Bangalore : రానురానూ వైవాహిక జీవితానికి అర్ధం లేకుండా పోతోంది. అగ్నిసాక్షిగా కట్టిన తాళి ఎగతాళిగా మారిపోతోంది. తమ అభిప్రాయాలు కలవలేదని చాలా ఈజీగా బంధం తెంచుకుంటున్నారు. రంగుల ప్రపంచంలో విహరించి మరొకరితో బంధం పెంచుకుంటున్నారు. ఇలా కలుస్తున్న బంధం కొద్దిరోజులకే కలహాలకు దారి తీస్తోంది. జీవితాన్ని అంధకారంలోకి నెట్టేస్తోంది. తట్టుకోలేక భాగస్థుల్లో ఎవరో ఒకరు బలవన్మరణాన్ని ఆశ్రయిస్తున్నారు. బెంగళూరులో ఇటువంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. భర్తతో విడాకులు తీసుకున్న ఓ మహిళ తాను పనిచేస్తున్న సంస్థ యజమానినే మనువాడింది. కానీ ఆయన మరో మహిళను ఇష్టపడ్డాడు. తట్టుకోలేని ఆమె కఠిన నిర్ణయం తీసుకుంది.
బెంగళూరుకు చెందిన పవిత్ర గృహిణి ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. పవిత్రకు ఇది వరకే వివాహం జరిగింది. కానీ భర్తతో విభేదాలు తలెత్తి విడాకులు తీసుకుంది. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుంది. దాని యజమాని చేతన్ సుముక్ పవిత్రపై మనసుపడ్డాడు. ఆమె లేనిదే జీవితం లేదని నమ్మించాడు. పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చాడు. అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాడు. ఎంతో అపురూపంగా చూసుకున్నాడు. కానీ ఆయన వ్యవహార శైలి ఎక్కడో తేడా కొట్టింది. పవిత్ర ఆరాతీస్తే ఒక విషయం తెలిసింది.
చేతన్ ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. దీనిపై భార్య పవిత్ర ప్రశ్నిస్తే అవమానాలు, అనుమానాలు ఎదురయ్యాయి. రెండో వివాహం కావడంతో ఆయన చర్యలతో పవిత్ర విసిగివేశారిపోయింది. నిత్యం దంపతుల మధ్య తగాదాలు జరుగుతునే ఉన్నాయి. ఇటీవల వేధింపులు తీవ్రతరం కావడంతో పవిత్ర మనస్తాపానికి గురైంది. తనకు జరుగుతున్న అన్యాయాన్ని తల్లి పద్మమ్మతో చెప్పుకొని బోరున విలపించింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. అందుకు గల కారణాలు చెబుతూ సూసైడ్ నోట్ రాసింది. దానిని వాట్సాప్ స్టేటస్ లో పెట్టి బలవన్మరణానికి పాల్పడింది. తల్లి పద్మమ్మ ఇంట్లోకి వచ్చి చూసేటప్పటికీ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. ఆమె ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు చేతన్ తో పాటు ఆమె ప్రియురాలిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.