
Richest CM: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పేదానికి.. వాస్తవానికి మధ్య చాలా తేడా ఉంటుంది. ఆ మధ్య ఒక బహిరంగ సభలో మాట్లాడిన సీఎం జగన్మోహన్ రెడ్డి.. ‘నాకు ఆర్థిక బలం లేదు’ అంటూ నిరుపేద పలుకులు పలికారు. అయితే, ఆ పలుకులన్నీ వట్టి చిలక పలుకులేనని.. వాస్తవంగా దేశంలోనే సంపన్న ముఖ్యమంత్రిగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారని రుజువైంది.. ఈ మేరకు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడిఆర్) దేశంలోని ముఖ్యమంత్రుల ఆస్తులను వెల్లడించింది. సంపన్న ముఖ్యమంత్రిగా జాబితాలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మొదటి స్థానంలో ఉండగా.. నేరచేతుల జాబితాలో తెలంగాణ సీఎం కేసీఆర్ ముందంజలో ఉండడం గమనార్హం.
శంలోనే టాప్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి..
దేశ వ్యాప్తంగా ముఖ్యమంత్రుల ఆర్థిక స్థితిగతులతో కూడిన నివేదికను ఏడీఆర్ వెల్లడించింది. స్వయంగా ఆయా అభ్యర్థులు ఎన్నికల అఫిడవిట్ లు ఆధారంగానే ఈ నివేదికను వెల్లడించింది. ఈ జాబితాలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రూ.510 కోట్ల ఆస్తులతో అగ్రస్థానంలో దేశంలోనే సంపన్న ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. కోటి రూపాయలు అప్పు ఉన్నట్లు జగన్మోహన్ రెడ్డి చూపించారు. దేశంలోని మొత్తం ముఖ్యమంత్రుల సగటు ఆస్తుల విలువ రూ.33.96 కోట్లు కావడం గమనార్హం. సీఎం జగన్ మోహన్ రెడ్డి తరువాత రెండో స్థానంలో రూ.163 కోట్ల రూపాయల ఆస్తులతో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు ఉన్నారు. ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రూ.63 కోట్ల రూపాయల ఆస్తులతో మూడో స్థానంలో, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.23 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు పేర్కొన్నారు. ఈ జాబితాలో ఆయన ఆరో స్థానంలో నిలిచారు. ఇకపోతే ఎనిమిది కోట్ల రూపాయలు అప్పులు ఉన్నట్లు కూడా కేసీఆర్ వెల్లడించారు. అత్యధిక అప్పులు ఉన్న ముఖ్యమంత్రిగా ఆయన నిలిచారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీహార్ సీఎం నితీష్ కుమార్ లకు మూడు కోట్లు చొప్పున ఆస్తులున్నాయి. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, హర్యానా సీఎం మనోహర్ లాల్ కు కోటికి పైగా మాత్రమే ఆస్తులున్నట్లు వెల్లడించారు.
నేర చరితుల జాబితాలో అగ్ర స్థానంలో కేసిఆర్
ఇదే నివేదిక 30 మంది ముఖ్యమంత్రిల్లో 13 మంది తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది. తమపై హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, బెదిరింపులు, ఆస్తుల ధ్వంసం వంటి నేరపూరిత చర్యలకు పాల్పడిన కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో వాళ్లే పొందుపరిచారు. ఇవి ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడే సెక్షన్లు కింద నమోదైన కేసులు. తెలంగాణ సీఎంపై 64 కేసులు నమోదయ్యాయి. అత్యధిక కేసులు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రుల్లో ఆయనదే అగ్రస్థానం. ఆ తరువాత తమిళనాడు సీఎం స్టాలిన్ 47 కేసులతో రెండో స్థానంలో ఉన్నారు. 38 కేసులతో జగన్ మూడో స్థానంలో నిలిచారు. ఇందులో ఫోర్జరీ, బెదిరింపులు, దాడులతోపాటు అక్రమాస్తులపై సిబిఐ, ఈడి నమోదు చేసిన కేసులు ఉన్నాయి.

రూపాయి జీతం తీసుకునే సీఎంకు ఆస్తులు ఎలా..
రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి రూపాయి జీతం మాత్రమే తీసుకుంటున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యం అంటూ ఆయన అనేక సందర్భాల్లో ప్రకటించారు కూడా. అటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డికి కోట్లాది రూపాయలు ఆస్తులు ఎలా వచ్చాయి అన్నది ఇప్పుడు అందరిని వేధిస్తున్న ప్రశ్న. ఎన్నికల అఫిడవిట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్న ఆస్తులతో పోలిస్తే.. వాస్తవంగా మరిన్ని రెట్లు ఆస్తులు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. అయితే, ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న ఆయన ఆస్తులు ప్రకారం ఏఏ వ్యాపారాలు చేస్తున్నారు అన్నది సర్వత్ర ఆసక్తిని కలిగిస్తోంది. దేశంలోనే సంపన్న ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి తనకు ఆర్థిక వనరులు లేవని చెప్పడం విడ్డూరంగా ఉందని తెలుగుదేశం పార్టీ విమర్శలుస్తోంది.