Toll Charges: ఒకప్పుడు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లడానికి సింగిల్ లేదా డబుల్ రోడ్లు ఉండేవి. అప్పట్లో బస్సు లేదా రైలు ద్వారా ప్రయాణాలు సాగించేవారు. కొంతకాలానికి వ్యక్తిగత వాహనాల కొనుగోలు పెరిగింది. వాహనాల రద్దీ పెరగడంతో కనెక్టివిటీ పేరుతో ప్రభుత్వాలు రహదారులను నిర్మించడం మొదలైంది. అయితే ఈ నిర్మాణ విషయంలో “పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్” అనే విధానాన్ని అవలంబించడం వల్ల.. ఆ రోడ్డు నిర్మాణానికి పెట్టిన ఖర్చు మొత్తాన్ని ప్రజల నుంచి వసూలు చేయడం మొదలుపెట్టారు. అలా మనదేశంలో పలు ఎక్స్ప్రెస్ హైవే ల్లో టోల్ వసూలు ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రభుత్వ నిర్మిస్తున్న అనేక జాతీయ రహదారుల పై టోల్ వసూలు చేస్తున్నారు. కొంతకాలం నుంచి ఫాస్టాగ్ అనే విధానాన్ని అనుసరిస్తున్నారు. దీనివల్ల నేరుగా వాహనదారుడి ఖాతా నుంచి డబ్బు డెబిట్ అవుతుంది. అయితే టోల్ చార్జీలు ఎటికేడు పెరుగుతున్న నేపథ్యంలో వాహనదారులకు వాటిని భరించడం చాలా ఇబ్బంది అవుతుంది. కొంతమంది తరచూ జాతీయ రహదారుల మీదుగా ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు. అలాంటప్పుడు వారికి టోల్ చార్జీలు భరించడం ఒకింత ఇబ్బందవుతుంది. ఈ క్రమంలో టోల్ చార్జీల నుంచి తప్పించుకోవడం సాధ్యపడదు. అయితే ఈ చిన్ని చిట్కాలు పాటిస్తే టోల్ చెల్లించకుండానే ప్రయాణాలు సాగించవచ్చు.
హైవేల మీద ప్రయాణం సుఖవంతంగానే ఉంటుంది. టోల్ బూత్ దగ్గరికి వస్తేనే ఆ సుఖం స్థానంలో నిట్టూర్పు వస్తుంది. అందుకే టోల్ బూత్ దగ్గరికి రాగానే వాహనాలను బ్యాక్ రోడ్డు కు మల్లిస్తే టోల్ బాధ నుంచి తప్పించుకోవచ్చు. మళ్లీ సుఖవంతమైన ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు నడిపే వారు టోల్ బాధ నుంచి తప్పించుకోవచ్చు. టోల్ బూత్, హైవే లను తప్పించి బ్యాక్ రోడ్ల మీదుగా వెళ్ళటం వల్ల ప్రయాణ సమయం పెరిగినప్పటికీ.. టోల్ చార్జీల చెల్లింపు నుంచి మినహాయింపు లభిస్తుంది. పైగా ప్రయాణాన్ని ఆస్వాదించే అవకాశాన్ని కల్పిస్తుంది.
ఇక చాలామందికి టోల్ గేట్ బూత్ వచ్చేదాకా తెలియదు. రోడ్డు పక్కన బోర్డులు సూచికగా కనిపిస్తున్నప్పటికీ సరిగా పట్టించుకోరు. తీరా టోల్ బూత్ వద్దకు వెళ్లేసరికి నిట్టూరుస్తారు.. ఫాస్టాగ్ లో డెబిట్ అయ్యేసరికి ఆవేదన వ్యక్తం చేస్తారు. అలాంటివారు ఏం చేయాలంటే గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి.. జర్నీ స్టార్టింగ్ పాయింట్.. ఎండింగ్ పాయింట్ నెంబర్ చేయాలి. ఐఫోన్ లో కుడి ఎగువ మూలలో ఉన్న మూడు చుక్కల మెనూ.. ఆండ్రాయిడ్ లో మూడు నిలువు చుక్కలను నొక్కాలి. అందులో ఉన్న ఆప్షన్స్ ఎంచుకుని “టోల్ నివారించండి లేదా మోటార్ వేలను నివారించండి” అనే వాటిని ఓకే చేయాలి. ఇక డ్రైవింగ్ ప్రారంభిస్తే గూగుల్ మ్యాప్స్ మనం ఇచ్చిన ప్రాధాన్యతలను గుర్తుంచుకొని..టోల్ బూత్ సమీపంలో ఉందనగానే సూచనలు చేస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి నెలలో నాలుగు లేదా ఐదు సార్లు హైవేల మీద ప్రయాణించినప్పుడు టోల్ చార్జీలు వాహనంలో పోసే ఇంధనానికి వెచ్చించే వాటిలో పావు శాతం వరకు ఉంటాయని ఒక అంచనా.. అందుకే చాలామంది టోల్ బాధ నుంచి తప్పించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ తీరా టోల్ గేట్ బూత్ వచ్చేసరికి చార్జ్ చెల్లించి నిట్టూరుస్తూ వెళ్ళిపోతారు. అందుకే హైవేల మీద ప్రయాణం చేసేటప్పుడు గూగుల్ మ్యాప్స్ లాంటి సాంకేతిక ఉపకరణాలను వాడాలి. అప్పుడే తక్కువ ఖర్చుతో హాయిగా ప్రయాణం చేయవచ్చు.