Homeజాతీయ వార్తలుWater Problem Hyderabad: తెలంగాణలో అందరికీ నీళ్లు వస్తే ఈ కష్టాల మాటేమిటి?

Water Problem Hyderabad: తెలంగాణలో అందరికీ నీళ్లు వస్తే ఈ కష్టాల మాటేమిటి?

Water Problem Hyderabad
Water Problem Hyderabad

Water Problem Hyderabad: నీళ్ళు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం పుట్టింది. తొలి దశ ఉద్యమం వీటి కోసమే సాగింది. మలిదశ ఉద్యమంలోనూ వీటికి స్వీయ పాలన డిమాండ్ జత కలిసింది. దీంతో ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. అనేకానేక ఘర్షణల తర్వాత తెలంగాణ కల సాకారమయింది. భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలోనే వేటి కోసమైతే తెలంగాణ ఉద్యమం సాగిందో..వాటి సాధనకు అడుగులు పడ్డాయి. అవి సరైన మార్గంలో పడి ఉంటే ఇంత విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉండేది కాదు.

తెలంగాణ ఏర్పడే నాటికి 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ తో ఉండేది. కానీ ఇప్పుడు నాలుగు లక్షల కోట్ల అప్పులోకి వెళ్ళింది. అంతేకాదు రిజర్వ్ బ్యాంక్ కు బాండ్లు విక్రయిస్తే తప్ప ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు..ఇలా నిధులు లక్షిత వర్గాలకు అందకుండా పోయాయి. ఉద్యమంలో ఏ శక్తులకయితే వ్యతిరేకంగా పోరాటాలు సాగాయో..ఆ శక్తులే నేడు పాలనలో కీలకంగా మారడం విశేషం. పైగా వారి ప్రాపకం కోసం ఉద్యమ నాయకుడు వెంపర్లాడుతుండడం మరింత బాధాకరం. చివరికి అమరవీరుల జ్యోతి నిర్మాణాన్ని కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లు చేపట్టడం విశేషం. అంటే ఇక్కడ కాంట్రాక్టర్లు లేరా, వారికి ఆ దమ్ము లేదా అనే ప్రశ్న వేస్తే.. తర్వాత వచ్చే సమాధానం నువ్వు తెలంగాణ ద్రోహివి అని.

Water Problem Hyderabad
Water Problem Hyderabad

ఇక కాలేశ్వరం పేరుతో గొప్ప ప్రాజెక్టు నిర్మించామని గప్పాలు కొడుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇవాల్టికి హైదరాబాద్ నగరానికి ప్రతిరోజు నీళ్లు ఇవ్వలేని దుస్థితిలో ఉంది. శివారు ప్రాంతాల్లో అయితే మూడు రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి. మిషన్ భగీరథ పేరుతో ఇంటింటికి నీళ్లు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.. కానీ వాస్తవ పరిస్థితి అలా లేదు.. గండిపేట, ఉస్మాన్ సాగర్, కృష్ణాజలాలు ఉన్నప్పటికీ హైదరాబాద్ నగరానికి నీళ్లు అందించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. పైగా ఇచ్చే నీటిలోనూ స్వచ్ఛత లేకపోవడంతో జనాలు అనివార్యంగా ట్యాంకర్ల ద్వారా నీరు తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతి ఇంటికి ఉచితంగా నీరు సరఫరా చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఉచిత నీళ్లు సంగతి దేవుడెరుగు.. కనీసం పన్ను కట్టగా వచ్చే ఆ నీళ్లు కూడా సక్రమంగా రాని దుస్థితి. చెరువులన్నీ కబ్జాకు గురి కావడంతో హైదరాబాద్ నిల్వనీటి సామర్థ్యాన్ని కోల్పోయింది. 60 అడుగులు వేస్తే తప్ప బోరులో నీరు పడని దుస్థితి. అలాంటప్పుడు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. ఫలితంగా గుక్కెడు నీటి కోసం సగటు హైదరాబాది “పానీ” పట్టు యుద్ధం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలు వదిలేసి కేవలం హైదరాబాద్ గురించే ఎందుకు చెబుతున్నామంటే.. హైదరాబాద్ అనేది తెలంగాణకు గుండెకాయ లాంటిది కాబట్టి.. తెలంగాణ రాష్ట్రానికి సగం ఆదాయం ఈ ప్రాంతం నుంచే వస్తుంది కాబట్టి..

నియామకాల విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ కావడంతో నిరుద్యోగుల ఆశలు మొత్తం అడియాసలయ్యాయి. సుమారు 30 లక్షల మంది నిరుద్యోగులు ఏఈ, గ్రూప్_1 వంటి ప్రశ్న పత్రాలు లీక్ కావడంతో బోర్డు నియామక పరీక్షలన్నింటినీ రద్దు చేసింది. ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తామనేది బోర్డు నుంచి ఇంకా క్లారిటీ రాలేదు.. మరోవైపు లక్షలకు లక్షలు డబ్బులు పోసి కోచింగ్ తీసుకున్న నిరుద్యోగులు సర్కారు నిర్ణయంతో కన్నీటి పర్యంతమవుతున్నారు.. ఇక మరోవైపు ప్రభుత్వం అందరికీ ఉపాధి కల్పించామని గొప్పలు పోతోంది.. మరి అందరికీ ఉపాధి కల్పిస్తే 30 లక్షల మంది తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఎలా దరఖాస్తు చేసుకున్నారు అనే ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు.. ప్రభుత్వ పాలనలో ఇన్ని లోపాలు ఉన్నప్పటికీ.. వాటిని డైవర్ట్ చేసేందుకు రోజుకొక పన్నాగం పన్నుతోంది. తెరపైకి మళ్ళీ ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ ను తీసుకొస్తోంది. ఇరు రాష్ట్రాల మధ్య పరిష్కరించుకోవలసిన సమస్యలు ఎన్నో ఉన్నప్పటికీ.. వాటి వైపు చొరవ చూపకుండా.. కేవలం సెంటిమెంట్ రగిలించే విషయాల మీద మాట్లాడటం గమనార్హం.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular