాడు. రాజస్థాన్ తో పోరులో సన్రైజర్స్.. ప్యాసర్ ఫారుకి స్థానంలో అబ్దుల్ సమద్ ను బ్యాటింగ్ కోసం ఉపయోగించుకుంది. అయితే ఆ జట్టు ఓటమి ఖరారు అయ్యాక క్రీజులోకి వచ్చిన 32 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ ఓపనర్ యశస్వి జైస్వాల్ స్థానంలో సైనిని ఆడించగా.. అతను రెండు ఓవర్లలో ఏకంగా 34 సమర్పించుకున్నాడు. బెంగళూరు తో జరిగిన మ్యాచ్లో ముంబై బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ స్థానంలో పేసర్ బెరెన్ డార్ఫ్ ను ఆడించింది. అతను మూడు ఓవర్లలో 37 పరుగులు ఇచ్చి వికెట్ పడగొట్టలేకపోయాడు. ఈ మ్యాచ్ లో బెంగళూరుకు ఇంపాక్ట్ ప్లేయర్ ను ఆడించాల్సిన అవసరం పడలేదు. టోర్నీలో ఎప్పటిదాకా ఈ సౌలభ్యం ఉపయోగించుకోనిది బెంగళూరు జట్టు మాత్రమే. ఇప్పటివరకు వినియోగించకున్న జట్లకు ఆశించిన స్థాయిలో ఫలితం కూడా రాకపోవడం గమనార్హం.