
Zojila Tunnel: ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కాశ్మీర్, లద్దాఖ్ లను కేంద్రపాలిత ప్రాంతాలుగా కేంద్రం విభజించింది. వాటి అభివృద్ధి కోసం భారీగా నిధులు వెచ్చిస్తోంది. రోడ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలతో ఆ ప్రాంతాల రూపురేఖలు సమూలంగా మార్చేస్తోంది. భౌగోళికంగా శ్రీనగర్ _ లేహ్ మధ్య ఉన్న ఒకటో నెంబర్ జాతీయ రహదారి భారతదేశానికి అత్యంత ముఖ్యమైనది. అయితే ఈ రోడ్డుపై భారత ప్రభుత్వం 25 వేల కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేస్తున్నది. ఇందులో భాగంగా 19 సొరంగాలను నిర్మిస్తోంది. ఈ సొరంగంలో ఒకదానికి జడ్ మోర్ పేరు పెట్టారు. 6.5 కిలోమీటర్లు పొడవున ఈ సొరంగం ఉంటుంది. 19 సొరంగాలలో ఇది అతి పెద్దది. దీనికోసం 2,680 కోట్లు ఖర్చు చేస్తున్నారు. మరోవైపు జమ్ము కాశ్మీర్, లద్దాఖ్ మధ్య ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు జోజిలా టన్నెల్ నిర్మిస్తున్నారు.
జోజిలా టన్నెల్ వార్తల్లోకి రావడానికి ప్రధాన కారణం.. ఇది ఆసియాలోనే అతిపెద్దది. దీని పొడవు 14.15 కిలోమీటర్లు. 7.57 మీటర్ల ఎత్తులో ఒక గుర్రపు నాడ ఆకారంలో ఉంటుంది. దీనికోసం సుమారు 6,800 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇందులో వాహనాలు గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే అవకాశం ఉందని చెబుతున్నారు.
కాశ్మీర్లో భౌగోళిక వాతావరణం దుర్భేద్యంగా ఉంటుంది. ఇలాంటప్పుడు రహదారులు చాలా నాణ్యంగా ఉండాలి. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అక్కడ రహదారుల మీద భారీగా ఖర్చు చేస్తున్నట్లు కనిపిస్తోంది.. కాశ్మీర్లోని గాంధార్బల్, లద్దాఖ్ లోని జిల్లా డ్రాస్ పట్టణానికి మధ్యలో జోజిలా పాస్ ఉంది. ఈ పాస్ లోని కొండలను తొలచి జోజిలా టన్నెల్ నిర్మిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా జెడ్ మోర్ తమిళ్ మార్గాన్ని జోజిలా టన్నెల్ తో అనుసంధానం చేయవచ్చు. ఈ రెండు టన్నెళ్లకు మధ్య 18.475 కిలోమీటర్ల హైవే అభివృద్ధి చేస్తున్నారు. అవసరం మేరకు మూడు కిలోమీటర్ల మేర విస్తరణ పనులు జరుగుతున్నాయి. మిగతా మార్గాన్ని కొత్తగా నిర్మిస్తున్నారు. ఈ హైవేలో 5 వంతెనలు, రెండు స్నో గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు.

ఇక ప్రస్తుతం శ్రీ నగర్ నుంచి లద్దాఖ్ లెహ్ చేరుకోవాలంటే 10 గంటల సమయం పడుతుంది. ఈ మార్గంలో వాతావరణం ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండదు. పైగా ఎత్తైన జో జి లా పాస్ పర్వత మార్గం మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది. అక్కడ ప్రయాణానికి దాదాపు మూడు గంటల వరకు సమయం పడుతుంది.. జోజిలా టన్నెల్ అందుబాటులోకి వస్తే 20 నిమిషాలే పడుతుందని అధికారులు చెబుతున్నారు. చలికాలంలో జోజిలా వద్ద మంచు ఎక్కువగా కురుస్తూ ఉంటుంది. కొండ చరియలు విరిగి పడుతూ ఉంటాయి. కొన్నిసార్లు వాహనాలు కూడా రోడ్లమీద నుంచి జారీ అదుపుతప్పుతుంటాయి. అందుకే ముందు జాగ్రత్త చర్యగా రాకపోకలు నిలిపివేస్తారు. దీంతో కనీసం ఐదు నెలల పాటు దేశంలోని మిగతా భూభాగంతో ప్రజలకు సంబంధాలు తెగిపోతాయి. అలాంటప్పుడు ప్రజలకు విమాన ప్రయాణమే దిక్కు. అందుకే ఈ టన్నెల్ ను ప్రతిపాదించారు. ఇది కనుక అందుబాటులోకి వస్తే అన్ని కాలాల్లోనూ కాశ్మీర్ వాసులు సులభంగా ప్రయాణం సాగించవచ్చు. ఇక ఈ సొరంగ మార్గం నిర్మాణంలో స్మార్ట్ టన్నెల్ వ్యవస్థ వాడుతున్నారు. ఇందులో భాగంగా న్యూ ఆస్ట్రియన్ టన్నెలింగ్ మెథడ్ అనుసరిస్తున్నారు. ఈ విధానంలో సీసీటీవీ, రేడియో కంట్రోల్, నిరంతర విద్యుత్ సరఫరా, విద్యుత్ సౌకర్యం ఉంటాయి. ఈ సాంకేతికతను ఉపయోగించడం ద్వారా ప్రభుత్వానికి ఐదువేల కోట్ల వరకు ఆదా అయ్యాయని తెలుస్తోంది.