Hyderabad: క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు జీవితాలను కకావికలం చేస్తాయని మన పెద్దలు ఊరికే చెప్పలేదు. ఏదో మాయలో పడి అదే కావాలని వెళితే చివరకు మిగిలేది శూన్యమే అని మరోసారి నిరూపితమైంది. ఇప్పుడు మేము చెప్పబోయే కథ వింటే ఇలాంటి వారందరికీ జ్ఞానబోధ కలగకమానదేమో. ప్రియురాలి మోజులో పడి పచ్చని సంసారం పాడు చేసుకున్న ఓ ప్రబుద్ధుది కథ ఇది. చివరకు తప్పు తెలుసుకొని లబోదిబోమంటున్నాడు. కానీ జరగాల్సిందంతా జరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఏడిస్తే ఏం వస్తుంది చెప్పండి.

అసలు విషయం ఏంటంటే.. హైదరాబాద్ లోని కూకట్ పల్లికి చెందిన ఓ వ్యక్తి ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. భార్య కూడా మంచి జాబ్ చేయడంతో ఆర్థికంగా ఎలాంటి లోటు లేదు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇలా హాయిగా సాగిపోతున్న వారి సంసారంలో ఓ చిచ్చు రేగింది. అదేంటంటే కొంతకాలం క్రితం ఆ వ్యక్తికి ఓ వివాహితతో పరిచయం ఏర్పడింది. రాను రాను వారి మధ్య సాన్నిహిత్యం పెరిగి చివరకు ప్రేమకు దారి తీసింది. ఇంకేముంది చాటింగ్ లు మీటింగులు అంటూ ప్రేమ విహారంలో మునిగితేలారు.
Also Read: Hero Madhavan Son: అంతర్జాతీయ స్థాయిలో అరుదైన రికార్డు సృష్టించిన హీరో మాధవన్ కొడుకు
తన ప్రేమ విషయాన్ని భార్యకు తెలియకుండా మెయింటైన్ చేస్తూ వచ్చాడు. ఇక వారిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా ప్రేమ మైకంలో మునిగితేలారు. ఈ క్రమంలోనే రెండు నెలల క్రితం ఇద్దరు కలిసి పారిపోయారు. భర్త తప్పిపోయాడని ఫిర్యాదు చేసిన భార్యకు.. పోలీసుల విచారణలో అసలు విషయం తెలిసి షాక్ అయిపోయింది. దీంతో అలాంటి వ్యక్తి తనకు వద్దంటూ నిర్ణయం తీసుకుని పిల్లలతో కలిసి జీవిస్తోంది. అయితే సడన్ గా ఆ భర్త సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు.
తాను తప్పి పోలేదని తనకు తన భార్య కావాలంటూ పోలీసులను వేడుకున్నాడు. ఇంత సడన్ గా అతనిలో ఈ మార్పు ఎందుకు వచ్చిందో ఆరా తీయగా పోలీసులకు షాకింగ్ న్యూస్ తెలిసింది. అదేంటంటే.. అతను తీసుకెళ్లిన ప్రియురాలు తిండికి, షాపింగ్ కు, జల్సాలకు విపరీతంగా ఖర్చు పెట్టేదట. తన విలాసవంతమైన జీవితం కోసం అతనితో ఒక నెలలోనే పది లక్షలకు పైగా అప్పు చేయించిందట. ఆ ఖర్చులు భరించలేక తప్పు తెలుసుకొని భార్యతో కలిసిపోయేందుకు ప్రయత్నించాడు.
పెద్ద మనుషులతో రాజీ కుదుర్చుకోవడానికి ప్రయత్నించగా.. ఆమె ఛీ కొట్టింది. దీంతో చేసేది లేక చివరకు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. ఎలాగైనా తన భార్యతో తనను కలపాలంటూ వేడుకుంటున్నాడు. ఇక పోలీసులు కూడా వారిద్దరిని కలిపే ప్రయత్నంలో ఉన్నారు. మరి అతని తప్పును భార్య క్షమిస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.
Also Read: US Presidential Building: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష భవనం సెక్యూరిటీ ఏ లెవల్ లో ఉంటుందో తెలుసా?