Titanic Submersible Tragedy: అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు ఓషన్ గేట్ అనే సంస్థకు చెందిన మినీ జలాంతర్గామిలో జూన్ 18న వెళ్లిన ఐదుగురు పర్యాటకుల సాహస యాత్ర తీవ్ర విషాదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ యాత్రకు బయలుదేరిన మినీ జలాంతర్గామి సముద్రంలో ఏర్పడిన అతి తీవ్రమైన ఒత్తిడి వల్ల పేలిపోయింది. దీంతో అందులోని వారంతా ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయారు. అప్పటినుంచి వారి ఆచూకీకి సంబంధించి చేయని ప్రయత్నం అంటూ లేదు. తాజాగా ప్రమాదానికి గురైన జలాంతర్గమి శకలాలను సముద్ర గర్భం నుంచి ఒడ్డుకు చేర్చారు. బుధవారం వాటిని తీరానికి తీసుకొచ్చారు. “అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ నౌక శకలాల సందర్శనకు వచ్చే పట్టిన సాహస యాత్ర విషాదమైంది. పేలిపోయిన టైటాన్ మినీ జలాంతర్గామి శకలాలను సముద్ర గర్భం నుంచి ఒడ్డుకు చేర్చాం” అని అమెరికా గోస్ట్ గార్డ్ దళాలు వెల్లడించాయి. కెనడాలోని న్యూ ఫౌండ్ ల్యాండ్ అండ్ లాబ్రడార్ ప్రావిన్స్ లోని సెయింట్ జాన్స్ ఓడరేవుకు బుధవారం తీసుకొచ్చామని వివరించాయి. చనిపోయిన పర్యాటకుల అవశేషాలను టైటాన్ శకలాల నుంచి స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించాయి.” తిరిగి పొందిన మానవ అవశేషాల అధికారిక విశ్లేషణను అమెరికా వైద్య నిపుణులు జాగ్రత్తగా నిర్వహిస్తారు” అని ప్రకటించాయి.
దర్యాప్తు లో కీలకం
టైటాన్ జలాంతర్గామి పేలిపోవడానికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు జరుగుతోంది. శకలాల వెలికితీత దీనికి సంబంధించి కీలక పరిణామం అని కోస్ట్ గార్డ్ అధికారుల బృందం భావిస్తున్నది. 111 సంవత్సరాల కిందట మునిగిపోయిన టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు ప్రయాణించిన ఐదుగురు సాహస యాత్ర బృందం దుర్మరణం చెందడం విధితమే. దుబాయ్ లో ఉంటున్న బ్రిటిష్ వ్యాపారావేత్త హమీష్ హార్డింగ్, ప్రాన్స్ నావికుడు పౌల్ హెన్ని నర్గో లెట్, పాకిస్తాన్ బిలియనీర్ సజాద్ దావూద్, కుమారుడు సులేమాన్, సాహస యాత్ర నిర్వహించే ఓషన్ గేట్ వ్యవస్థాపకుడు స్టాక్టన్ రుష్ ఈ ప్రమాదంలో దుర్మరణం చెందారు.. ఒక స్పోర్ట్స్ బ్యూటీ వెహికల్ కారు పరిమాణం లో ఉన్న జలాంతర్గామి ఉత్తర అట్లాంటిక్ సముద్రంలోని రెండు కిలోమీటర్ల కంటే ఎక్కువ లోతులో ఉన్నప్పుడు అధిక ఒత్తిడి కారణంగా పేలిపోయి అందులో ఉన్న ఐదుగురూ దుర్మరణం చెందారు. నౌక సహాయంతో సముద్ర గర్భంలోకి ప్రయాణం మొదలైన దాదాపు రెండు గంటల్లోనే సబ్ మెరైన్ గల్లంతయింది. ఉపరితలంపై ఉన్న నౌకకు సంకేతాలు నిలిచిపోవడంతో అమెరికా, కెనడా కోస్ట్ గార్డ్ దళాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. మూడు రోజులపాటు ముమ్మరంగా సాగిన రెస్క్యూ ఆపరేషన్ అనంతరం సబ్ మెరైన్ పేలిపోయినట్టు ధ్రువీకరించారు.
సముద్రంలో సబ్ మెరైన్ శిథిలాలను మరింత విశ్లేషణ కోసం కట్టర్ పోర్టుకు తీసుకెళ్తామని అమెరికా కోస్ట్ కార్డు ప్రకటించింది.”టైటాన్ ప్రమాదానికి దారి తీసిన కారకాలను అవగాహన చేసుకునేందుకు, ఇలాంటి విషాదం చోటు చేసుకోకుండా ఉండడానికి బలమైన కృషి చేయాల్సి ఉంది.” అని కెప్టెన్ జాసన్ నెబ్యూర్ అన్నారు. న్యూయార్క్ లోని పెలాజిక్ రీసెర్చ్ సంస్థకు చెందిన రిమోట్ ఆపరేటర్ వాహనం సహాయంతో శకలాలు బయటకు తీశామని జాసన్ నెబ్యూర్ వివరించారు. ఇక సముద్రపు అడుగుభాగం లో టైటానిక్ నౌక శకలాలకు 16 వేల అడుగుల దూరంలో సబ్ మెరైన్ శిథిలాలు గుర్తించారు. సముద్ర ఉపరితలం నుంచి రెండు మైళ్ళకంటే ఎక్కువ దూరం ఉన్న ఈ ప్రాంతం.. న్యూ ఫాండ్లాండ్ తీరానికి 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాగా ఈ ప్రమాదానికి సంబంధించి టైటానిక్ సినిమా తీసిన జేమ్స్ కామెరూన్ కూడా తీవ్రంగా స్పందించారు. టైటానిక్ చిత్రీకరణ కోసం 13 సార్లు ఆయన ఆ శిథిలాల వద్దకు వెళ్లారు. ఈ భూమ్మీద అత్యంత దుర్భరమైన వాతావరణం అక్కడ ఉంటుందని, ఇలాంటి ప్రమాదం చోటు చేసుకోవడం దారుణమని ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అక్కడ నీరులో తీవ్ర ఒత్తిడి ఉండడం వల్ల సబ్ మెరైన్లు పేలిపోతాయని ఆయన వివరించారు.