
Minister Malla Reddy: “పాలమ్మిన, పూలమ్మిన, కష్ట పడ్డ, సక్సెస్ అయిన, మల్లారెడ్డి అంటే ఒక బ్రాండ్” ఏ ముహూర్తాన పాల మల్లన్న అలియాస్ మంత్రి మల్లారెడ్డి ఈ మాటలు అన్నాడో కానీ.. మస్తు ఫేమస్ అయ్యుండు.. అప్పట్లో ఆయన సంస్థల మీద ఐటి అధికారులు దాడులు చేస్తున్నప్పుడు.. ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానం చెప్పిండు. ఇక అప్పటినుంచి మంత్రి మల్లారెడ్డి మీద ట్రోలర్లు, మీమర్లు వేల కొద్ది వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నరు.
ఆ వీడియోలు ఇచ్చిన ఊపుతో మల్లారెడ్డి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నడు.. ఫేస్బుక్, ఇన్ స్టా గ్రామ్, యూ ట్యూబ్.. ఇలా ఏ మాధ్యమం చూసుకున్న అందులో ఉన్న రీల్స్ లో మల్లారెడ్డి మాత్రమే కనిపిస్తున్నడు. దీన్ని చూసుకుని మల్లారెడ్డి బగ్గ మురుస్తున్నడు.. పైగా ఈ మధ్య నేను తుమ్మితే తుఫాన్ అవుతున్నదని కామెంట్లు కూడా చేస్తున్నడు. అసెంబ్లీలో కెసిఆర్ కు డబ్బాలుగొట్టే మల్లన్న, మేడ్చెల్ లో భూములు కబ్జా పెట్టిండు అని ఆరోపణలు ఎదుర్కొనే మల్లన్న.. బయట మాత్రం ఉన్నది ఉన్నట్టు మాట్లాడతడు. “రెడ్డి కులపోల ఆడపిల్లను చేసుకుంటే మాట వినరని, అస్తమానం సినిమాలు షికార్లకు పోతరని” చెప్పే మల్లారెడ్డి.. కాలేజీ పోరలకు మాత్రం మంచి ఉపన్యాలు ఇస్తడు. పైసలు సంపాదించే ఇకమతి మస్తుగా చెప్తడు.

“పోరిల వెంట పడొద్దు. గంజాయి తాగొద్దు. సిగరెట్ కాల్చొద్దు. మందు ముట్టొద్దు. చినిగిపోయిన జీన్స్ పాయింట్లు వేయొద్దు. గుడిసెల పొంటి తిరగద్దు.. కష్టపడాలే. పని చేయాలే. పైకం కూడ పెట్టాలే. పదిమందికి పని కల్పియాలే. అప్పుడే మనం సక్సెస్ అయ్యేది. పదిమంది మన గురించి చెప్పుకునేది” గిసంటి మాటలు చెప్తుంటే కాలేజీ పోరలు కూడా ఈలలు కొట్టి ఇంటున్నరు.
యూత్ పోరల పల్స్ బాగానే పట్టినట్టు ఉన్నడు మల్లన్న.. అందుకే వాళ్లకు అర్థమయేలాగా మాట్లాడుతున్నడు. ఎవరైనా ఐదు నిమిషాలు మాట్లాడుతనే యూత్ పోరగాండ్లు విసుక్కుంటరు. అదేందోగని మల్లన్న మాట్లాడితే కామాయిషుగా ఇంటున్నరు. ఈలలు, చప్పట్లు కొట్టుకుంటా మల్లన్నను మరింత ఎంకరేజ్ చేస్తున్నరు.. అంతేకాదు ఆ మధ్య పవన్ కళ్యాణ్ సినిమాల విలన్ గా చేసేందుకు నన్ను డైరెక్టర్ హరిశంకర్ అడిగిండని, గంటన్నరసేపు బతిలాడిండని మంత్రి మల్లన్న చెప్పుకొచ్చిండు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెల్వదు గని.. ఈ ముచ్చట చెప్తుంటే మాత్రం కాలేజీ పోరలు గోల గోల చేసిర్రు. ఎవరికైనా ఐటీ అధికారులు దాడులు చేస్తే గుబులు పడతది. కానీ అదేందోగని మల్లన్న పేరు మాత్రం వెల్ నోటెడ్ అయింది . ఈ సోషల్ మీడియా జమానాల ఎవలు ఎప్పుడు ఫేమస్ అవుతున్నరో, ఎందుకు అవుతున్నరో ఎంతకీ అంతు పడతలేదు.